ఎమ్మెల్యే అరవింద బాబుపై సీఎం చంద్రబాబు సీరియస్
ABN , Publish Date - Apr 03 , 2026 | 05:14 PM
గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి ఎమ్మెల్యే అరవింద బాబు చేరుకున్నారు. ఎస్పీ కార్యాలయంలో బైఠాయించడంపై ఆయన వివరణ ఇచ్చారు.
అమరావతి: పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద బాబుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. పార్టీ పరువుకు భంగం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇటీవల తాను చెప్పిన వ్యక్తికి లీగల్ అడ్వైజర్ పోస్ట్ ఇవ్వలేదని అరవింద బాబు హల్ చల్ చేశారు. ఏకంగా పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో బైఠాయించి నిరసన తెలిపారు. ఈ విషయం కాస్తా పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లింది. ఎమ్మెల్యేతో మాట్లాడాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ మేరకు ఇవాళ (శుక్రవారం) మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి అరవింద బాబును పల్లా శ్రీనివాసరావు పిలిపించారు. ఎస్పీ కార్యాలయంలో బైఠాయించడంపై వివరణ కోరారు. ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారని.. ఇది ఎంతమాత్రం సహించరాని విషయమని అరవింద బాబుకు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. లీగల్ అడ్వైజర్ నియామకం జరగకపోతే పార్టీ జిల్లా అధ్యక్షుడు, రీజనల్ కోఆర్డినేటర్ లేదా తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. అంతేకాని ఇలా పార్టీ పరువుపోయేలా ప్రవర్తించడం ఏంటని నిలదీశారు.
ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో బైఠాయించడం, పార్టీ పరువుకు భంగం కలిగించే ప్రయత్నాలను ఖండించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే పార్టీ తరఫున తీవ్ర చర్యలు తీసుకునేందుకు వెనుకాడేది లేదని తేల్చిచెప్పారు. అయితే, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటానని ఎమ్మెల్యే అరవింద బాబు హామీ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
నీటిపారుదల శాఖ అధికారులపై మంత్రి నిమ్మల సీరియస్..
ఆ జిల్లాలకు బిగ్ అలర్ట్.. పిడుగులతో భారీ వర్షం