ప్రకాశం జిల్లాలో ఘోర విషాదం.. నీటి కుంటలో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారుల మృతి
ABN , Publish Date - Jun 04 , 2026 | 08:27 PM
ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఒంగోలు మండలం చెరువుకొమ్ముపాలెం గ్రామంలో ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు నీటి కుంటలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.
ప్రకాశం, జూన్ 04: జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒంగోలు మండలం చెరువుకొమ్ముపాలెం గ్రామంలో ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు నీటి కుంటలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. వేసవి సెలవులు కావడంతో సరదాగా గడపడానికి గ్రామ సమీపంలోని నీటి కుంటకు వెళ్లిన చిన్నారులు, లోతును గమనించకుండా నీటిలోకి దిగడంతో ఈ ప్రమాదం జరిగింది. చిన్నారులు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెతుకులాట ప్రారంభించారు. ఈ క్రమంలో నీటి కుంట ఒడ్డున చిన్నారుల బట్టలు, కాలి చెప్పులు కనిపించడంతో వారు నీటిలో మునిగిపోయి ఉంటారని అనుమానించి, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు.. గజ ఈతగాళ్ల సాయంతో కుంటలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. గంటల పాటు శ్రమించి నీటిలో గల్లంతైన అభిరామ్ (14), సుశాంత్ (12), చిన్నూ (11), దినేష్ (10) మృతదేహాలను బయటకు తీశారు. మరణించిన వారిలో అభిరామ్, సుశాంత్ అన్నదమ్ములు కావడంతో వారి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ఒకేసారి నలుగురు చిన్నారులు జీవచ్ఛవాలుగా మారడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ముఖ్యమంత్రి అంటే విజన్ ఉండాలి.. జగన్‌కు లేదు: మంత్రి నారాయణ
పెండింగ్‌లో ఉన్న రహదారి ప్రాజెక్టులు వేగంగా పూర్తి: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
Read Latest AP News And Telugu News