యాక్..ఛీ... విషపు రాతలు
ABN , Publish Date - Feb 11 , 2026 | 03:58 AM
నిఖార్సయిన నిజాన్ని దాచిపెట్టి, ఒక పచ్చి అబద్ధాన్ని పదేపదే ప్రచారం చేయడం జగన్ రోత పత్రిక యాక్..ఛీకి ఉన్న అతిపెద్ద ప్రత్యేకత అని మరోసారి నిరూపించుకుంది. ‘
‘ఆంధ్రజ్యోతి’ స్థలంపై మళ్లీమళ్లీ తప్పుడు వాదనలు
జీవీఎంసీలో ఒక్కరు వ్యతిరేకిస్తే మొత్తంగా తిరస్కరించినట్లుగా అచ్చోసిన అబద్ధాలు
2024 నవంబరు 29న హైకోర్టు తీర్పు
తీర్పు వచ్చిన 9 నెలలకు కౌన్సిల్‌లో తీర్మానం
ఇందులో అధికార బలప్రదర్శన ఎక్కడిది?
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
నిఖార్సయిన నిజాన్ని దాచిపెట్టి, ఒక పచ్చి అబద్ధాన్ని పదేపదే ప్రచారం చేయడం జగన్ రోత పత్రిక యాక్..ఛీకి ఉన్న అతిపెద్ద ప్రత్యేకత అని మరోసారి నిరూపించుకుంది. ‘ఆంధ్రజ్యోతి’కి భూ కేటాయింపులను రద్దుచేయాలన్న జగన్ సర్కారు నిర్ణయాన్ని తప్పుపడుతూ హైకోర్టు ఉతికి ఆరేసింది. బుర్రపెట్టి ఆలోచించకుండా, భూ కేటాయింపులను రద్దుచేశారని కర్రుకాల్చి వాతలుపెట్టినా ఆయన రోతపత్రిక బుద్ధి మారలేదు. ‘ఆంధ్రజ్యోతి’కి ఏదో చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలు మేళ్లు చేసినట్లుగా, చివరకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ) సర్వసభ్య సమావేశంలో భూ మార్పిడి ప్రతిపాదనను తిరస్కరించినా దొడ్డిదారిన ఆమోదించారంటూ కట్టుకథలను వండివారుస్తోంది. కౌన్సిల్ తీర్మానంతో గోల్‌మాల్ అంటూ కబోదిరాతలు అచ్చేసింది. కూటమి సర్కారు ఆయాచిత లబ్ధి చేకూరిస్తేనో, జీవీఎంసీలో అడ్డగోలు మేలు చేయడం వల్లనో ‘ఆంధ్రజ్యోతి’కి మేలు జరగలేదు. జగన్ ప్రభుత్వం కుట్రపూరితంగా, ఉద్దేశ్యపూర్వకంగా ‘ఆంధ్రజ్యోతి’ని దెబ్బతీయాలని భూ కేటాయింపులను రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయాల వల్ల న్యాయ పోరాటం చేయడం ద్వారానే ఆ స్థలం దక్కింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో, అటు జీవీఎంసీలోనూ నిబంధనల ప్రకారమే ‘ఆంధ్రజ్యోతి’కి ఆమోదాలు, అనుమతులు లభించాయి. వాస్తవాలకు జగన్ మార్క్ అబద్ధాలతో మసిపూసి అడ్డగోలు లబ్ధి చేస్తున్నారని విషపురాతలతో ప్రచారం చేయడం ద్వారా తన నీచబుద్ధిని పదేపదే ప్రదర్శించుకుంటోంది రోతపత్రిక.
హైకోర్టు తీర్పును ఎందుకు ప్రస్తావించదు?
‘ఆంధ్రజ్యోతి’కి ఎప్పుడో 1986లోనే విశాఖలోని పరదేశీపాలెంలో 1.5 ఎకరాల భూమిని నాడున్న మార్కెట్ రేటు(రిజిస్ట్రేషన్ బుక్ వాల్యూ)కు కేటాయించారు. ఆ భూ కేటాయింపును సమర్థిస్తూ 1991 సెప్టెంబరు 25న పరదేశీపాలెం గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం వచ్చాక ఆ భూమిని వెనక్కి తీసుకోవాలని కుట్రచేసింది. తొలుత నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని, ఆ భూమిని వెనక్కి తీసుకుంటామని 2019లో జగన్ సర్కారు వచ్చీరాగానే నోటీసులు ఇచ్చింది. ‘ఆంధ్రజ్యోతి’ హైకోర్టును ఆశ్రయించగా, నిబంధనల ప్రకారమే నడుచుకోవాలని సర్కారును ఆదేశించింది. చివరకు ప్రజాప్రయోజనాల ఉల్లంఘన జరుగుతోందంటూ భూ కేటాయింపును రద్దుచేస్తూ 2020 జనవరి 30న జగన్ సర్కారు ఉత్తర్వులు(జీఓ21) జారీ చేసింది. ఆ ఉత్తర్వులపై ‘ఆంధ్రజ్యోతి’ హైకోర్టును ఆశ్రయించింది. సర్కారు నోటీసులు, ఉత్తర్వులను పరిశీలించి ‘ఆంధ్రజ్యోతి’కి భూమి కేటాయింపు ఉత్తర్వుల రద్దు విషయంలో ప్రభుత్వం బుర్రపెట్టి పనిచేయలేదని, ఇచ్చిన నోటీసులకు, రద్దు ఉత్తర్వులో పేర్కొన్న అంశాలకు ఏమాత్రం సంబంధం లేదంటూ సర్కారు చర్యను హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. భూ కేటాయింపు రద్దు ఉత్తర్వులను అంటే జీఓ 21 అమలును నిలిపివేసింది. హైకోర్టు తీర్పు 2024 నవంబరు 29న వచ్చింది. ఆ తీర్పు ఆధారంగానే తగిన చర్యలు తీసుకోవాలని నాటి రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నెల రోజుల తర్వాత అంటే, డిసెంబరులో విశాఖ కలెక్టర్‌కు లేఖ రాశారు. తదనంతర చర్యలు అంటే, చట్టబద్ధమైన చర్యలు తీసుకోమనే కదా! ఒకవేళ హైకోర్టు తీర్పును అమలు చేయకపోతే ఏమవుతుంది? అది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది. విశాఖ కలెక్టర్, రెవెన్యూ అధికారులు కోర్టుకు హాజరవ్వాల్సి ఉంటుంది. అయినా, హైకోర్టు తీర్పు అమలు వేగంగా జరగలేదు. తమకిచ్చినభూమి బఫర్ జోన్‌లో ఉంది కాబట్టి, దాని పక్కనే ఉన్న హౌసింగ్‌బోర్డు భూమిని ఇవ్వాలని ‘ఆంధ్రజ్యోతి’ 2024 డి సెంబరులోనే ప్రభుత్వాన్ని కోరింది. నిజంగా ‘ఆంధ్రజ్యోతి’ తన అధికారబలం ఉపయోగించి ఉంటే, అదే నెలలో జీవీఎంసీని అత్యవసరంగా సమావేశపరచి గుట్టుచప్పుడు కాకుండా ఆమోదం తీసుకునేది. కానీ, ‘ఆంధ్రజ్యోతి’ చట్టబద్ధంగా, నిబంధనల మేరకే నడుచుకుంది. అందుకే, 2025 ఆగస్టులో నాటి కలెక్టర్ ఆదేశాల మేరకు జీవీఎంసీలో తీర్మానం ప్రవేశపెట్టారు. హైకోర్టు తీర్పు అమలులో భాగంగానే, భూ మార్పిడి ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకొనే జీవీఎంసీ ఆమోదం కోసం ప్రతిపాదన చేశారు. జగన్ రోత పత్రిక వాటిని ప్రస్తావించదు. ఎందుకంటే, తన ను పెంచిపోషించిన జగన్ సర్కారు బండారం బయటపడుతుంది. అందుకే, కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టి ‘ఆంధ్రజ్యోతి’కి ప్రభుత్వం మేలుచేసిందన్న తప్పుడు రాతలను అచ్చేస్తోంది.
భిన్నాభిప్రాయానికి, తిరస్కరణకు తేడా తెలియదా!
హైకోర్టు 2024 నవంబరు 29న ఇచ్చిన ఆదేశాల మేరకు ‘ఆంధ్రజ్యోతి’ తిరిగి తన భూమిని దక్కించుకుంది. ఆ భూమిలో కొంత భాగం బఫర్ జోన్‌లో ఉంది కాబట్టి, దాన్ని వినియోగించుకోలేమని, దాని స్థానంలో తమ స్థలం వెనకే ఖాళీగా ఉన్న హౌసింగ్‌బోర్డు భూమిని ఇవ్వాలని 2024లోనే ‘ఆంధ్రజ్యోతి’ ప్రభుత్వానికి దరఖాస్తు ఇచ్చింది. నిజంగా అధికారాన్ని అడ్డంపెట్టుకొని, ప్రభుత్వ పెద్దలను ఒత్తిడిచేసి ఉంటే 2024 డిసెంబరు, లేదా 2025 జనవరిలోనే ‘ఆంధ్రజ్యోతి’ కోరుకున్నట్లుగా భూమి మార్పిడి ఉత్తర్వులు వచ్చేవి. ఆఘమేఘాల మీద జీవీఎంసీ తీర్మానాలు దక్కేవి. కానీ, ‘ఆంధ్రజ్యోతి’ ఆ పని చేయలేదు. చట్టబద్ధంగా, నిబంధనల మేరకే నడుచుకుంది. దీంతో దరఖాస్తు పెట్టిన 9 నెలలకు, అంటే 2025 ఆగస్టు 22న భూమి మార్పిడి ప్రతిపాదనపై చర్చించేందుకు జీవీఎంసీలో చర్చకు పెట్టారు. 2025 ఆగస్టు 22న రాత్రి 9 గంటలకు సమావేశాన్ని వాయిదా వేద్దామనుకున్నారు. కానీ, హైకోర్టు తీర్పులతో ముడిపడిన రెండు అంశాలు అంటే 66, 67 అజెండాలు ఉన్నాయని, వాటిపై కూడా చర్చించాలని అధికారులు జీవీఎంసీ చైర్మన్‌కు సూచించారు. ఆ మేరకు ఆ రెండింటిపై కూడా చర్చ జరిగింది. ‘ఆంధ్రజ్యోతి’ భూమి ప్రతిపాదన అంశం చర్చకొచ్చినప్పుడు వైసీపీకి చెందిన సభ్యులు ఒకరు వ్యతిరేకించారు. అది భిన్నాభిప్రాయం మాత్రమే. మెజారిటీ సభ్యులు ఆ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. ఇదీ జరిగింది. కానీ, రోతపత్రిక మాత్రం ‘ఆంధ్రజ్యోతి’ భూమి మార్పిడి ప్రతిపాదనను కౌన్సిల్ తిరస్కరించిందంటూ విషం కక్కింది. జీవీఎంసీలో అధికారపక్షం టీడీపీ. వైసీపీ బలం స్వల్పం. ఆగస్టు 22 నాటి సమావేశంలో ‘ఆంధ్రజ్యోతి’ ప్రతిపాదనను వ్యతిరేకించిన సభ్యులు ఒక్కరే.
నిబంధనల ప్రకారం మెజారిటీ ఆమోదం ఉన్నదే చెల్లుబాటవుతుంది. ఆ మేరకే జీవీఎంసీ ప్రతిపాదనకు అనుకూల తీర్మానం చేసింది. రోతపత్రికకు తెలియని విషయమా ఇది. కానీ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు పిచ్చిరాతలు అచ్చేసింది. మెజారిటీ సభ్యులు ఆమోదించిన ప్రతిపాదనను తిరస్కరణకు గురయిందంటూ అచ్చోసిన అబద్ధాలను ప్రచారం చేయడం రోతపత్రికకే చెల్లింది.
అవును అది లాంఛనమే
‘ఆంధ్రజ్యోతి’పై రోతపత్రిక మరో అబద్ధాన్ని, నిందను మోపింది. జీవీఎంసీ ఆమోదం లాంఛనమే అని చెప్పడం ద్వారా స్థానిక సంస్థలను చిన్నచూపు చూస్తోందని నిజాలకు మసిపూసే ప్రయత్నం చేసింది. హైకోర్టు తీర్పు తర్వాత ‘ఆంధ్రజ్యోతి’కి భూ కేటాయింపును పునరుద్ధరించక తప్పదు. లేదంటే కోర్టు ధిక్కరణ అవుతుంది. ఉపయోగానికి వీలులేకుండా బఫర్ జోన్‌లో ఉన్న భూమిని తీసుకొని, కొత్తగా మరో చోట భూమి ఇవ్వాల్సింది ప్రభుత్వమే. ఎందుకంటే, ‘ఆంధ్రజ్యోతి’ ఆ భూమికి మార్కెట్ ధర చెల్లించింది. చట్టపరమైన, విధానపరమైన నిబంధనలను పాటించాల్సింది అధికారులే. హైకోర్టు తీర్పును సకాలంలో అమలు చేయాల్సింది రెవెన్యూ, జీవీఎంసీలే. తీర్పు వచ్చిన తర్వాత అంటే 9 నెలలకు కూడా కీలకమైన ప్రక్రియ ముందుకు సాగలేదు కాబట్టే అధికారులు ‘ఆంధ్రజ్యోతి’ ప్రతిపాదనకు ఆ సమావేశంలో తప్పనిసరిగా ఆమోదం తెలపాల్సి ఉంది. అందుకే, సమావేశాన్ని చివరలో వాయిదా వేద్దామనుకున్న తర్వాత అజెండాలోని రెండు అంశాలు ఇంకా ఉన్నాయని, వాటిపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. ఆ తర్వాతే, 66, 67 అజెండాలపై చర్చ జరిగింది. 67వ అంశంగా ఉన్న ‘ఆంధ్రజ్యోతి’ ప్రతిపాదనను ఆమోదించారు. అది లాంఛనంగానే జరగాల్సి ఉంది.
గోల్‌మాల్ ఎవరిది?
‘ఆంధ్రజ్యోతి’ చట్టబద్ధంగా, నిబంధనల మేరకే భూమిని పొందింది. ఎక్కడా అధికార బలప్రదర్శనకుగానీ, రాజకీయ ఒత్తిళ్లకుగానీ దిగలేదు. అందుకే, హైకోర్టు తీర్పు వెలువడిన 13 నెలలకు భూమి మార్పిడి ఉత్తర్వులు దక్కించుకుంది. జగన్ ప్రభుత్వం చేసిన తప్పుడు పనులపై సుదీర్ఘన్యాయపోరాటం చేసిన ‘ఆంధ్రజ్యోతి’ ధర్మం పక్క నే ఉంటుంది. కుట్రపూరితంగా, కనీసం నిబంధనలు పాటించకుండా గిట్టనివారిని దెబ్బతీసే నైజం జగన్‌ది. ఆయన భావజాలాన్ని పునికిపుచ్చుకొని అబద్ధాలనే అచ్చేసే రోతపత్రికది. చర్చ అనంతరమే భూమికేటాయింపు ప్రతిపాదనకు ఆమో దం లభించింది. అయినా, తిరస్కరించిన ప్రతిపాదన అంటూ కొత్త అబద్ధానికి రోతపత్రిక తెరలేపింది. హైకోర్టు ఆదేశాలతో ముడిపడిన ఈప్రతిపాదనను జీవీఎంసీ తిరస్కరించగలదా? ఒక సభ్యుడు వ్యతిరేకించారు కాబట్టి అది తిరస్కరణకు గురైందన్న భ్రమలో అబద్ధాలను అచ్చేయడం రోతపత్రికకే చెల్లింది. చట్టప్రకారం జరిగిన తీర్మానంలో గోల్‌మాల్ ఉందని అబద్ధాలను ప్రచారంచేయడం యాక్..ఛీ పత్రిక నైజం. హైకోర్టు తీర్పును దాచిపెట్టి, ప్రజలను తప్పుదోవ పట్టించడం కన్నా గోల్‌మాల్ మరొకటి ఉంటుందా?
