గుంటూరులోనే జన్యు పరీక్షలు
ABN , Publish Date - Sep 21 , 2026 | 04:22 AM
రాష్ట్రంలో క్యాన్సర్ రోగులకు తొలిసారిగా అధునాతన జన్యు పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి. బెంగళూరు, ముంబై వంటి నగరాలకు పంపే పనిలేకుండా ఇక్కడే ఇక్కడే జన్యు పరీక్షలు నిర్వహించుకునే అవకాశం దక్కనుంది.
రూ.2.5 కోట్లతో క్యాన్సర్ పరీక్షా కేంద్రం ఏర్పాటు
రేపు గుంటూరు బోధనాసుపత్రిలో ప్రారంభం
ప్రజలందరికీ ఉచితంగా జన్యు పరీక్షలు
తొలి దశలో రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్ పరీక్షలు
జన్యు సమాచారం, కృత్రిమ మేధస్సుపై పరిశోధనలు
అమరావతి, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో క్యాన్సర్ రోగులకు తొలిసారిగా అధునాతన జన్యు పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి. బెంగళూరు, ముంబై వంటి నగరాలకు పంపే పనిలేకుండా ఇక్కడే ఇక్కడే జన్యు పరీక్షలు నిర్వహించుకునే అవకాశం దక్కనుంది. అంతర్జాతీయ, జాతీయ సంస్థలతో సీఎం చంద్రబాబు, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జరిపిన చర్చల అనంతరం రాష్ట్రంలో జన్యు పరీక్షల కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు రెండు ప్రముఖ సంస్థలు ముందుకొచ్చాయి. వాటి సహకారంతో గుంటూరు బోధనాసుపత్రి ప్రాంగణంలో ఉన్న నాట్కో క్యాన్సర్ సెంటర్‌లో రెండు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.2.5 కోట్ల పెట్టుబడితో ప్రత్యేక జన్యు పరీక్షల ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. తొలి దశలో రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగులకు జన్యు పరీక్షలు నిర్వహించనున్నారు. వారి రోగుల నుంచి సేకరించిన నమూనాలను ప్రత్యేకంగా పరీక్షించి కణాల్లోని జన్యు మార్పులను గుర్తిస్తారు. వాటి ఆధారంగా రోగికి ఏ చికిత్స అవసరమో వైద్యులు నిర్ణయించేందుకు అనువుగా ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఈ జన్యు పరీక్షా కేంద్రం ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం, ఆస్ట్రాజెనకా సంస్థ, స్టాండ్ లైఫ్ సైన్స్ సంస్థల మధ్య ఒప్పందం జరిగింది. ఈ ప్రయోగశాలను మంగళవారం మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభిస్తారు.
ఉచితంగా పరీక్షలు..
ప్రస్తుతం సూక్ష్మస్థాయి జన్యు మార్పు పరీక్షల కోసం కొందరు రోగుల నమూనాలను బెంగళూరు, ముంబై వంటి నగరాలకు పంపించాల్సి వస్తోంది. ఈ ఇబ్బందిని తొలగించి రాష్ట్రంలోనే ఈ పరీక్షలు అందుబాటులోకి తీసుకురావాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. దానికి అనుగుణంగా గుంటూరులో జన్యు ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. ప్రైవేటు కేంద్రాల్లో ఒక్కో జన్యు పరీక్షకు రూ.20 వేల నుంచి రూ.25 వరకూ ఖర్చవుతుంది. ఈ నేపథ్యంలో గుంటూరులో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ల్యాబ్‌లో జన్యు పరీక్షలు ఉచితంగా అందిస్తామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఈ కేంద్రంలో రెండేళ్లలో సుమారు 2 వేల నమూనాలను పరీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆస్ట్రాజెనెకా సంస్థ 1000 మంది రొమ్ము క్యాన్సర్, 1000 మంది ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగులకు నిర్వహించే జన్యు పరీక్షల ఖర్చును భరిస్తుంది. కాగా, భవిష్యత్తులో రక్తంలో కనిపించే కొన్ని మార్పులను గుర్తించడం ద్వారా 14 రకాల క్యాన్సర్లను ముందుగానే గుర్తించే పరీక్షను అభివృద్ధి చేయాలని ఆరోగ్యశాఖ అధికారులు ప్రతిపాదించారు. భవిష్యత్తులో వ్యాధులపై పరిశోధనలు, కొత్త పరీక్షలు, మెరుగైన చికిత్స విధానాల రూపకల్పనకు దీన్ని ఉపయోగిస్తారు. అలాగే క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించే విధానాన్ని ప్రాజెక్టులో భాగంగా బలోపేతం చేయనున్నారు. క్యాన్సర్ కణాల్లోని జన్యు మార్పులను గుర్తించడం ద్వారా వైద్యులు తగిన చికిత్సను నిర్ణయించేందుకు వీలవుతుందని డీఎంఈ డా.విష్ణువర్థన్ తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి..