రోడ్డు ప్రమాదంలో ప్రముఖ న్యూరాలజిస్ట్ సజీవ దహనం
ABN , Publish Date - Sep 21 , 2026 | 04:01 AM
వేలాది మంది ప్రాణాలను కాపాడిన ఓ ప్రముఖ వైద్యుడిని.. విధి నిర్దయగా బలితీసుకుంది. కుమార్తె పుట్టిన రోజు వేడుకకు వెళుతూ, రోడ్డు ప్రమాదానికి గురై కారులోనే సజీవ దహనమయ్యారు.
సూర్యాపేట సమీపంలోని పిల్లలమర్రి వద్ద ఘటన
అదుపుతప్పి రోడ్డు అంచున రక్షణగోడను బలంగా ఢీకొన్న
వోల్వో ఎలక్ట్రిక్ కారు.. క్షణాల్లోనే కారును చుట్టేసిన మంటలు
అగ్నికి ఆహుతైన ఖమ్మం వైద్యుడు జగదీశ్.. స్వస్థలం ప్రకాశం జిల్లా
కుమార్తె పుట్టినరోజు వేడుకకు వెళుతుండగా ప్రమాదం
ఖమ్మం కలెక్టరేట్/సూర్యాపేట రూరల్/ఒంగోలు నగరం, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): వేలాది మంది ప్రాణాలను కాపాడిన ఓ ప్రముఖ వైద్యుడిని.. విధి నిర్దయగా బలితీసుకుంది. కుమార్తె పుట్టిన రోజు వేడుకకు వెళుతూ, రోడ్డు ప్రమాదానికి గురై కారులోనే సజీవ దహనమయ్యారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి సమీపంలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా కేంద్రంలోని మమత ఆస్పత్రిలో న్యూరో సర్జన్‌గా పనిచేస్తున్న డాక్టర్ కాసుకుర్తి జగదీశ్ (50) ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు తన వోల్వో కారులో ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. సూర్యాపేట మునిసిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రి అండర్‌పాస్ సమీపంలోకి రాగానే.. జాతీయ రహదారి 365పై 7 గంటల సమయంలో, ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డుకు పక్కన ఉన్న రక్షణ గోడను బలంగా ఢీకొట్టింది. ఇంజన్ భాగంలో మంటలు చెలరేగి క్షణాల వ్యవధిలోనే కారు మొత్తానికి వ్యాపించాయి. జగదీశ్ సీటు బెల్టు పెట్టుకుని ఉండడం, కారు డోర్లు లాక్ అవ్వడంతో బయటకు రాలేకపోయారు. సీటు బెల్టు తీసి, డ్రైవింగ్ పక్క సీటులోకి వచ్చినప్పటికీ మంటలు పూర్తిగా చుట్టుముట్టడంతో బయటపడలేక సజీవదహనం అయ్యారు. కారు మసిబొగ్గుగా మారడం, వైద్యుడి శరీర భాగాలు కూడా గుర్తుపట్టలేని విధంగా కాలిపోవడం ప్రమాద తీవ్రతను తెలియజేస్తోంది. ఫైర్ సిబ్బంది సాయంతో పోలీసులు మంటలు ఆర్పివేశారు. శరీర భాగాలను పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఆస్పత్రికి తరలించారు.
కుమార్తె పుట్టిన రోజుకు వెళ్తుండగా..
డాక్టర్ జగదీశ్‌కు ఇద్దరు కుమార్తెలు. భార్య సుమ హైదరాబాద్‌లోని ఓ మెడికల్ కాలేజీలో బయోకెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తుండగా, కుమార్తెలు ఆమెతో పాటే ఉండి చదువుకుంటున్నారు. సోమవారం పెద్ద కుమార్తె నేహ పుట్టినరోజు కావడంతో జగదీశ్ హైదరాబాద్ ప్రయాణమయ్యారు. డ్రైవర్ రాకపోవడంతో తానే స్వయంగా కారులో బయలుదేరి ప్రమాదం బారినపడ్డారు. శనివారం రాత్రి మమతా ఆస్పత్రిలో నిర్వహించిన వినాయకచవితి వేడుకల్లో పాల్గొన్నారు. వైద్య కళాశాల విద్యార్థులు, సిబ్బందితో కలిసి ఆడిపాడారు. అదేరోజు అర్ధరాత్రి ఓ రోగికి శస్త్రచికిత్స కూడా నిర్వహించారు. తెల్లవారే సరికి ఆయనలేరన్న వార్త తోటి వైద్యులు, కుటుంబసభ్యులను షాక్‌కు గురిచేసింది.
7 వేల ఆపరేషన్లు.. ఆపదలో ఉన్న వారికి సాయం
నిరుపేద కుటుంబంలో పుట్టి.. ఉన్నత స్థాయికి ఎదిగిన డాక్టర్ జగదీశ్ ఆకస్మిక మరణంతో ఆయన స్వగ్రామం ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం సంకువానిగుంటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 2010లో ఖమ్మంలోని మమత ఆస్పత్రిలో న్యూరో సర్జన్‌గా చేరిన ఆయన, ప్రస్తుతం వైద్య కళాశాలలో న్యూరో విభాగానికి చీఫ్‌గా (హెచ్‌వోడీ) పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన 7వేలకు పైగా న్యూరో ఆపరేషన్లు నిర్వహించినట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. జగదీశ్ అంత్యక్రియలు సోమవారం సంకువానిగుంటలో జరగనున్నాయి.
ఈ వార్తలనూ చదవండి..