Share News

4న జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌17 ప్రయోగం!

ABN , Publish Date - Aug 29 , 2026 | 05:04 AM

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమవుతోంది.

4న జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌17 ప్రయోగం!

  • ఈవోఎస్‌-05 ఉపగ్రహంతో నింగిలోకి రాకెట్‌

సూళ్లూరుపేట, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమవుతోంది. సెప్టెంబరు 4న తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌17 రాకెట్‌ ప్రయోగానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రయోగ ఏర్పాట్లలో భాగంగా షార్‌లోని వాహన అనుసంధాన భవనం (వ్యాబ్‌) నుంచి జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌17 రాకెట్‌ను శుక్రవారం రెండో ప్రయోగ వేదిక వద్దకు తీసుకొచ్చారు. తెల్లవారు జామున 5:43 గంటలకు షార్‌ డైరెక్టర్‌ ముత్తు చెళియన్‌ వ్యాబ్‌ వద్ద వాహక నౌకకు జెండా ఊపిన అనంతరం జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌17 రాకెట్‌ నెమ్మదిగా బయల్దేరి... ఉదయం 7:50 గంటలకు రెండో ప్రయోగ వేదిక వద్దకు చేరుకుంది. ఇక్కడ రాకెట్‌కు తనిఖీలు, పరీక్షలు నిర్వహించి ప్రయోగానికి సిద్ధం చేస్తారు. అవి పూర్తయిన తర్వాత రిహార్సల్‌ నిర్వహించి ప్రీ కౌంట్‌డౌన్‌, కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ప్రారంభిస్తారు. సెప్టెంబరు 4వ తేదీ తెల్లవారుజామున 2:55 గంటలకు జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌17 రాకెట్‌ ప్రయోగం నిర్వహించనున్నట్లు ఇస్రో వర్గాల సమాచారం. ఈ రాకెట్‌ ద్వారా 1,117 కిలోల బరువు కలిగిన ఈవోఎస్‌-05 (జీఐశాట్‌-1ఏ) భూపరిశీలన ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపనున్నారు. ప్రయోగానికి సంబంధించిన ఏర్పాట్లు షార్‌లో చురుగ్గా సాగుతున్నాయి.

Updated Date - Aug 29 , 2026 | 05:04 AM