Share News

మద్యం రవాణా స్కాం కేసు.. ఈడీ కస్టడీలో ఈశ్వర్‌

ABN , Publish Date - Nov 06 , 2026 | 05:28 AM

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం రవాణా టెండర్ల కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైన రాజ్‌ కసిరెడ్డికి అత్యంత సన్నిహితుడైన టి.ఈశ్వర్‌ కిరణ్‌కుమార్‌రెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తన కస్టడీలోకి తీసుకుంది. గురువారం చంచల్‌గూడ జైలు నుంచి హైదరాబాద్‌లోని తన కార్యాలయానికి తరలించింది.

మద్యం రవాణా స్కాం కేసు.. ఈడీ కస్టడీలో ఈశ్వర్‌

  • రెండ్రోజులు విచారించనున్న అధికారులు

  • రాజ్‌ కసిరెడ్డికి ఈయన అత్యంత సన్నిహితుడు

  • షెల్‌ కంపెనీలు, హవాలా ద్వారా ముడుపుల సొమ్ము మళ్లించినట్లు ఆరోపణలు

  • రవాణా సబ్‌ కాంట్రాక్టులు, నగదు లావాదేవీలపై ఈడీ ఆరా

హైదరాబాద్‌, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో మద్యం రవాణా టెండర్ల కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైన రాజ్‌ కసిరెడ్డికి అత్యంత సన్నిహితుడైన టి.ఈశ్వర్‌ కిరణ్‌కుమార్‌రెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తన కస్టడీలోకి తీసుకుంది. గురువారం చంచల్‌గూడ జైలు నుంచి హైదరాబాద్‌లోని తన కార్యాలయానికి తరలించింది. రెండ్రోజుల పాటు ఆయన్ను విచారించనుంది. మద్యం రవాణా స్కాంలో కిరణ్‌కుమార్‌రెడ్డి అత్యంత కీలకంగా వ్యవహరించినట్లు ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) దర్యాప్తులో తేలింది. ఈ కుంభకోణంలో ముడుపుల ద్వారా అక్రమంగా సంపాదించిన సొమ్మును షెల్‌ కంపెనీలకు, హవాలా మార్గాల్లో మళ్లించడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు.

మద్యం రవాణా సబ్‌ కాంట్రాక్టర్ల నుంచి డిపోకు రూ.5 లక్షల చొప్పున ముందస్తుగా వసూలు చేశారని.. ఈ విధంగా రూ.కోటి వసూలు చేశారని విచారణలో వెల్లడైంది. ఇలా వచ్చిన సొమ్ములో వాస్తవ రవాణా ఖర్చుల కంటే రూ.40 లక్షల నుంచి రూ.60 లక్షలు అధికంగా బిల్లులు వేయించి, అదనపు మొత్తాన్ని నగదు రూపం లో తీసుకున్నారని.. ఈ పద్ధతి ద్వారా నెలకు రూ.50 లక్షలు ఈశ్వర్‌కు చేరినట్లు ఈడీ కోర్టులో వేసిన కస్టడీ పిటిషన్‌లో పేర్కొంది. అయితే రవాణా కుంభకోణంలో ప్రభుత్వానికి జరిగిన రూ.195.33 కోట్ల నష్టం ఒక కోణం మాత్రమేనని.. నేరుగా ఈశ్వర్‌కు చేరిన రూ.కోట్లు ఏ విధంగా ఏయే మార్గాల్లో మళ్లించారు.. అంతిమంగా డబ్బు ఎక్కడకు చేరిందో గుర్తించడానికి ఈడీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన విచారణ కీలకంగా మారింది.

ఈ వార్తలనూ చదవండి:

ఓటెత్తిన పల్లెలు

అభివృద్ధి చేయలేదని.. ఎన్నికల బహిష్కరణ

Updated Date - Nov 06 , 2026 | 05:28 AM