Share News

అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు.. డిప్యూటీ సీఎం పవన్ సంతోషం

ABN , Publish Date - Jan 26 , 2026 | 03:32 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కలల రాజధాని అమరావతిలో తొలిసారిగా నిర్వహించిన గణతంత్ర వేడుకలు అత్యంత అద్భుతంగా జరిగాయని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ వేడుకల్లో పాల్గొనడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు.

అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు.. డిప్యూటీ సీఎం పవన్ సంతోషం
Pawan Kalyan

అమరావతి, జనవరి 26: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు పలువురు మంత్రలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ‘అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు అద్భుతంగా జరిగాయి. రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ రాష్ట్ర అభివృద్ధి జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ కలల రాజధాని అమరావతిలో తొలిసారి నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో పాల్గొనడం ఆనందాన్నిచ్చింది. ఈ కార్యక్రమం భవిష్యత్తు లక్ష్యాలకు అద్దంపట్టింది. నేలపాడు ప్రాంతంలోని పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకలో పాల్గొన్న 22 శకటాలు రాష్ట్ర ప్రగతిని ప్రతిబింబించాయి’ అని పేర్కొన్నారు.


పవన్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘సీఎం చంద్రబాబు నాయకత్వంలో అమరావతి నగరం సకల సౌకర్యాలతో విశ్వనగరంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను. గణతంత్ర దినోత్సవ వేదిక నుంచి గౌరవ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేసిన ప్రసంగం రాష్ట్ర భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసింది. భారత రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తామని తెలియజేస్తున్నా. రాష్ట్ర ప్రజలందరికీ మరోసారి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం వేసే ప్రతి అడుగు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా.. రాష్ట్రాభివృద్దే ధ్యేయంగా ఉంటుందని మాటిస్తున్నాము’ అని పవన్ అన్నారు.


ఇవి కూడా చదవండి

శశిథరూర్‌తో సీపీఎం మంతనాలు.. ఆయన ఏమన్నారంటే

చైనా అణు రహస్యాలు అమెరికాకు లీక్ అయ్యాయా.. టాప్ జనరల్‌పై దర్యాఫ్తు..

Updated Date - Jan 26 , 2026 | 04:18 PM