అభ్యంతరాలుంటే ట్రైబ్యునల్‌కు వెళ్లండి!
ABN , Publish Date - Oct 29 , 2026 | 04:33 AM
పట్టణ స్థానిక సంస్థలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా తమ నామినేషన్ల తిరస్కరణను సవాల్ చేస్తూ పలువురు అభ్యర్థులు వేసిన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టివేసింది.
‘స్థానిక’ అభ్యర్థులకు హైకోర్టు స్పష్టీకరణ
నామినేషన్ల తిరస్కరణపై వేసిన వ్యాజ్యాలు కొట్టివేత
అమరావతి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): పట్టణ స్థానిక సంస్థలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా తమ నామినేషన్ల తిరస్కరణను సవాల్ చేస్తూ పలువురు అభ్యర్థులు వేసిన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టివేసింది. నామినేషన్లను తిరస్కరిస్తూ ఎన్నికల అధికారులు ఇచ్చిన ఉత్తర్వులపై అభ్యంతరాలుంటే ఎన్నికల ట్రైబ్యునల్ వద్ద పిటిషన్ దాఖలు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మండవ కిరణ్మయి బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. నామినేషన్ల తిరస్కరణ, ఎన్నికల అధికారుల నిర్ణయంపై ఆర్‌డీవో వద్ద దాఖలు చేసిన అప్పీళ్ల కొట్టివేత, నామినేషన్ల తిరస్కరణ గురించి తమకు సమాచారం ఇవ్వలేదని.. తాము నామినేషన్లు ఉపసంహరించుకోకపోయినా, ఉపసంహరించుకున్నట్లు అధికారులు ప్రకటించారని.. ఇలాంటి కారణాలతో హైకోర్టులో పలువురు పిటిషన్లు వేశారు. తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులు ఏకపక్షంగా తిరస్కరించారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
చిన్న చిన్న కారణాలు చూపి నామినేషన్లు తిరస్కరించారన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) తరఫున న్యాయవాదులు ఎన్.అశ్వినీ కుమార్, కె.అజయ్, త్రినాథ్ వాదనలు వినిపించారు. నిబంధనలకు అనుగుణంగా లేని నామినేషన్లను మాత్రమే ఎన్నికల అధికారులు తిరస్కరించారని.. ఏమైనా అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు ఎన్నికల ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాల్సి ఉంటుందన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు, హైకోర్టు స్పష్టమైన తీర్పులు ఇచ్చాయంటూ.. వాటి ప్రతులను కోర్టు ముందు ఉంచారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కోర్టు లు జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఆర్నబ్ తుఫాన్ బాధితులకు సీఎం చంద్రబాబు భారీ ఊరట