Share News

మార్చి 27న ‘గీతం’ ప్రవేశపరీక్ష ‘గ్యాట్‌-2027’

ABN , Publish Date - Nov 28 , 2026 | 05:49 AM

‘గీతం’ డీమ్డ్‌ విశ్వవిద్యాలయం విశాఖపట్నం, హైదరాబాద్‌, బెంగళూరు ప్రాంగణాల్లో నిర్వహిస్తున్న 111 కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష (గ్యాట్‌-2027) వచ్చే ఏడాది మార్చి 27న నిర్వహించనున్నట్టు ప్రో-వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ వై.గౌతమ్‌రావు తెలిపారు.

మార్చి 27న ‘గీతం’ ప్రవేశపరీక్ష ‘గ్యాట్‌-2027’

విశాఖపట్నం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): ‘గీతం’ డీమ్డ్‌ విశ్వవిద్యాలయం విశాఖపట్నం, హైదరాబాద్‌, బెంగళూరు ప్రాంగణాల్లో నిర్వహిస్తున్న 111 కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష (గ్యాట్‌-2027) వచ్చే ఏడాది మార్చి 27న నిర్వహించనున్నట్టు ప్రో-వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ వై.గౌతమ్‌రావు తెలిపారు. విశాఖపట్నంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఇంజనీరింగ్‌, సైన్స్‌, ఫార్మసీ, పారామెడికల్‌, ఆర్కిటెక్చర్‌, లా, మేనేజ్‌మెంట్‌, హ్యూమానిటీస్‌, సోషల్‌ సైన్సెస్‌ విభాగాల్లో అండర్‌ గ్రాడ్యుయేషన్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సులకు ఈ పరీక్ష ఉంటుందని, గీతం బిజినెస్‌ స్కూళ్లలో ఎంబీఏ ప్రవేశానికి గీతం బిజినెస్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (జిబాట్‌-2027) ప్రత్యేకంగా నిర్వహిస్తామన్నారు.

క్యాట్‌లో ప్రతిభ చూపిన వారికి జిబాట్‌ నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపారు. గ్యాట్‌-2027లో సాధించే ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు ఉంటాయని ప్రొఫెసర్‌ వై.గౌతమ్‌రావు వివరించారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన వారికి, జేఈఈ వంటి గుర్తింపు పొందిన జాతీయ పరీక్షల్లో ఉత్తమ స్కోర్లు సాధించిన వారికి గ్యాట్‌ నుంచి మినహాయింపు ఉంటుందన్నారు. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా స్కాలర్‌షిప్‌లు కూడా ఉంటాయని, గత ఏడాది రూ.160 కోట్లు ఇచ్చామని, ఈసారి అది మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. క్రీడలు, రక్షణ దళాల్లో పనిచేసిన వారి కుటుంబాలకు కూడా పబ్లిక్‌ సర్వీస్‌ స్కాలర్‌షిప్‌లు ఇస్తున్నామని తెలిపారు.


గీతంకు న్యాక్‌ ఏ++ గ్రేడ్‌తో పాటు ఇంజనీరింగ్‌, ఫార్మసీ మేనేజ్‌మెంట్‌ కోర్సులకు ప్రతిష్ఠాత్మకమైన ఎన్‌బీఏ గుర్తింపు కూడా ఉందన్నారు. ప్రతిష్ఠాత్మక క్వాంటమ్‌ టీచింగ్‌ ల్యాబ్‌తో పాటు 5జి రీసెర్చి ల్యాబ్‌లను కూడా గీతంలో ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రవేశ పరీక్ష పూర్తి వివరాల కోసం గీతం వెబ్‌సైట్‌ డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.గీతం.ఎడ్యులో చూడాలని, ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అలాగే గీతం హైదరాబాద్‌ ప్రాంగణంలో స్కూల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ద్వారా నాలుగేళ్ల బీఏ బీఈడీ, బీఎస్సీ బీఈడీ కోర్సులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. ఇంటర్మీడియట్‌ చదివినవారికి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ జాతీయ స్థాయిలో నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా వీటిలో అడ్మిషన్‌ ఇస్తామన్నారు. విలేకరుల సమావేశంలో జిమ్‌సర్‌ ప్రో వీసీ డాక్టర్‌ బి.గీతాంజలి, గీతం రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ డి.గుణశేఖరన్‌, గీతం అడ్మిషన్స్‌ డైరెక్టర్‌ ఎం.జగదీశ్‌, వివిధ కళాశాలల డీన్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

డీలిమిటేషన్ బిల్లుతో అన్ని రాష్ట్రాలకు న్యాయం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు: సీఎం చంద్రబాబు

బిహార్ ఎమ్మెల్యే కూతురి పెళ్లి.. చీపుర్లతో ఊడ్చేంత డబ్బు..

Updated Date - Nov 28 , 2026 | 05:53 AM