ఐదు కిలోమీటర్ల ప్రయాణానికి అరగంట
ABN , Publish Date - Oct 12 , 2026 | 05:24 AM
బతుకమ్మ పండుగ కోసం వారాంతాన స్వగ్రామాలకు వెళ్లిన వారు తిరిగి నగరబాట పట్టడంతో.. ఆదివారం హైదరాబాద్ - విజయవాడ రహదారి వాహనాలతో కిటకిటలాడింది. తెల్లవారు జామున 4 గంటల నుంచే ..
హైదరాబాద్-విజయవాడ రహదారిపై భారీ రద్దీ
ట్రాఫిక్‌జామ్‌తో వాహనదారుల అవస్థలు
ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్: బతుకమ్మ పండుగ కోసం వారాంతాన స్వగ్రామాలకు వెళ్లిన వారు తిరిగి నగరబాట పట్టడంతో.. ఆదివారం హైదరాబాద్ - విజయవాడ రహదారి వాహనాలతో కిటకిటలాడింది. తెల్లవారు జామున 4 గంటల నుంచే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని 65వ నంబరు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఐదు కిలోమీటర్ల దూరం దాటేందుకు ఒక్కో వాహనానికి నిమిషాలు పట్టింది. చౌటుప్పల్ పట్టణంలోని వలిగొండ రోడ్డు జంక్షన్ నుంచి ధర్మోజీగూడెం వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నెమ్మదిగా ముందుకు కదిలాయి. చౌటుప్పల్ పట్టణంతోపాటు, నల్లగొండ జిల్లా చిట్యాల ప్రధాన కూడలిలో ఫ్లైఓవర్ బ్రిడ్డి నిర్మాణ పనులు జరుగుతుండటంతో వాహనాలను సర్వీస్ రోడ్ల వెంట మళ్లిస్తున్నారు.
బస్టాండ్, చిన్న కొండూరు రోడ్డు వద్ద వాహనాలు హైవే మీదకు వెళ్లే సందర్భంలో, విజయవాడ వైపునకు వెళ్లే వాహనాలను కొద్దిసేపు ఆపుతున్నారు. దీంతో విజయవాడ వైపు వెళ్లే వాహనాలకు కొంత ఆటంకంగా మారింది. ట్రాఫిక్ పోలీసులు వాహనరద్దీని తగ్గించేందుకు చర్యలు చేపట్టారు. జాతీయ రహదారిపై ఉన్న కొర్లపహాడ్, పంతంగి టోల్‌ప్లాజా మీదుగా ఆదివారం 79వేల వాహనాలు రాకపోకలు కొనసాగించాయి. సాధారణ రోజుల్లో అయితే నిత్యం 40 వేల వాహనాలు ప్రయాణిస్తుంటాయి. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద 16 గేట్లు ఉండగా.. రద్దీ నేపథ్యంలో హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాల కోసం ఎక్కువ కేటాయించారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని కొమరబండ వద్ద, రామాపురం క్రాస్ రోడ్డు వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు నిర్వహిస్తుండటంతో, అక్కడ కూడా వాహనాల రాకపోకలకు కొంత అంతరాయం ఏర్పడింది.
ఈ వార్తలనూ చదవండి...
నెల్లూరులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
రాయలసీమ అభివృద్ధి సభలో రాజకీయాలు వద్దు: పవన్ కల్యాణ్