Share News

కోస్తాకు వాయు‘గండం’

ABN , Publish Date - Sep 23 , 2026 | 03:58 AM

కోస్తాకు తీవ్ర వాయు‘గండం’ పొంచి ఉంది. ఏపీలో 9, తెలంగాణలో 4, ఒడిసాలో 5, ఛత్తీస్‌గఢ్‌లో మూడు జిల్లాలకు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ(ఐఎండీ) హెచ్చరించింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఇప్పటికే ఉత్తరాంధ్రలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి.

కోస్తాకు వాయు‘గండం’

  • 9 జిల్లాలకు ఆకస్మిక వరద ముప్పు.. మంగళవారమే పలు జిల్లాల్లో కుంభవృష్టి

  • శ్రీకాకుళం జిల్లా పలాసలో 10 సెంటీమీటర్ల వర్షం..

  • నంద్యాల జిల్లా పాములపాడులో 10.24 సెం.మీ...

  • పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు

  • పలుచోట్ల నీట మునిగిన పొలాలు.. పలు గ్రామాల్లో నిలిచిన రాకపోకలు

  • నేటి రాత్రి విశాఖ, గోపాల్‌పూర్‌ మధ్య తీరం దాటనున్న తీవ్ర వాయుగుండం

  • నేడు, రేపు కోస్తాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఓడరేవుల్లో మూడో నంబరు హెచ్చరిక జారీ

కోస్తాకు తీవ్ర వాయు‘గండం’ పొంచి ఉంది. ఏపీలో 9, తెలంగాణలో 4, ఒడిసాలో 5, ఛత్తీస్‌గఢ్‌లో మూడు జిల్లాలకు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ(ఐఎండీ) హెచ్చరించింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఇప్పటికే ఉత్తరాంధ్రలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దక్షిణ కోస్తాలోని నంద్యాలలోనూ విస్తారంగా వర్షాలు పడ్డాయి. కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం నంద్యాల జిల్లా పాములపాడులో అత్యధికంగా 10.24, శ్రీకాకుళం జిల్లా పలాసలో 10.07, తాళభద్రలో 9.8, రావివలసలో 9.36, సంతబొమ్మాలిలో 8.81, కోటబొమ్మాలిలో 8.75, మదనపురంలో 8.3.6, కణేకల్లులో 8. హరిపురంలో 7.4, అల్లూరి జిల్లా గంపరైలో 7.15, విశాఖ జిల్లా మధురవాడలో 6.9, అరకులోయలో 6.19, గుత్తిలో 6.02, సెంటీమీటర్ల వర్షం కురిసింది. బుధవారం కుంభవృష్టి కురిసే అవకాశం ఉండటంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో బుధవారం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.


కలెక్టరేట్లలో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో గెడ్డలు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పంటపొలాలు, మురుగు కాలువలు, రోడ్లు, మైదానాలు.. చెరువులను తలపిస్తున్నాయి. గొట్టా బ్యారేజీలోకి భారీగా వరద నీరు చేరుతుండటంతో గేట్లు ఎత్తివేసి వంశధార నదిలోకి 7500 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. పలు మండలాల్లోని రైల్వేఅండర్‌ పాసేజీలలో వర్షం నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీకాకుళం నగరంలో రోడ్లు జలమయమయ్యాయి. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో నీరు భారీగా చేరి ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. విజయనగరం జిల్లా అంతటా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. వాగులు, నదుల్లో ప్రవాహం పెరిగింది. తీరంలో కెరటాలు ఉధృతంగా ఎగిసిపడుతున్నాయి. విశాఖ జిల్లాలోనూ లోతట్టు ప్రాంతాల్లోనూ, పంట పొలాల్లోనూ నీరుచేరింది. అనకాపల్లి జిల్లా కేంద్రంలోని కొండకొప్పాక వద్ద జాతీయ రహదారి పైనుంచి ఏలేరు కాలువ నీరు ప్రవహించింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోనూ గెడ్డలు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నంద్యాల జిల్లాలో మద్దిలేరు వాగు, ఇసుకవాగు, కాకిలేరు, సుద్దవాగు ఉప్పొంగి ప్రవహించాయి. పంట పొలాలు నీటమునిగాయి. కుందూనది పరవళ్లు తొక్కింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వంకలు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలో అంచనహాలు-పొలికి గ్రామాల మధ్య వంక ఉధృతికి ఎడ్లబండి కొట్టుకుపోయింది. బండిపై ఉన్న రైతును, ఆరుగురు కూలీను గ్రామస్థులు కాపాడారు. బండికి కట్టిన ఎద్దులనూ అతికష్టంమీద ఒడ్డుకు తెచ్చారు. తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయం నుంచి పరిస్థితిని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత సమీక్షించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అత్యవసర సేవల కోసం విపత్తు నిర్వహణ సంస్థ టోల్‌ఫ్రీ నంబర్లు 112, 1070, 18004250101ను సంప్రదించాలని సూచించారు.


పలు జిల్లాలకు ఆకస్మిక వరద ముప్పు

పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలోని వాయుగుండం మంగళవారం సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఇది బుధవారం రాత్రికి విశాఖపట్నం-గోపాల్‌పూర్‌కు మధ్య తీరం దాటనుందని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం తెలిపింది. ఇది తీరానికి దగ్గరగా వచ్చే క్రమంలో నెమ్మదించడంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతిభారీగా, పలుచోట్ల కుంభవృష్టిగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. దీంతో ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి, మన్యం, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్‌ జిల్లాలు, తెలంగాణలోని భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదముందని తెలిపింది. ఉత్తరకోస్తాలోని ఓడరేవుల్లో మూడో నంబరు, కోస్తాలోని మిగిలిన ఓడరేవుల్లో ఒకటవ నంబరు హెచ్చరిక జారీ చేశారు. బుధవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో పలుచోట్ల కుంభవృష్టిగా, కాకినాడ, ఉభయ గోదావరి జిల్లాల్లో అతిభారీగా, కోస్తాలోని మిగిలిన జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం తెలిపింది.

ఈ వార్తలనూ చదవండి...

పాదగయలో విషాదం.. పుష్కరిణిలో స్నానానికి దిగి యువకుడి గల్లంతు..

సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

Updated Date - Sep 23 , 2026 | 03:58 AM