ఏపీలో మున్సిపల్ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్..
ABN , Publish Date - Nov 01 , 2026 | 07:34 AM
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆదివారం ఉదయం 7.00 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5.00 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది.
అమరావతి, నవంబర్ 01: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆదివారం ఉదయం 7.00 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5.00 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది. మొత్తం 13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు/ నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే అందులో 8 పట్టణ స్థానిక సంస్థల్లో చైర్‌పర్సన్లు, వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
దీంతో 92 పట్టణ సంస్థలు.. (13 కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు) ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. అందుకోసం 11,705 పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో 99,36,014 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో పోలైన ఓట్లను మంగళవారం లెక్కించనున్నారు.
118 మంది ఏకగ్రీవం..
13 కార్పొరేషన్లలో మేయర్ పదవి కోసం మొత్తం 153 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఆయా కార్పొరేషన్లలో మొత్తం 922 డివిజన్లు ఉన్నాయి. అందులో 118 డివిజన్లలో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో 804 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ డివిజన్లలో 3,073 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
వేలాది మంది పోలీసులతో భద్రత..
ఈ ఎన్నికల పోలింగ్ భద్రత కోసం 36,351 మంది పోలీసులను వినియోగిస్తున్నారు. 3,103 మంది సిబ్బందితో రూట్ మొబైల్ టీమ్స్ ఏర్పాటు చేశారు. అలాగే 405 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో నిఘా ఉంచారు. 414 చెక్‌పోస్టులు, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు ఏర్పాటు చేశారు.
ఎన్నికల విధుల్లో 1.5 లక్షల మంది సిబ్బంది..
ఇక 941 అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి.. నిఘా ఉంచారు. 1,788 సమస్యాత్మక కేంద్రాల్లో పోలీస్ భద్రతను పెంచారు. డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలతో నిరంతర నిఘా నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల విధుల్లో 1.5 లక్షల మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు.
జగన్ సొంత జిల్లాలో..
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని కూటమిలోని పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకు పరిమితమైంది. ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో ఆరు మున్సిపాలిటీలు, నగర పంచాయతీల చైర్ పర్సన్లతోపాటు కడప నగర పాలక సంస్థలోని 52 డివిజన్లలో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
శ్రీవారి ఆలయంలో 495 ఏళ్ల నాటి శాసనం
కర్నూలులో రూ.76 లక్షల నగదు సీజ్
Read Latest AP News And Telugu News