Share News

నన్నే ఆపుతారా?

ABN , Publish Date - Nov 27 , 2026 | 05:24 AM

ఆయన మారరు. అదే దూకుడు..అదే అతి ప్రవర్తన. గన్నవరం ఎయిర్‌పోర్టులో జిల్లా కలెక్టరు షూలేసుల విషయంలో దురుసుగా ప్రవర్తించారు.

నన్నే ఆపుతారా?

  • టోల్‌ ఫీజు అడిగిన సిబ్బందిపై ఐఏఎస్‌ కార్తికేయ మిశ్రా ‘అతి’

  • సీఎంవో సెక్రటరీ కారునే ఆపుతారా అంటూ చిందులు

  • ఐఐఎస్‌లకు టోల్‌ మినహాయింపు లేదు

  • అయినా.. స్థాయి మరిచి చిరుద్యోగితో గొడవ

  • ఆ ఉద్యోగిని తీసేయాలంటూ హూంకరింపు

  • విజయవాడ పశ్చిమ బైపాస్‌లోని

  • వెంకటపాలెం టోల్‌ వద్ద ఘటన

  • గతంలోనూ వివాదాస్పదంగా ఆయన తీరు

తుళ్లూరు, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఆయన మారరు. అదే దూకుడు..అదే అతి ప్రవర్తన. గన్నవరం ఎయిర్‌పోర్టులో జిల్లా కలెక్టరు షూలేసుల విషయంలో దురుసుగా ప్రవర్తించారు. ఆ తర్వాత ఆయనకు లేసులు ఉన్న షూస్‌ను కొరియర్‌లో పంపారు. తన దగ్గరకు ఎవరు వచ్చినా చీదరించుకోవడం, దూషించి పంపించివేయడం పరిపాటిగా మారింది. సీఎం ఇంట్లో కూడా ఇటీవల గొడవ పడ్డారు. చివరకు.. తన స్థాయి మరిచి.. టోల్‌గేట్‌ వద్ద పనిచేసే చిరు ఉద్యోగితో కూడా గొడవ పెట్టుకున్నారు. టోల్‌గేటు ఫీజు అడగడం ఆ ఉద్యోగి చేసిన నేరం. ఐఎస్‌లకు టోల్‌ మినహాయింపు లేదని తెలుసు. ఆయన టోల్‌ ఫీజు బిల్లు ప్రభుత్వమే చెల్లిస్తుంది. అయినా, ‘సీఎంవో సెక్రటరీ కారునే ఆపుతారా’ అంటూ అనవసరంగా గొడవ పెట్టుకున్నారు. దీంతో.. సీఎంవో కార్యదర్శి, సీనియర్‌ ఐఏఎస్‌ కార్తికేయ మిశ్రా.. ఇక మారరని ప్రభుత్వ వర్గాలే చర్చించుకుంటున్నాయి. ఆ వివరాలు.. ఐఏఎస్‌ అధికారి కార్తికేయ మిశ్రా


కారులో గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో విజయవాడ పశ్చిమ బైపాస్‌ లోని వెంకటపాలెం టోల్‌ గేట్‌ వద్దకు వచ్చారు. అక్కడ విధుల్లో ఉన్న ఉద్యోగి ఆయన కారును ఆపాడు. మిగతా వాహనదారులను అడిగినట్టే టోల్‌గేట్‌ ఫీజు రూ. వంద కట్టాలని అడిగాడు. అంతే.. కార్తికేయ మిశ్రా ఉగ్రుడయిపోయారు. ‘నేను సీఎంవో సెక్రటరీని. నా నుంచే ఫీజు వసూలు చేస్తావా?’ అంటూ తన అధికారాన్ని చూపించుకున్నారు. నిజానికి, టోల్‌గేట్‌ ఫీజును ఎవరైనా కట్టాల్సిందే. ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చిన వీఐపీల వివరాలను టోల్‌గేట్‌ వద్ద బోర్టులో స్పష్టంగా ప్రదర్శిస్తారు. ప్రభుత్వ ఉద్యోగుల అధిపతి అయిన ప్రధాన కార్యదర్శికి మాత్రమే ఐఎస్‌లలో మినహాయింపు ఇచ్చారు. తక్కిన అధికారులు, వారి పోర్టుపోలియోలతో నిమిత్తం లేకుండా టోల్‌ కట్టాల్సిందే.

సీనియర్‌ ఐఏఎస్‌ కార్తికేయ మిశ్రాకు ఈ విషయం తెలుసు. అయినా, తన కారును ఆపిన సిబ్బందిపై ఆయన అనవసరంగా ఆవేశపట్టారు. నేషనల్‌ హైవే అధికారులు అక్కడకు చేరుకుని ఆయనను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. పొరపాటున అలా జరిగిందంటూ.. క్షమాపణలు చెప్పినా కార్తికేయ సర్దుకోలేదు. కారు ఆపిన సెక్యూరిటీ గార్డును విధుల నుంచి తొలగించాలంటూ చిందులు తొక్కారు. బతుకుతెరువు కోసం చిరు జీతానికి పనిచేసే ఉద్యోగి తన విధులు తాను నిర్వహించినందుకు సీనియర్‌ ఐఏఎస్‌ ఆగ్రహానికి గురి కావడం చర్చనీయాంశంగా మారింది.

ఈ వార్తలనూ చదవండి:

2019, 2020 నంది అవార్డుల ఎంపికకు జ్యూరీ కమిటీ ఏర్పాటు

బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోసిన వైసీపీ నేతలు.. పోలింగ్ వాయిదా

Updated Date - Nov 27 , 2026 | 05:30 AM