Share News

‘కల్తీ’ రికార్డులు తారుమారు!

ABN , Publish Date - Mar 05 , 2026 | 04:55 AM

తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరాకు సంబంధించిన కీలకమైన డిజిటల్‌ రికార్డులను ధ్వంసం చేశారని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇతర రికార్డులను తారుమారు చేశారని కూడా తెలిపింది.

‘కల్తీ’ రికార్డులు తారుమారు!

  • డిజిటల్‌ రికార్డులూ ధ్వంసం చేశారు

  • ‘కల్తీ నెయ్యి’ చిక్కకుండా మాయలు

  • సీబీఐ నేతృత్వంలోని ‘సిట్‌’ నిర్ధారణ

  • టెండర్ల కోసం కంపెనీల తప్పుడు పత్రాలు

  • నాణ్యతపై 2024 జూన్‌లో ఫిర్యాదులు

  • ఎన్‌డీడీబీ ల్యాబ్‌కు నెయ్యి శాంపిళ్లు

  • జంతువుల కొవ్వు అవశేషాల నిర్ధారణ

  • దాని ఆధారంగానే నాడు సీఎం ప్రకటన

  • 2020 నుంచే నాణ్యతకు తిలోదకాలు

  • అన్ని మతాల విశ్వాసాలూ కాపాడతాం

  • శాసనమండలి ముందు ప్రభుత్వ నోట్‌

అమరావతి, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరాకు సంబంధించిన కీలకమైన డిజిటల్‌ రికార్డులను ధ్వంసం చేశారని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇతర రికార్డులను తారుమారు చేశారని కూడా తెలిపింది. కంపెనీలు టీటీడీ నెయ్యి టెండర్లు దక్కించుకునేందుకు తప్పుడు పత్రాలు సమర్పించాయని.. తమ నెయ్యి ఉత్పత్తి సామర్థ్యాన్ని తప్పుగా చూపించాయని సీబీఐ ఆధ్వర్యంలోని సిట్‌ తేల్చినట్లు పేర్కొంది. కల్తీనెయ్యి ఉదంతంపై ప్రభుత్వం బుధవారం శాసనమండలి ముందు ఓ నోట్‌ను సమర్పించింది. అందులో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెయ్యి నాణ్యతపై ఫిర్యాదులు వచ్చాయని, ట్యాంకర్ల నుంచి నెయ్యి శాంపిళ్లు తీసి ‘నేషనల్‌ డెయిరీ డెవల్‌పమెంట్‌ బోర్డు(ఎన్‌డీడీబీ)-కాఫ్‌’ ల్యాబ్‌కు పరీక్షల కోసం పంపించామని పేర్కొంది. ‘ 2019-24 మధ్య భక్తుల నుంచి లడ్డూల నాణ్యతపై పలు ఫిర్యాదులు అందాయి. 2024 జూలై 16, 23 తేదీల్లో ఆ శాంపిళ్లను పంపగా.. ఆ నెయ్యిలో వనస్పతితోపాటు జంతువుల కొవ్వు కలిసినట్లు పరీక్షలో వెలుగుచూసింది. ఆ నివేదిక ఆధారంగానే తిరుమలకు కల్తీ నెయ్యిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరీక్షల్లో సోయాబీన్‌, సన్‌ఫ్లవర్‌, పామాయిల్‌, బీఫ్‌ టాలో, లార్డ్‌ (పందికొవ్వు) వంటి కొవ్వులు కల్తీ అయినట్లు నిర్ధారణ అయుంది. 2022లో టీటీడీ సీఎఫ్‌టీఆర్‌ఐ ప్రయోగశాలలో నెయ్యి నాణ్యత పరీక్షలు చేయించింది. అందులో బీటా-సిటోస్టెరాల్‌ పాజిటివ్‌గా (కల్తీ జరిగిందని చెబుతూ) నివేదిక వచ్చింది. అయినా 2024 జూన్‌ వరకు నాటి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. కల్తీ నెయ్యి సరఫరాను అడ్డుకోకుండా, కొత్తగా నాణ్యతా పరీక్షలు నిర్వహించకుండా నిరంతరం అదే నెయ్యిని వినియోగించారు.


దీంతో 2024 జూన్‌లో మేం అధికారంలోకి వచ్చాక నె య్యిని పరీక్షలకు పంపగా కొన్ని ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏఆర్‌ డెయిరీ, ఇతర సంస్థలు టీటీడీకి కల్తీనెయ్యి సరఫరా చేశాయని ఆరోపిస్తూ టీటీడీ కొనుగోలు విభాగం జనరల్‌ మేనేజర్‌ పి.మురళీకృష్ణ ఆ ఏడాది సెప్టెంబరు 25న తిరుపతి ఈస్ట్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం సిట్‌ విచారణకు ఆదేశించింది. అనంతరం సుప్రీం కోర్టు ఆదేశాలతో సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్‌ దర్యాప్తు చేసింది’ అని వివరించింది. నోట్‌లో ప్రభుత్వం ఇంకా ఏం చెప్పిందంటే..

2018-19లో టెండర్‌ నిబంధనలు కఠినతరం..

తిరుమల దేవదేవుడి ప్రసాదం తయారీలో నెయ్యి వినియోగం భారీగా పెరగడంతో 2018-19లో బిడ్డింగ్‌ నిబంధనలను కఠినతరం చేశారు. బిడ్డింగ్‌లో పాల్గొనే సంస్థకు నెయ్యి తయారీ సామర్ధ్యం 6 నుంచి 12 టన్నులకు.. వార్షిక వ్యాపార టర్నోవర్‌ రూ.150 కోట్ల నుంచి 250 కోట్లకు పెంచారు. తయారీ సంస్థ రోజుకు 4 లక్షల లీటర్ల పాల సేకరణ తప్పనిసరిగా చేయాలని, ఈ మేరకు ఎఫ్‌ఎస్ఎస్ఏఐకి సమర్పించిన రిటర్నుల్లో దాఖలు చేయాలని కఠిన నిబంధనలను తీసుకొచ్చారు. ఈ నిబంధనల మేరకు 2019 అక్టోబరులో టీటీడీ నెయ్యి బిడ్డర్లను ఆహ్వానించింది. కొనుగోలు కమిటీ సిఫారసుపై 27-12-2019న 11,50,000 కిలోల ఆవునెయ్యిని కిలోకు రూ.389.90 ధర చొప్పున సరఫరా చేసే కాంట్రాక్టును ఎల్‌-1 బిడ్డర్‌ ఎంఎస్‌ ప్రీమియర్‌ డెయిరీకి అప్పగించారు.

2020లో ఆ నిబంధనలు ఎత్తేశారు..

కఠిన నిబంధనల కారణంగా బిడ్డింగ్‌లో చాలా కొద్దిమంది మాత్రమే పాల్గొంటున్నారంటూ.. టెండర్‌ నిబంధనలను వృత్తిపరమైన సంస్థలతో పునఃపరిశీలింపజేయాలని టీటీడీ కొనుగోలు కమిటీ సిఫారసు చేసింది. దీంతో 2020 జనవరి 6వ తేదీన నాటి అదనపు ఈవో ధర్మారెడ్డి ఆమోదంతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. టీటీడీలో 2020 ఫిబ్రవరి 29న 371వ తీర్మానం ప్రకారం నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలిస్తూ నిబంధనలను సడలించారు. టెండర్లలో పాల్గొనే డెయురీ కనీస అనుభవాన్ని మూడేళ్ల నుంచి ఏడాదికే కుదించారు. రోజుకు 4 లక్షల లీటర్ల పాలసేకరణ చేసి ఉండాలన్న నిబంధనను పూర్తిగా తొలగించారు. రోజువారీ నెయ్యి తయారీ సామర్థ్యాన్ని 12 టన్నుల నుంచి 8 టన్నులకు తగ్గించారు. వార్షిక టర్నోవర్‌ను 250 కోట్ల నుంచి 150 కోట్లకు కుదించారు. ఈ సడలింపులు జీడిపప్పు, ఎండుద్రాక్ష, యాలకులు, శనగపిండి వంటి ఇతర వస్తువులకు కూడా వర్తింపజేశారు.


సిట్‌ విచారణలో వెల్లడైన అంశాలు..

  • పామాయిల్‌, పామ్‌ కెర్నల్‌ ఆయిల్‌, పామోలిన్‌తోపాటు బీటా-కెరోటిన్‌, ప్లేవరింగ్‌ ఏజెంట్లు, ఇతర రాసాయనాలను ఉపయోగించి నెయ్యిరంగు, రుచి, వాసనను పోలి ఉండేలా కృత్రిమ నెయ్యిని తయారు చేశారు.

  • పెద్ద మొత్తంలో వంటనూనెలు, రసాయనాల సమ్మిళితంతో రూ.వందల కోట్ల విలువైన కల్తీనెయ్యిని తయారుచేసి, మధ్యవర్తి కంపెనీల ద్వారా టీటీడీకి సరఫరా చేశారు.

  • తిరస్కరించిన కల్తీ సరుకులను ఆ తర్వాత ఇతర సంస్థల ద్వారా మళ్లీ సరఫరా చేసి ఆమోదింపజేసుకున్నారు.

అన్ని మతాల విశ్వాసాలను కాపాడతాం

రాష్ట్రంలో అన్ని మతాల విశ్వాసాలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం సదరు నోట్‌లో పేర్కొంది. ప్రతి దేవాలయం, మసీదు, చర్చి అభివృద్ధి, ఽభద్రతకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని హామీ ఇచ్చింది. మత సామరస్య పరిరక్షణే తమ ప్రధాన బాధ్యత అని, మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేసింది.

ఈవో, అదనపు ఈవోల సిఫారసు..

టెండర్‌ నిబంధనలు సడలించాలని అప్పటి టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అదనపు ఈవో ధర్మారెడ్డి చేసిన సిఫారసుల మేరకు వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన పాలకమండలి నిర్ణయం తీసుకుంది. 2019లో కఠినతరం చేసిన నిబంధనలకు అవి పూర్తి విరుద్ధంగా ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. 2022 మే 30న అప్పటి ఇన్‌చార్జి ఈవో ధర్మారెడ్డి సవరించిన ఎఫ్‌ఎస్ఎస్ఆర్‌ ప్రమాణాలను టెండర్‌లో చేర్చి ఆమోదించారు. కానీ 2022 ఆగస్టు 31న ఎలాంటి కారణాలూ చెప్పకుండా ఆల్ఫా మిల్క్‌ ప్రొడక్ట్స్‌, ప్రీమియర్‌ అగిఫ్రుడ్స్‌ సంస్థలను ఆ ప్రమాణాల అమలు నుంచి మినహాయించారు. ఈ నిర్ణయమే కల్తీ నెయ్యి సరఫరాకు దోహదహడింది. ఇందుకోసం నిబంధనలను తుంగలో తొక్కినట్లు కనిపిస్తోంది.

కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు

జగన్‌ పాలనలో సుమారు 60 లక్షల కిలోల కల్తీనెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు. నెయ్యి, లడ్డూల నాణ్యతపై 2024 జూన్‌లోనే టీటీడీ ఈవోకు ఫిర్యాదులు వచ్చాయి. ఈవో పోటు విభాగాన్ని పరిశీలించినప్పుడు అక్కడి కార్మికులు ఫిర్యాదు చేశారు. బూంది వేయించేటప్పుడు అసాధారణ పొగలు వస్తున్నాయి.. కార్మికులకు ఆరోగ్య సమస్యలు ఎదువుతున్నాయి.. నాణ్యమైన ముడిసరుకులు సరఫరాచేస్తే లడ్డూ నాణ్యత మెరుగుపడుతుందని వారు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే నెయ్యి నమూనాలను ఎన్‌డీడీబీ-కాఫ్‌ ల్యాబ్‌లో పరీక్ష చేయించారు. కల్తీ నెయ్యిపై సీబీఐ సిట్‌ కీలక అంశాలను నిగ్గు తేల్చింది.

Updated Date - Mar 05 , 2026 | 06:33 AM