రూ.200 కోసం బ్లేడ్‌తో దాడి.. గన్నవరంలో ఇద్దరు యువకుల అరెస్ట్
ABN , Publish Date - Nov 11 , 2026 | 03:24 PM
రూ.200 కోసం ఇద్దరు పాఠశాల విద్యార్థులపై బ్లేడ్‌తో దాడికి యత్నించిన ఘటన కృష్ణా జిల్లా గన్నవరం మండలం గొల్లపల్లిలో ఆలస్యంగా వెలుగు చూసింది.
కృష్ణా, నవంబర్ 11: జిల్లాలోని గన్నవరంలో ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. డబ్బుల కోసం పాఠశాల విద్యార్థులపై ఇద్దరు యువకులు బ్లేడ్‌తో దాడికి పాల్పడిన ఘటన గన్నవరం మండలంలోని గొల్లపల్లిలో తీవ్ర కలకలం రేపింది. గొల్లపల్లి జడ్పీ హైస్కూల్‌లో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు పాఠశాల ముగిసిన అనంతరం ఇంటికి వెళ్లేందుకు కట్టుబడిపాలెం బయలుదేరారు.
ఈ క్రమంలో మార్గమధ్యలో ఇద్దరు యువకులు వారిని వెంబడించినట్లు సమాచారం. గంజాయి సేవించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ యువకులు విద్యార్థుల వద్ద రూ.200 డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. డబ్బుల విషయంలో జరిగిన వివాదం నేపథ్యంలో ఇద్దరు విద్యార్థులపై బ్లేడ్‌తో దాడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ విద్యార్థి వారి నుంచి తప్పించుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. మరో విద్యార్థికి స్వల్ప గాయాలయ్యాయి. ఊహించని ఈ ఘటనతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు.
తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు..
దాడి నుంచి తప్పించుకున్న విద్యార్థి ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించాడు. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న గన్నవరం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. విద్యార్థులపై దాడికి పాల్పడిన ఇద్దరు యువకులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు విచారణ చేపట్టారు. పాఠశాల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో విద్యార్థులపై ఇటువంటి దాడి జరగడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. చిన్న మొత్తంలో డబ్బుల కోసం విద్యార్థులను వెంబడించి బ్లేడ్‌తో దాడికి ప్రయత్నించిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి
గోవా మంద్రెమ్ బీచ్‌లో ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. వీడియో వైరల్
గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డాడు.. చివరకు ఏమైందో చూస్తే షాకవ్వాల్సిందే..