ఒక కాలు తీసేయాల్సిందే!
ABN , Publish Date - Nov 03 , 2026 | 04:09 AM
విద్యార్థినులపై ఎలక్ట్రిక్ రంపంతో దాడికి తెగబడిన రాప్తాడు ఉన్మాది హేమంత్‌కు ఒక కాలు తొలగించాలని వైద్యులు నిర్ణయించారు. రాప్తాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులపై దాడిచేసి పారిపోయిన హేమంత్‌ను పోలీసులు కాల్పులు జరిపి ఆదివారం సాయంత్రం పట్టుకున్న విషయం తెలిసిందే.
రాప్తాడు ఉన్మాది హేమంత్ కుడి కాలికి రక్తప్రసరణ ఆగడంతో గ్యాంగ్రీన్
కాలు తొలగించాలని వైద్యుల నిర్ణయం
కోర్టు ఆదేశాల కోసం ఎదురుచూపు..
అర్ధరాత్రికి వచ్చిన అనుమతి
అప్పటికప్పుడు సర్జరీకి
అనంతపురం వైద్యం, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): విద్యార్థినులపై ఎలక్ట్రిక్ రంపంతో దాడికి తెగబడిన రాప్తాడు ఉన్మాది హేమంత్‌కు ఒక కాలు తొలగించాలని వైద్యులు నిర్ణయించారు. రాప్తాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులపై దాడిచేసి పారిపోయిన హేమంత్‌ను పోలీసులు కాల్పులు జరిపి ఆదివారం సాయంత్రం పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాళ్లకు బుల్లెట్ గాయాలు కావడంతో ప్రస్తుతం అతనికి అనంతపురం సర్వజన వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు. వైద్య పరీక్షల్లో హేమంత్ కుడి మోకాలు నుంచి కింద భాగానికి రక్త ప్రసరణ ఆగిపోయినట్లు డాక్టర్లు గుర్తించారు. దీంతో ఆ భాగంలో కణజాలం వేగంగా క్షీణించి, కుళ్లిపోయిందని తేల్చారు.
గ్యాంగ్రీన్‌గా పేర్కొనే ఈ సమస్య శరీరంలోని మిగతా భాగాలకు పాకితే ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది. దీంతో అతని కాలు తొలగించాలని డాక్టర్లు నిర్ణయించారు. కానీ... హేమంత్ ప్రస్తుతం క్రిమినల్ కేసు నిందితుడు కావడంతో కాలు తొలగించేందుకు కోర్టు అనుమతి తప్పనిసరి. ఈ విషయాన్ని పోలీసు అధికారులకు తెలియజేశామని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి తెలిపారు. సోమవారం అర్ధరాత్రి కోర్టు అనుమతి రావడంతో అప్పటికప్పుడు సర్జరీకి తరలించారు.
అంతకుముందు...
హేమంత్‌ను ఆదివారం రాత్రి ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్‌కు తరలించి చికిత్స అందించారు. అనంతరం ఐసీయూకి తరలించారు. అర్ధరాత్రి అన్నిరకాల స్కానింగ్‌లు, రక్త పరీక్షలు, బ్రెయిన్, బాడీ స్కానింగ్ చేశారు. అన్నిభాగాలకు ఎక్స్‌రే తీయించారు. ఈ ఫలితాల్లో కుడికాలుకు గ్యాంగ్రీన్ సోకినట్లు గుర్తించారు. ఆ కాలు తొలగించేందుకు సోమవారం ఉదయం వైద్యులు సిద్ధమయ్యారు. సూపర్ స్పెషాలిటీ, జనరల్ సర్జరీ, ఆర్థో, అనస్థీషియా విభాగాల వైద్యులు కూడా ఆపరేషన్ థియేటర్‌కు చేరుకున్నారు. రాత్రి 9 గంటల వరకు ఉన్నతాధికారుల అనుమతి కోసం వేచిచూశారు. ఏ క్షణమైనా ఆపరేషన్ చేయాల్సి రావచ్చని భావించి, హేమంత్‌కు నోటి ద్వారా ఆహారం ఇవ్వకుండా ఫ్లూయిడ్స్ అందిస్తున్నారు.
ప్రత్యేక గదిలో ఉంచి చికిత్స
హేమంత్‌కు చికిత్స అందించేందుకు సర్వజనవైద్యశాల అధికారులు ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. మొదట సాధారణ రోగులతోపాటు ఐసీయూలో ఉంచారు. విషయం తెలుసుకుని ప్రజలు ఆస్పత్రికి భారీగా వస్తుండటంతో అతనిపై దాడి జరగొచ్చని నిఘా వర్గాలు గుర్తించాయి. ఎన్‌కౌంటర్ చేయకుండా ఆస్పత్రికి ఎందుకు తీసుకువచ్చారని, ఆ ఉన్మాదిని తామే చూసుకుంటామని కొందరు ఆగ్రహంతో ఊగిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పోలీసు భద్రత ఏర్పాటు చేసి ప్రత్యేక గదిలో చికిత్స అందిస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
త్వరితగతిన రాష్ట్రానికి సాయం అందించండి.. కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
ఏపీ లిక్కర్ స్కామ్.. ఈడీ కస్టడీలో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి