లోన్ కట్టేస్తారా? అదనంగా బంగారం తెస్తారా?
ABN , Publish Date - Nov 23 , 2026 | 05:05 AM
బంగారం ధర దిగివస్తుండటంపై కొనుగోలుదారుల్లో సంతోషం వ్యక్తమవుతోంది
మారిన రేట్ల ప్రకారం కొంత నగదు వెంటనే జమ చేయండి
పసిడి ధర తగ్గడంతో రుణగ్రహీతలకు బ్యాంకుల నోటీసులు
గడిచిన 11 నెలల్లోనే రూ.60 వేలకు పైగా ధరలు పతనం
తులం రేటు రూ.లక్షకు చేరుతుందన్న వార్తలతో ఆందోళన
రుణాల రికవరీ కష్టమనే ఉద్దేశంతో దిద్దుబాటు చర్యలు
గుంటూరు, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): బంగారం ధర దిగివస్తుండటంపై కొనుగోలుదారుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. అయితే పసిడి ఆభరణాలు బ్యాంకులో తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నవారి పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఊహించని విధంగా పుత్తడి ధర పడిపోవడంతో వారికి కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. పసిడి ధర మరింత తగ్గే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో రుణాలు తీసుకున్నవారికి బ్యాంకులు మార్జిన్ కాల్ నోటీసులు పంపిస్తున్నాయి. లోన్ మొత్తం కట్టేస్తారా? లేకపోతే తీసుకున్న రుణానికి సరితూగే విధంగా అదనంగా బంగారాన్ని కుదువ పెట్టాలని కోరుతున్నాయి. అలాగే ధరలో వచ్చిన వ్యత్యాసం మేరకు రుణాన్ని తగ్గించుకోవాలని, అందుకోసం కొంత మొత్తం నగదు జమ చేయాలని సూచిస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో రుణగ్రహీతలపై ఒత్తిడి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
బంగారం ధరల్లో ఊగిసలాట
ఈ ఏడాది జనవరిలో 10 గ్రా. బంగారం ధర రూ.లక్షా 85వేల మార్కును చేరింది. ఫిబ్రవరి 1 నాటికి రూ.లక్షా 40 వేలకు పడిపోయినా ఆ తరువాత పుంజుకుని రూ. లక్షా 72వేల వరకూ ఎగబాకింది. మళ్లీ నెల రోజుల వ్యవధిలోనే రూ.లక్షా 30వేలకు తగ్గింది. ఆగస్టు చివరి వారం వరకూ ధర పెరుగుతూ వచ్చినా అక్కడినుంచి మరోసారి క్షీణించడం మొదలైంది. నవంబరు ప్రారంభం నాటికి రూ.లక్షా 50 వేల వరకూ పడిపోయిన బంగారం ధర, తర్వాత 20 రోజుల్లో రూ.లక్షా 25 వేలకు చేరింది. ఈ 11 నెలల వ్యవధిలో దాదాపు రూ.60వేల వరకూ బంగారం ధర పడిపోయింది. అయితే ఈ పతనం ఇంతటితో ఆగదని, రూ.లక్షకు కూడా చేరే అవకాశం ఉందన్న వార్తలతో బ్యాంకుల్లో ఆందోళన మొదలైంది.
ఆర్బీఐ నిబంధన నేపథ్యంలో నోటీసులు
సాధారణంగా బంగారం ధరలో 75 శాతం నుంచి 85 శాతం వరకూ బ్యాంకులు రుణంగా ఇస్తాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమలులోకి వచ్చిన ఆర్బీఐ నిబంధనల ప్రకారం రూ.2.5 లక్షల లోపు రుణాలకు బంగారం ధరలో 85 శాతం, రూ.5 లక్షల లోపు రుణాలైతే 80 శాతం, అంతకంటే ఎక్కువ అయితే బంగారం ధరలో 75 శాతం మాత్రమే రుణం ఇవ్వాలి. ప్రస్తుతం బంగారం ధర ఏకంగా 32శాతం వరకూ పడిపోయింది. ఇది బ్యాంకులకు నష్టాన్ని కలిగించే అంశంగా పరిణమించింది. ఉదాహరణకు 10 గ్రాముల బంగారం ధర రూ.లక్షా 80 వేలు ఉన్నప్పుడు రుణం తీసుకుంటే రూ. 1.53 లక్షల నుంచి రూ.1.35 లక్షల వరకూ వచ్చే అవకాశం ఉంది. దానికి వడ్డీ కూడా కలిపితే ఈ మొత్తం మరింత పెరుగుతుంది. ప్రస్తుతం బంగారం ధర రూ.1.25 లక్షలకు పడిపోయింది. అంటే బ్యాంకు వద్ద తీసుకున్న రుణం కంటే, బంగారం ధర విపరీతంగా తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో ఎక్కువమంది రుణాలు చెల్లించకుండా, కుదువ పెట్టిన బంగారాన్ని బ్యాంకుల్లోనే వదిలివేసే ప్రమాదం ఉంటుంది. దాన్ని వేలం వేసి రుణాలను రికవరీ చేసుకుందామన్నా, అంత మొత్తం తిరిగివచ్చే అవకాశం ఉండదు. దీంతో బ్యాంకులు దిద్దుబాటు చర్యలకు దిగాయి.
ఈ వార్తలు కూడా చదవండి...
కాంగ్రెస్, బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు మానుకోవాలి.. ఎంపీ అరవింద్ ధ్వజం
ఆన్లైన్ గేమింగ్ నెట్వర్క్పై డీజీజీఐ మెరుపు దాడులు