ప్రభుత్వ లాంఛనాలతో శత్రుచర్ల అంత్యక్రియలు పూర్తి
ABN , Publish Date - Nov 14 , 2026 | 05:28 AM
పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామంలో మాజీ మంత్రి, టీడీపీ నేత శత్రుచర్ల విజయరామరాజు అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో శుక్రవారం పూర్తి చేశారు.
పార్వతీపురం, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామంలో మాజీ మంత్రి, టీడీపీ నేత శత్రుచర్ల విజయరామరాజు అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో శుక్రవారం పూర్తి చేశారు. శత్రుచర్ల సోదరుడి కుమారుడు పరీక్షిత్‌రాజు చేతుల మీదుగా అంత్యక్రియలు నిర్వహించారు. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి దగ్గరుండి పర్యవేక్షించారు. శత్రుచర్ల కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ శ్రేణులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. ‘గొప్ప నాయకుడిని కోల్పోయాం.
ఎందరికో రాజకీయ పాఠాలు నేర్పిన శత్రుచర్ల నిజంగా ఉత్తరాంధ్ర టైగరే’ అని మంత్రి సంధ్యారాణి అన్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మూడు సార్లు ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా విజయరామరాజు ప్రజలకు అందించిన సేవలను ఎప్పటికీ మరువలేమన్నారు. అనంతరం శత్రుచర్ల విజయరామరాజు సతీమణి శశికళాదేవిని ఓదార్చారు. అంతకుముందు చినమేరంగిలోని నివాసంలో శత్రుచర్ల పార్థివదేహం చూసి.. మంత్రి సంధ్యారాణి, పార్వతీపురం, కురుపాం, బొబ్బిలి ఎమ్మెల్యేలు బోనెల విజయచంద్ర, జగదీశ్వరి, ఆర్వీఎస్కేకే రంగారావు (బేబీనాయన) తదితరులు కంటతడి పెట్టుకున్నారు. తన రాజకీయ గురువు విజయరామరాజుకు బొబ్బిలిలో విగ్రహం ఏర్పాటు చేస్తామని బేబీనాయన తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: మంత్రి లోకేశ్