తండ్రి, ఇద్దరు కుమారులు జల సమాధి
ABN , Publish Date - Oct 30 , 2026 | 06:17 AM
అర్నబ్ తుఫాన్ కారణంగా కాలువలో వరద ఉధృతి పెరగడంతో తండ్రి, ఇద్దరు కుమారులు జల సమాధి అయ్యారు. ఈ ఘోర విషాద ఘటన కాకినాడ జిల్లా శంఖవరం మండలం మండపం గ్రామ శివారు అన్నవరం పంపా రిజర్వాయర్‌లో జరిగింది.
శంఖవరం, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): అర్నబ్ తుఫాన్ కారణంగా కాలువలో వరద ఉధృతి పెరగడంతో తండ్రి, ఇద్దరు కుమారులు జల సమాధి అయ్యారు. ఈ ఘోర విషాద ఘటన కాకినాడ జిల్లా శంఖవరం మండలం మండపం గ్రామ శివారు అన్నవరం పంపా రిజర్వాయర్‌లో జరిగింది. వివరాల ప్రకారం.. శంఖవరం గ్రామానికి చెందిన పిల్లా నారాయణ (55), తన ఇద్దరు కుమారులు దుర్గాప్రసాద్ (30), రాజేశ్ (20)తో కలిసి పంపా కాలువ దిగువన ఉన్న వ్యవసాయ పంపు ఇంజన్‌ను వెలుపలకు తీసేందుకు బుధవారం రాత్రి ప్రయత్నించారు.
తుఫాను కారణంగా వరద ఉధృతిని వారు సరిగ్గా అంచనా వేయలేకపోయారు. ఈ క్రమంలో ఒకరి తర్వాత మరొకరు ముగ్గురూ గల్లంతయ్యారు. గల్లంతైన వీరి కోసం ప్రత్తిపాడు సీఐ సూర్యఅప్పారావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం అన్నవరం పంపా రిజర్వాయర్‌లో గాలించింది. జలాశయం నుంచి తండ్రి, ఇద్దరి కుమారుల మృతదేహాలను గురువారం వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నారాయణకు భార్య ఉన్నారు. పెద్ద కుమారుడికి వివాహం అయిపోగా, చిన్న కుమారుడికి కాలేదు.
వరద ఉధృతిని అంచనా వేయలేక... అన్నవరం పంపా రిజర్వాయర్‌కు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు ప్రాజెక్టులో చేరేందుకు మండపం శివారు తాళ్ళపాలెం వద్ద కాలువ ఉంది. ఇక్కడ రైతులు ఇంజన్లు ఏర్పాటు చేసుకుని పొలాలకు నీరు మళ్లిస్తుంటారు. పొలాల్లో పురుగు మందులు చల్లుకునేందుకు వీలుగా డ్రమ్ములలో నీటిని నిల్వ చేసుకుంటారు.
నాలుగురోజుల క్రితం వరకూ అంతంత మాత్రమే నీరు నిల్వ ఉండగా.. భారీ వర్షాలకు వరదలా నీరు చేరింది. భారీస్థాయిలో ప్రాజెక్టులోకి వచ్చే నీటి ప్రవాహాన్ని అంచనా వేయలేకనే తండ్రీ కొడుకులు జలసమాధి అయ్యారు.
ఈ వార్తలనూ చదవండి:
తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధానం తెస్తాం: సీఎం చంద్రబాబు
ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు