స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టు ఆదేశాలు.. ఎస్ఈసీ అత్యవసర భేటీ
ABN , Publish Date - Oct 21 , 2026 | 03:58 PM
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఏడు జిల్లాల ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నుంచి వచ్చిన ఫిర్యాదులు, ఆధారాలతోపాటు వాటిపై తీసుకున్న చర్యల గురించి ఆయా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల కమిషనర్ మాట్లాడారు.
అమరావతి, అక్టోబర్ 21: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఏడు జిల్లాల ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నుంచి వచ్చిన ఫిర్యాదులు, ఆధారాలతోపాటు వాటిపై తీసుకున్న చర్యల గురించి ఆయా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పు కాపీ వచ్చిన తరువాత మాత్రమే తుది నిర్ణయం తీసుకోవాలని ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా భావిస్తున్నట్లు తెలుస్తుంది.
మరో వైపు ఈ అంశంపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్, రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌తో ఎస్ఈసీ చర్చించారు. ఏడు జిల్లాలోని 19 పురపాలక సంఘాలు, నగర పంచాయితీల్లో తమను నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకున్నారని అందువలన నామినేషన్ల గడువు పెంచాలంటూ సుప్రీంకోర్టును వైసీపీ ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. వైసీపీ చేసిన ఫిర్యాదులను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని ఎస్ఈసీని ఆదేశించింది. అలాగే అక్టోబర్ 25వ తేదీన ఈ 19 పురపాలక సంఘాలు, నగర పంచాయితీల నుంచి బరిలో దిగిన అభ్యర్థుల తుది జాబితా ప్రకటించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఏడు జిల్లాల కలెక్టర్లతోపాటు ఎస్పీలతో ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా అత్యవసర సమావేశమయ్యారు.