Share News

వారం రోజులుగా తాగు నీరే లేదు!

ABN , Publish Date - Nov 12 , 2026 | 05:28 AM

మురసు తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు సత్యసాయి మంచినీటి పథకం పైపులైన్లు కొట్టుకుపోవడంతో ఏలూరు జిల్లాలోని పోలవరం సహా ...

వారం రోజులుగా తాగు నీరే లేదు!

  • తుఫానుకు కొట్టుకుపోయిన సత్యసాయి పైపులైన్లు

  • 17 మండలాల్లో మంచినీరు కరువు

పోలవరం, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): మురసు తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు సత్యసాయి మంచినీటి పథకం పైపులైన్లు కొట్టుకుపోవడంతో ఏలూరు జిల్లాలోని పోలవరం సహా 17 మండలాలకు మంచినీటి సరఫరా నిలిచిపోయింది. సుమారు 270 గ్రామాల ప్రజలు వారం రోజులుగా మంచినీటికి ఇబ్బందులు పడుతున్నారు. పోలవరం మండలం ప్రగడపల్లి, గోపాలపురం ప్రాంతాల్లో మంచినీటి పైపులైన్లు 800 మీటర్ల మేర కొట్టుకుపోవడంతో కన్నాపురం అడ్డరోడ్డు నుంచిఇతర ప్రాంతాలకు మంచినీటి సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. దీంతో మిగతా 16 మండలాలతోపాటు పోలవరం మండలంలో పునరావాస గ్రామాలకు మంచినీటి సరఫరా నిలిచిపోయింది. ఆయా గ్రామాల ప్రజలు పంట పొలాల్లోని బోరు బావుల నుంచి బైకులు, ఆటోలపై మంచినీరు తెచ్చుకుంటున్నారు. మరికొంతమంది ప్రైవేటు వాటర్‌ ప్లాంట్ల వద్ద కొనుక్కుంటున్నారు.

పోలవరం నుంచి గూటాల వరకూ ఉన్న పైపులకు నష్టం జరక్కపోయినా.. నీటి సరఫరా నిలిపివేయడంపై ఆయా గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సత్యసాయి సిబ్బందిని ప్రశ్నించగా.. గోదావరిలో నీరు రంగు మారాయని, నీటిని శుద్ధి చేసే పటిక లేకపోవడంతో సరఫరా నిలిపివేసినట్లు చెప్పారు. ఈ విషయమై ఆర్‌డబ్ల్యుఎస్‌ ఏఈ గంగరాజును వివరణ కోరగా సమస్యను ఉన్నతాధికారులకు నివేదించామన్నారు. నీటిని శుద్ధిచేసి, సరఫరాను పునరుద్ధరిస్తామని చెప్పారు.

రూ.12 కోట్ల బకాయిలతో జీతాలూ ఇవ్వలేకపోతున్నాం- కాంట్రాక్టర్‌

సత్యసాయి మంచినీటి సరఫరా కాంట్రాక్టరు సత్యనారాయణను వివరణ కోరగా రెండున్నరేళ్లుగా ప్రభుత్వం తమకు రూ.12 కోట్ల బకాయిలు చెల్లించలేదని, దీంతో సిబ్బందికి ఐదు నెలలుగా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ఇదే స్ఫూర్తితో స్వచ్ఛాంధ్ర సాధనకు అంతా కలిసి పనిచేద్దాం: సీఎం చంద్రబాబు

15 ఏళ్ల తర్వాత లంచం కేసులో తీర్పు.. మాజీ సీఐకి ఏడాది జైలు

Updated Date - Nov 12 , 2026 | 05:29 AM