ఏపీ స్టేట్ ల్యాండ్ అలాట్మెంట్ కమిటీ సమావేశం.. కీలక నిర్ణయాలు ఇవే..
ABN , Publish Date - Apr 17 , 2026 | 01:35 PM
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ల్యాండ్ అలాట్మెంట్ కమిటీ కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పెట్టుబడులు, భూముల కేటాయింపులపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రకటన విడుదల చేసింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ స్టేట్ ల్యాండ్ అలాట్మెంట్ కమిటీ (SLAC) కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పెట్టుబడులు, భూముల కేటాయింపులపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(APIIC)కి భారీగా పెట్టుబడుల ప్రతిపాదనలు పంపింది. మొత్తం 915 దరఖాస్తులను పరిశీలించి 599 పెట్టుబడి ప్రతిపాదనలను ఎస్ఎల్ఏసీ ఆమోదించింది. రూ.2036.59 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సుమారు 11,488 మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సిద్ధమైంది. 215.80 ఎకరాల్లో పరిశ్రమల స్థాపనకు పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలోని 19 జిల్లాల్లో ప్రాజెక్టులు విస్తరించేందుకు నడుం బిగించింది. వీటిలో తయారీ, ఎమ్ఎస్ఎమ్ఈ, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలకు ప్రాధాన్యం ఇచ్చింది. ప్రాంతీయ సమతుల్య అభివృద్ధికి ఊతమిచ్చేందుకు కృషి చేయాలని నిర్ణయించింది. వేగంగా భూమి కేటాయింపులు పూర్తి చేయాలని సూచించింది. ఆమోదించిన ప్రాజెక్టులు త్వరగా గ్రౌండింగ్ చేయాలని ఆదేశాలిచ్చింది.
పెట్టుబడిదారులకు సత్వర సహకారం అందించాలని అధికారులకు దిశానిర్దేశం చేసింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై కూటమి ప్రభుత్వం దృష్టి సారించిన సంగతి తెలిసిందే. అందుకు వేగవంతమైన పారిశ్రామిక అభివృద్ధికి అడుగులు వేస్తోంది. స్థిరమైన, సమగ్ర ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ల్యాండ్ అలాట్మెంట్ కమిటీ సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి
పవిత్రమైన గుడిలో వారి ప్రస్తావన వద్దు.. వైసీపీపై అయ్యన్న పాత్రుడు సెటైర్లు
తీవ్ర విషాదం.. బావిలో మునిగిపోయిన బాలుడు.. కాపాడేందుకు వెళ్లి..