Share News

మురసు తుఫాను నష్టం రూ.2,484.43 కోట్లు

ABN , Publish Date - Nov 14 , 2026 | 01:03 AM

మురసు తుఫాను కారణంగా రాష్ట్రంలో వివిధ రంగాలకు రూ.2,484.43కోట్ల నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లింది.

మురసు తుఫాను నష్టం రూ.2,484.43 కోట్లు

  • కేంద్ర బృందానికి తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం

  • ఆర్టీజీఎస్‌ సీఈవో ప్రఖర్‌జైన్‌ వెల్లడి

  • సహాయ, పునరావాస, పునరుద్ధరణ పనులు భేష్‌

  • కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ప్రశంసలు

అమరావతి, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): మురసు తుఫాను కారణంగా రాష్ట్రంలో వివిధ రంగాలకు రూ.2,484.43కోట్ల నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లింది. అర్నబ్‌ తుఫాన్‌ సహాయ చర్యలు కొనసాగుతుండగానే మురసు తుఫాను రావడంతో 1.86లక్షల మంది రైతులకు చెందిన 1.43లక్షల హెక్టార్లలోని సాధారణ పంటలు, 6,756 హెక్టార్లలోని ఉద్యాన పంటలు, 3,859 ఇళ్లు, 1,385 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయని తెలిపింది. మురసు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన కోసం రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం శుక్రవారం తాడేపల్లిలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయానికి వచ్చింది.

ఈ సందర్భంగా మురసు తుఫానుతో జరిగిన నష్టం, ప్రభుత్వ ముందస్తు సన్నద్ధత, సహాయ చర్యలు, పునరుద్ధరణ పనులపై ఆర్టీజీఎస్‌ సీఈవో ప్రఖర్‌జైన్‌ కేంద్ర బృందానికి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లోని 1,93,769 మంది తుఫాను వల్ల తీవ్రంగా ప్రభావితమైనట్లు తెలిపారు. ఆర్‌అండ్‌బీకి రూ.889కోట్లు, వ్యవసాయ శాఖకు రూ.875కోట్లు, ఉద్యాన శాఖకు రూ.337 కోట్లు, జలవనరుల శాఖకు రూ.136 కోట్లు, పంచాయతీరాజ్‌ శాఖకు రూ.119 కోట్లు, విద్యుత్‌శాఖకు రూ.54కోట్లు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. తుఫాను వేళ ‘మనమిత్ర’ వాట్సాప్‌, టోల్‌ఫ్రీ నంబర్ల ద్వారా వచ్చిన ఫిర్యాదులపై తీసుకున్న ముందస్తు చర్యలను కేంద్ర బృందానికి వివరించారు.


ఈ సందర్భంగా కేంద్ర బృందానికి నేతృత్వం వహించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్‌దాస్‌ మాట్లాడుతూ ఏపీలో తుఫాన్ల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం, వివిధ శాఖల ద్వారా చేపట్టిన సహాయ, పునరావాస కార్యక్రమాలు భేషుగ్గా ఉన్నాయని ప్రశంసించారు.

తుఫాను సమయంలో ముందస్తు అప్రమత్తత, సన్నద్ధతతో ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించడంతోపాటు ప్రభుత్వ యంత్రాంగం చిత్తశుద్ధి, అంకితభావం, సమన్వయంతో పనిచేసి, విద్యుత్‌ సరఫరా, మొబైల్‌ నెట్‌వర్క్‌, రోడ్డు కనెక్టివిటీని పునరుద్ధరించడం అభినందనీయమని కొనియాడారు. విపత్తులు, సంక్షోభ సమయంలో వివిధ రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవడం, ఒకరికొకరు అండగా నిలవడం సహకార సమాఖ్య విధానానికి నిదర్శనమన్నారు. తుఫాను నష్టాన్ని అంచనా వేసి, కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇస్తామని తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

‘గుర్తు’ పట్టకపోతే నష్టం!

జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: మంత్రి లోకేశ్

Updated Date - Nov 14 , 2026 | 01:06 AM