Share News

10 రోజుల తర్వాత యజమాని చెంతకు చేరిన మాట్లాడే చిలుక

ABN , Publish Date - Jan 26 , 2026 | 04:09 PM

బండారు దొరబాబు పెంచుకుంటున్న చిలుక ‘ఆఫ్రికన్ గ్రే ప్యారట్’ జాతికి చెందినది. బహిరంగ మార్కెట్‌లో వీటి ధర రూ.80 వేల నుంచి రూ. 1.50 లక్షల వరకు ఉంటుంది.

10 రోజుల తర్వాత యజమాని చెంతకు చేరిన మాట్లాడే చిలుక
Konaseema parrot news

అమరావతి, జనవరి 26: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సంక్రాంతి పండుగ రోజున ఎగిరిపోయిన ఓ ఖరీదైన చిలుక ఎట్టకేలకు దొరికింది. ఓ యువకుడి పుణ్యమా అని 10 రోజుల తర్వాత యజమాని దొరబాబు చెంతకు చేరింది. దీంతో దొరబాబు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కాట్రేనికోనలోని కొత్తపాలేనికి చెందిన బండారు దొరబాబు అనే యువకుడు మూడేళ్ల క్రితం రూ.80 వేలు పెట్టి హైదరాబాద్‌లో ఓ మాట్లాడే చిలుకను కొన్నాడు. దానికి 'చార్లీ' అని పేరు పెట్టి అల్లారుముద్దుగా చూసుకుంటున్నాడు. సంక్రాంతి రోజున ఆ చిలుక పంజరం నుంచి బయటకు వెళ్లిపోయింది. మళ్లీ తిరిగి రాలేదు.


దీంతో దొరబాబు దాని కోసం చుట్టు పక్కల గ్రామాల్లో చాలా వెతికాడు. అయినా లాభం లేకుండా పోయింది. చిలుక మిస్ అయిన సంఘటన గురించి మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ కథనాలు వచ్చాయి. దీంతో అయినవిల్లి మండలంలోని మాగంలో ఓ వ్యక్తి దగ్గర చిలుక ఉన్నట్లు ఓ యువకుడు గుర్తించాడు. వెంటనే ఆ చిలుకను స్వాధీనం చేసుకుని దొరబాబుకు విషయం తెలియజేశాడు. సమాచారం అందిన వెంటనే దొరబాబు మాగానికి వెళ్లి తన ప్రియమైన చిలుకను ఇంటికి తీసుకువచ్చేశాడు. అనంతరం.. తన చార్లీ దొరకటంపై తన సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో రిలీజ్ చేశాడు.


ఆ వీడియోలో.. ‘అందరికీ నమస్కారం. మీ అందరి సహాయ సహకారాలతో చార్లీ మళ్లీ నా దగ్గరకు వచ్చింది. మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీడియా, సోషల్ మీడియా మిత్రుల కృషి వల్లే చార్లీ నా దగ్గరకు వచ్చింది’ అని అన్నాడు. ఇక, బండారు దొరబాబు పెంచుకుంటున్న చిలుక ‘ఆఫ్రికన్ గ్రే ప్యారట్’ జాతికి చెందినది. బహిరంగ మార్కెట్‌లో వీటి ధర రూ.80 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు ఉంటుంది. ఈ చిలుకలు చాలా చక్కగా మనుషుల్ని అనుకరించి మాట్లాడతాయి.


ఇవి కూడా చదవండి

రిపబ్లిక్ డే వేడుకల్లో గుండెపోటుతో ఎస్ఐ కన్నుమూత

ఆ స్కామ్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్న బీఆర్ఎస్

Updated Date - Jan 26 , 2026 | 04:24 PM