ఉత్తరాంధ్రలో కుండపోత
ABN , Publish Date - Sep 25 , 2026 | 05:38 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటే సమయంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో కుండపోతగా వర్షం కురిసింది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఏకధాటిగా కురిసిన వర్షాలకు వాగులు, గెడ్డలు, నదులు పొంగి ప్రవహించేలా వరద వచ్చింది. ఈ నైరుతి రుతుపవనాల సీజన్‌లో అత్యధిక వర్షపాతం నమోదైంది ఇప్పుడే.
చిలకలపల్లెలో 10.8 సెంటీమీటర్ల వర్షం
నేడూ ఉత్తర కోస్తాకు భారీ వర్షసూచన
విశాఖపట్నం, అమరావతి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటే సమయంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో కుండపోతగా వర్షం కురిసింది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఏకధాటిగా కురిసిన వర్షాలకు వాగులు, గెడ్డలు, నదులు పొంగి ప్రవహించేలా వరద వచ్చింది. ఈ నైరుతి రుతుపవనాల సీజన్‌లో అత్యధిక వర్షపాతం నమోదైంది ఇప్పుడే. శ్రీకాకుళం సమీపంలో నాగావళి నది ముఖద్వారం వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం పశ్చిమంగా వెళ్లకుండా ఉత్తర వాయువ్యంగా దిశ మార్చుకుంది. కళింగపట్నానికి నైరుతి దిశలో తీవ్ర వాయుగుండంగానే తీరం దాటిందని ఐఎండీ ప్రకటించగా, చిన్నపాటి తుఫాన్‌గామారి శ్రీకాకుళం సమీపంలో నదీ ముఖద్వారం వద్ద తీరం దాటిందని ఇస్రో వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. అమెరికా నేవీకి చెందిన జేటీడబ్ల్యూసీ కూడా తుఫాన్‌గా మారి తీరం దాటిందని ప్రకటించింది. బుధవారం రాత్రి 11 గంటల నుంచి ఒంటి గంట మధ్య తీరం దాటిన తీవ్ర వాయుగుండం ఉత్తర వాయవ్యంగా పయనించి గురువారం రాత్రి వరకు తీవ్ర వాయుగుండంగానే కొనసాగి కళింగపట్నానికి పశ్చిమ వాయవ్యంగా 150 కి.మీ., కోరాపుట్‌కు తూర్పుగా 70 కి.మీ., రాయగడకు ఆగ్నేయంగా 60 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది.
ఇది ఉత్తర వాయవ్యంగా పయనించి శుక్రవారం ఉదయానికి వాయుగుండంగా, శుక్రవారం సాయంత్రానికి తీవ్ర అల్పపీడనంగా బలహీనపడనుందని భావిస్తున్నారు. కుంభవృష్టి కురుస్తున్నందన ఒడిశా నుంచి ఉత్తరాంధ్ర వైపు వచ్చే నదులకు వరద తాకిడి పెరుగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. కళింగపట్నం నుంచి కాకినాడ వరకు ఓడరేవుల్లో మూడో నంబరు హెచ్చరిక కొనసాగిస్తున్న అధికారులు కోస్తాలోని మిగిలిన ఓడరేవుల్లో హెచ్చరికను ఉపసంహరించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున ఉత్తరాంధ్ర మత్స్యకారులు శుక్రవారం చేపల వేటకు వెళ్లొద్దని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం సూచించింది. శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు కోస్తాలో ఎక్కువచోట్ల వర్షాలు, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురుస్తాయని తెలిపింది. కాగా, శుక్రవారం ఉత్తరాంధ్రతో పాటు కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంస్థ ఎండీ ప్రఖర్‌జైన్ సూచించారు. సహాయక చర్యల కోసం ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి...