Share News

గురజాడ జయంతిని రాష్ట్ర పండుగలా నిర్వహిస్తున్నాం: మంత్రి నారా లోకేశ్

ABN , Publish Date - Sep 21 , 2026 | 09:58 AM

గురజాడ ఆశయాలు.. సాహిత్య సేవలను గుర్తుచేసుకుంటూ మంత్రి నారా లోకేశ్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గురజాడ వారసులకు గౌరవ వేతనం పునరుద్ధరించడంతో పాటు రూ.30 వేలకు పెంచిన విషయాన్ని వెల్లడించారు. వివరాల్లోకి వెళితే..

గురజాడ జయంతిని రాష్ట్ర పండుగలా నిర్వహిస్తున్నాం: మంత్రి నారా లోకేశ్
Gurajada Apparao,

అమరావతి, సెప్టెంబర్ 21: సామాజిక చైతన్యమే లక్ష్యంగా సామాన్య ప్రజలకు సులభంగా అర్థమయ్యే వాడుక భాషలో సాహిత్య సృజన చేసిన మహాకవి గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఘన నివాళులు అర్పించారు. స్వాతంత్య్రానికి పూర్వమే బాల్యవివాహాలను వ్యతిరేకిస్తూ, స్త్రీ విద్యను ప్రోత్సహించిన అభ్యుదయవాది గురజాడ అని కొనియాడారు. ‘దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్’ అంటూ దేశభక్తితో పాటు మానవశక్తి ప్రాధాన్యతను ప్రపంచానికి చాటిచెప్పిన మహాకవి గురజాడ అని పేర్కొన్నారు. గురజాడ జయంతిని కూటమి ప్రభుత్వం రాష్ట్ర పండుగలా నిర్వహించడం సంతోషంగా ఉందని నారా లోకేశ్ తెలిపారు. తెలుగు సాహిత్యానికి, సమాజ చైతన్యానికి గురజాడ చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన రచనలు నేటికీ ప్రజల్లో సామాజిక స్పృహను పెంపొందిస్తున్నాయని అన్నారు.


గురజాడ అప్పారావు వారసులకు అందించే గౌరవ పారితోషికం గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన విషయం తన దృష్టికి రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు నారా లోకేశ్ వెల్లడించారు. దీంతో గురజాడ వారసులకు గౌరవ వేతనాన్ని వెంటనే పునరుద్ధరించడంతో పాటు, గతంలో అందుతున్న రూ.20 వేల పారితోషికాన్ని రూ.30 వేలకు పెంచినట్లు తెలిపారు. తెలుగు జాతికి వెలుగునిచ్చిన మహాకవి గురజాడ అప్పారావును గౌరవించడం, ఆయన సాహిత్య వారసత్వాన్ని కొనసాగించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు. గురజాడ జయంతి సందర్భంగా కూటమి ప్రభుత్వం ఆ మహోన్నత వ్యక్తిని సగౌరవంగా స్మరించుకుంటోందని నారా లోకేశ్ పేర్కొన్నారు.


గురజాడ జయంతి రాష్ట్ర పండుగలా నిర్వహించడం గర్వకారణం: హోంమంత్రి అనిత

మహాకవి, సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సాహిత్యంతో పాటు సామాజిక, సాంస్కృతిక రంగాలకు గురజాడ అప్పారావు చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. గురజాడ జయంతిని రాష్ట్ర పండుగలా ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. సమాజంలో చైతన్యం తీసుకురావడంలో ఆయన రచనలు, ఆలోచనలు కీలక పాత్ర పోషించాయని అన్నారు. మూఢనమ్మకాలు, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం ఎంతో ఆదర్శనీయమని అన్నారు.

Updated Date - Sep 21 , 2026 | 11:33 AM