Share News

లిక్కర్ స్కాంలో సీఐడీ రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు

ABN , Publish Date - Mar 05 , 2026 | 09:07 PM

ఏపీ లిక్కర్‌ స్కాంకు సంబంధించి సీఐడీ రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ స్కాంలో రూ. 3,200 కోట్లు ఆర్జించినట్లు అంచనా వేస్తున్నారు.

లిక్కర్ స్కాంలో సీఐడీ రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు

అమరావతి, మార్చి 05: ఏపీ లిక్కర్‌ స్కాంకు సంబంధించి సీఐడీ రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ స్కాంలో రూ. 3,200 కోట్లు ఆర్జించినట్లు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా అప్పటి వరకు ఉన్న ప్రముఖ మద్యం బ్రాండ్లను మార్కెట్ నుంచి తొలగించారు. కిక్‌బ్యాక్‌లు ఇచ్చిన కంపెనీలకే మద్యం సరఫరా ఆర్డర్లు ఇచ్చారు.

మద్యం సిండికేట్ బ్రాండ్లను విక్రయించేందుకు ప్రభుత్వ దుకాణాల సిబ్బందిని బెదిరించినట్లు రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేసింది. మాన్యువల్ ఓఎఫ్ఎస్ విధానం ద్వారా ప్రముఖ మద్యం బ్రాండ్లను మార్కెట్ నుంచి అధికారులు తొలగించినట్లు వెల్లడైంది.


మరో వైపు ఈ కేసులో నిందితుడు ఏ - 52 కట్టా ప్రణయ్ ప్రకాష్‌ను నేపాల్ సరిహద్దులో పోలీసులు ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని కోర్టులో హాజరుపర్చారు. మార్చి 13వ తేదీ వరకు అతడికి కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ప్రణయ్ ప్రకాశ్.. తాడేపల్లిలోని అపార్ట్‌మెంట్‌లో 'సేఫ్ హౌస్' ఏర్పాటు చేసి అందులో రూ. వందల కోట్ల నిల్వ చేసినట్లు ఇప్పటికే సిట్ అధికారులు గుర్తించారు. 2024 ఎన్నికల వేళ.. మద్యం సిండికేట్ నుంచి వచ్చిన సొమ్మును వివిధ ప్రాంతాలకు అతడు తరలించినట్లు సాక్ష్యాధారాలు సైతం సేకరించారు.


డిస్టిలరీల ద్వారా రూ.150 నుంచి రూ. 600 వరకు కేస్‌లు వారీగా సిండికేట్ సభ్యులు నగదు వసూలు చేశారు. షెల్ కంపెనీలు, గోల్డ్ వ్యాపారుల ద్వారా నల్లధనాన్ని వైట్ మనీగా మార్చినట్లు సిట్ తన దర్యాప్తులో తెల్చింది. అదాన్ డిస్టిలరీస్ పేరుతో రూ. వేల కోట్ల లావాదేవీలు జరిపినట్లు వెల్లడించింది.


ప్రభుత్వ ఖజానాకు భారీగా గండికొడుతూ మద్యం ధరలను 3 రెట్లు పెంచినట్లు గుర్తించింది. 2024 ఎన్నికల అనంతరం ప్రణయ్ ప్రకాష్.. ఆఫ్రికాకు పారిపోయాడు. అతడు తిరిగి వస్తుండగా.. నేపాల్ సరిహద్దుల్లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.

Updated Date - Mar 05 , 2026 | 09:15 PM