పింఛన్‌దారులు విచారణకు రావాలంటూ నకిలీ నోటీసులు!
ABN , Publish Date - Nov 26 , 2026 | 06:13 AM
పంచాయతీ ఎన్నికల వేళ ప్రజలను గందరగోళానికి గురిచేసి.. ప్రభుత్వంపై బురదజల్లే కుట్రలకు కొందరు తెరదీశారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పొందుతున్న వారు విచారణకు రావాలంటూ..
నందిగామ రూరల్.. కొండూరు
పంచాయతీ ఎన్నికల వేళ కలకలం
నందిగామ రూరల్, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల వేళ ప్రజలను గందరగోళానికి గురిచేసి.. ప్రభుత్వంపై బురదజల్లే కుట్రలకు కొందరు తెరదీశారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పొందుతున్న వారు విచారణకు రావాలంటూ.. ఎంపీడీవో సంతకంతో కూడిన ఓ నకిలీ నోటీసును సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీనిపై లబ్ధిదారులు ఆందోళన చెందారు. అయితే.. ఈ నోటీసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఎంపీడీవో స్పష్టం చేశారు.
నకిలీ నోటీసులో ఏముందంటే.. ‘‘ఎన్టీఆర్ జిల్లా నందిగామ రూరల్ మండలంలోని కొండూరు గ్రామానికి చెందిన 20 మంది డప్పు, దివ్యాంగుల పింఛన్ లబ్ధిదారుల అర్హతకు సంబంధించి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 10.30 గంటలకు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరిగే విచారణకు ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో రావాలి.’’ అని పేర్కొన్నారు.
దీనిని గ్రామ కార్యదర్శి రవి లబ్ధిదారులకు అందించారు. దీంతో లబ్ధిదారులు స్థానిక నాయకులను ఆశ్రయించారు. వారు కార్యదర్శిని వివరణ కోరగా, ఎంపీడీవో నోటీస్ ఇచ్చారని తెలిపారు. మరోవైపు లబ్ధిదారులకు నోటీసులు జారీ చేయడాన్ని ఎంపీడీవో ప్రసాదరావు ఖండించారు. నోటీసుపై తాను సంతకం చేయలేదని, దీనిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
యలహంక ప్యాలెస్ వివాదం.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్