Share News

తెలుగు ఎంపీల్లో సగం మంది బిలియనీర్లే!

ABN , Publish Date - Nov 03 , 2026 | 06:18 AM

తెలుగు రాష్ట్రాల నుంచి భాష్యం రామకృష్ణ (రూ.672 కోట్లు), మేడా రఘునాథరెడ్డి (రూ.475 కోట్లు), బీద మస్తాన్‌రావు (రూ.264 కోట్లు), లింగమనేని రమేష్‌ (రూ.213 కోట్లు), రేణుకా చౌదరి (రూ.178 కోట్లు), దివాకొండ దామోదరరావు (రూ.124 కోట్లు), వైవీ సుబ్బారెడ్డి (రూ.118 కోట్లు) కూడా రూ.100 కోట్లకు పైగా ఆస్తులు కలిగి ఉన్నారు

తెలుగు ఎంపీల్లో   సగం మంది బిలియనీర్లే!
adr

  • 18 మంది రాజ్యసభ సభ్యుల్లో 9 మందికి వందల కోట్ల ఆస్తులు

  • రూ.5,300 కోట్లతో బండి పార్థసారథిరెడ్డి దేశంలోనే టాప్‌

  • అతితక్కువగా ఆర్‌.కృష్ణయ్యకు 6 కోట్ల ఆస్తులు..ఏడీఆర్‌ నివేదిక

న్యూఢిల్లీ, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాలకు చెందిన 18 మంది రాజ్యసభ సభ్యుల్లో సగం మంది బిలియనీర్లుగా ఉన్నారు. తెలంగాణకు చెందిన నలుగురు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదుగురు ఎంపీల ఆస్తుల విలువ రూ.100 కోట్లకు పైగా ఉంది. దేశవ్యాప్తంగా రూ.100 కోట్లకు మించి ఆస్తులున్న 32 మంది రాజ్యసభ సభ్యుల్లో 9 మంది తెలుగు రాష్ట్రాల వారే ఉండటం గమనార్హం. ఈ వివరాలను అసోషియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) సోమవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. రాజ్యసభలోని 233 మంది సభ్యులకు గానూ 230 మంది సమర్పించిన అఫిడవిట్లను ఏడీఆర్‌ విశ్లేషించింది. దీని ప్రకారం.. తెలంగాణకు చెందిన బీఆర్‌ఎస్‌ ఎంపీ బండి పార్థసారథిరెడ్డి రూ.5,300 కోట్లతో దేశంలోనే అత్యధిక ఆస్తులున్న ఎంపీగా మొదటిస్థానంలో నిలిచారు. కాంగ్రెస్‌ ఎంపీ అభిషేక్‌ మనుసింఘ్వీ రూ.2,558 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి భాష్యం రామకృష్ణ (రూ.672 కోట్లు), మేడా రఘునాథరెడ్డి (రూ.475 కోట్లు), బీద మస్తాన్‌రావు (రూ.264 కోట్లు), లింగమనేని రమేష్‌ (రూ.213 కోట్లు), రేణుకా చౌదరి (రూ.178 కోట్లు), దివాకొండ దామోదరరావు (రూ.124 కోట్లు), వైవీ సుబ్బారెడ్డి (రూ.118 కోట్లు) కూడా రూ.100 కోట్లకు పైగా ఆస్తులు కలిగి ఉన్నారు. మరోవైపు, తెలుగు ఎంపీల్లో అత్యల్పంగా బీజేపీ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్యకు రూ.6 కోట్ల ఆస్తులున్నాయి. రాష్ట్రాల వారీగా చూస్తే తెలంగాణ ఎంపీల ఆస్తుల విలువ రూ.8,310 కోట్లతో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. రూ.1,949 కోట్ల ఆస్తులతో ఏపీ నాలుగో స్థానంలో నిలిచింది. దేశంలోని రాజ్యసభ సభ్యుల మొత్తం ఆస్తుల విలువ రూ.26,508 కోట్లు కాగా, ఒక్కో ఎంపీ సగటు ఆస్తి రూ.115.25 కోట్లుగా ఏడీఆర్‌ పేర్కొంది.


అప్పుల్లోనూ ముందంజే..!

ఆస్తుల విషయంలోనే కాకుండా అప్పుల్లోనూ తెలుగు ఎంపీలు ముందున్నారు. అత్యధిక అప్పులున్న 10 మంది రాజ్యసభ సభ్యుల్లో ఐదుగురు తెలుగు రాష్ట్రాలే వారే ఉన్నారు. టీడీపీ ఎంపీ భాష్యం రామకృష్ణ రూ.200 కోట్ల అప్పులతో రెండో స్థానంలో ఉండగా, జనసేన ఎంపీ లింగమనేని రమేష్‌ రూ.85 కోట్లతో ఐదో స్థానంలో ఉన్నారు. వైసీపీ ఎంపీ మేడా రఘునాథరెడ్డి (రూ.82 కోట్లు) ఆరోస్థానంలో, టీడీపీ ఎంపీ బీద మస్తాన్‌రావు (రూ.75 కోట్లు) ఏడో స్థానంలో, బీఆర్‌ఎస్‌ ఎంపీ దామోదరరావు (రూ.49 కోట్లు) 9వ స్థానంలో ఉన్నారు. ఇక 230 మంది ఎంపీల్లో 72 మందిపై (31ు) క్రిమినల్‌ కేసులు ఉన్నాయని నివేదిక తెలపింది. వీరిలో 10 మంది తెలుగు రాష్ట్రాల వారే ఉన్నారు

ఈ వార్తలు కూడా చదవండి..

లైంగిక వేధింపుల కేసు.. జేఎన్‌యూ ప్రొఫెసర్ తొలగింపుపై స్టే

ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు సుప్రీంకోర్టు అనుమతి

Updated Date - Nov 03 , 2026 | 06:48 AM