కోనసీమ కకావికలం
ABN , Publish Date - Oct 29 , 2026 | 05:36 AM
పచ్చటి కోనసీమపై ఆర్నబ్ తుఫాను కత్తి దూసింది. ఆంధ్రా కేరళగా ప్రసిద్ధి చెందిన కోనసీమ చండ ప్రచండ గాలులతో బెంబేలెత్తింది. ‘ఆర్నబ్’ సృష్టించిన విలయానికి ఏకంగా 33వేల కొబ్బరిచెట్లు పేకమేడల్లా కూలిపోయాయి.
కాకినాడ పోర్టులోని బెర్తులపైకి ఎగిరిపడ్డ బార్జిలు
కుప్ప కూలిన 33వేల కొబ్బరిచెట్లు, 10వేల ఇతర చెట్లు
ప్రచండ గాలులకు 8వేల విద్యుత్ స్తంభాలు నేలమట్టం
నరసాపురం వద్ద తీరం దాటాక మరింత విధ్వంసం
కోనసీమవ్యాప్తంగా రహదారులన్నీ బంద్
కాకినాడ, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): పచ్చటి కోనసీమపై ఆర్నబ్ తుఫాను కత్తి దూసింది. ఆంధ్రా కేరళగా ప్రసిద్ధి చెందిన కోనసీమ చండ ప్రచండ గాలులతో బెంబేలెత్తింది. ‘ఆర్నబ్’ సృష్టించిన విలయానికి ఏకంగా 33వేల కొబ్బరిచెట్లు పేకమేడల్లా కూలిపోయాయి. ఈ ప్రాంతంలో ఎక్కడచూసినా కనిపించే కొబ్బరిచెట్లు.. గ్రామగ్రామానా నేలకూలి, రహదారులపై తెగిపడ్డాయి. రోడ్లకు ఇరువైపులా 10వేల భారీ వృక్షాలు నేలకొరిగాయి. 150 కిలోమీటర్లకు పైగా వేగంతో వీచిన పెనుగాలులకు 8 వేల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. తుఫాను తీరం దాటిన యానాంను ఆనుకుని ఉన్న నరసాపురం మధ్యనున్న కోనసీమ జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు పెనుగాలుల బీభత్సం సాగింది.
అల్లవరం నుంచి అంతర్వేది వరకు సముద్రం ముందుకు వచ్చేసింది. తుఫాను కాకినాడ-యానాం మధ్య తీరం దాటుతుందని తొలుత ప్రచారం జరిగింది. అయితే యానాంకు నైరుతివైపు 20 కిమీ దూరంలో నరసాపురం వద్ద బుధవారం తీరం దాటింది. సరిగ్గా తెల్లవారు జామున 1.20గంటలకు యానాం వద్ద తుఫాను తీరాన్ని దాటి భూమ్మీదకు దిగినక్రమంలో కాకినాడ, కోనసీమ జిల్లాలు వణికిపోయాయి. ఉప్పాడ వద్ద కడలి కల్లోలంగా మారింది. సముద్రం బాగా ముందుకు వచ్చేయడంతో వందకుపైగా ఇళ్లు అందులో కలిసిపోయాయి. మరోచోట 500మీటర్ల మేర నిర్మించిన సిమెంట్ రోడ్డు 80శాతం సముద్రంలో కలిసిపోయింది.
ఉప్పాడ సెంటర్ సమీపంలో ఇళ్లల్లోకి సముద్రం వచ్చేయడంతో వారంతా పునరావాస శిబిరాలకు తరలివెళ్లిపోయారు. కాకినాడ రూరల్, కరప మండలాల్లో తీరప్రాంతంలోని ఇళ్లల్లోకి కూడా సముద్రపు నీరు వచ్చేసింది. కరప మండలంలో 90విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. యానాంలో సావిత్రినగర్‌లో ఇళ్లల్లోకి సముద్రం నీరు వచ్చేసింది. కాకినాడలో ఉప్పాడ బీచ్‌రోడ్డు ముక్కలై తెగిపోయింది. తీరప్రాంత కోత నివారణకు అడ్డంగా నిర్మించిన రక్షణగోడ ధ్వంసమై ఆరడుగుల గోడ రెండడుగులకు మిగిలింది. పెద్దపెద్ద బండరాళ్లన్ని ఎగిరి పడ్డాయి.
అల్లవరంలో సముద్రం ముందుకురావడంతో ఓఎన్జీసీ ప్లాంట్ ప్రహరీ గోడను అలలు తాకాయి. ముందు జాగ్రత్తగా అల్లవరం ఓడలరేవు హార్బర్‌లో లంగరు వేసిన 200బోట్లు అలల ధాటికి ఒకదాన్ని మరొకటి ఢీకొని ముక్కలయ్యాయి. వందలాది వలలు కొట్టుకుపోయాయి. తుఫాను ధాటికి మంగళవారం సాయంత్రం నుంచి విద్యుత్ నిలిపివేయగా, బుధవారం అర్థరాత్రి దాటినా సరఫరా పునరుద్ధరణ కాలేదు.
కోనసీమ జిల్లాలో 10వేల కొత్త స్తంభాలను అధికారులు సిద్ధం చేశారు. 2 వేల మంది సిబ్బందితో యుద్ధప్రాతిపదికన పనులు చేయించారు. అయితే ఈదురుగాలులు, వర్షాల తీవ్రతకు సహాయ చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది. అలాగే కోనసీమ జిల్లావ్యాప్తంగా కూలిన చెట్ల కారణంగా ఒక మండలం నుంచి మరో మండలానికి రాకపోకలు సాగించడం కష్టమైంది.
కాళరాత్రిలా..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్నబ్ తుఫాను ధాటికి విలవిల్లాడింది. తీవ్ర తుఫాను తీరాన్ని సమీపించేకొద్దీ కుంభవృష్టి వర్షాలు కురిశాయి. గాలుల తీవ్రత 100నుంచి 150 కిలోమీటర్ల వేగానికి పెరిగింది. ఇళ్లల్లో ఉన్న జనానికి బయట ఈదురుగాలుల శబ్దాలు, కూలుతున్న చెట్లు, స్తంభాల పెను ధ్వనులు బెంబేలెత్తించాయి. కోనసీమలో బుధవారం అర్ధరాత్రి దాటినా గాలుల తీవ్రత తగ్గలేదు. కొబ్బరిచెట్లు కూలడం ఆగలేదు. అధికారులు సేకరించిన ప్రాథమిక సమాచారం మేరకు కోనసీమ జిల్లాలో 33వేల కొబ్బరిచెట్లు నేలకూలాయి. అమలాపురం, అల్లవరం, మామిడికుదురు, సఖినేటిపల్లి, ఉప్పలగుప్తం, రాజోలు తదితర మండలాల్లో 8వేల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.
1200 టన్నుల బార్జిలు ఎగిరిపడ్డాయి..
తీవ్ర తుఫానుకు కాకినాడ యాంకరేజ్ పోర్టులో పలు చోట్ల భారీ నష్టం జరిగింది. గోదాముల గోడలు నేలకూలిపోయాయి. విదేశాలకు బియ్యం ఎగుమతి కోసం వచ్చి సముద్రం మధ్యలో ఉండే నౌకల్లోకి పోర్టు నుంచి బార్జిల్లో బియ్యం బస్తాలు తరలిస్తారు. ఒక్కో బార్జి 1,200 టన్నుల వరకు బరువు ఉంటుంది. మంగళవారం అర్ధరాత్రి సముద్రంలో ఉప్పెన రావడం, అలలు రెండుమీటర్లకు ఎగిసిపడ్డంతో 14 బార్జిలు కూడా పైకి ఎగిరి పోయాయి. ఆ తర్వాత అవి బెర్త్‌పైకి వచ్చి పడ్డాయి. దీంతో బెర్త్ దెబ్బతింది. ఎన్ని తుఫాన్లు వచ్చినా ఇప్పటివరకు పోర్టులో ఇలాంటి నష్టం వాటిల్లలేదని ఉద్యోగులు చెబుతున్నారు.
యాంకరేజ్ పోర్టుకు మొత్తం రూ.25కోట్ల నష్టం వాటిల్లింది. కాకినాడ ఎన్టీఆర్ బీచ్ పూర్తిగా ధ్వంసం అయింది. పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన వసతులన్నీ నామరూపాల్లేకుండా పోయాయి. మరోపక్క తుఫాను తీవ్రతకు కాకినాడ జిల్లాలో కోతకు సిద్ధంగా ఉన్న లక్షన్నర ఎకరాల్లో వరి పంటకు నష్టనం వాటిల్లింది. పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలో 2.10లక్షల ఎకరాల్లో వరి పంటలోకి నీరు చేరినట్లు గుర్తించారు. అలాగే కోనసీమలో అరటిపంటకు తీవ్ర నష్టం వాటిల్లింది.
అరకు ఘాట్‌రోడ్డు మూత
అల్లూరి సీతారామరాజు జిల్లాలో మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం భారీవర్షం కురిసింది. దీంతో అనంతగిరి మండలం బీసుపురం సమీపాన ఘాట్‌రోడ్డు రక్షణ గోడ కూలిపోయింది. అలాగే బొర్రా-కరకవలస మధ్య రైల్వే లైన్ కూడా దెబ్బతిన్నది. ఇంకా కొండల నుంచి వరద నీరు ఘాట్‌రోడ్డుపైకి రావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొయ్యూరు సమీపంలోని చింతాలమ్మఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. జిల్లాలోని అన్ని ఘాట్ మార్గాల్లో రాత్రులు వాహన రాకపోకలు నిషేధించారు.
ఫిషింగ్ హార్బర్‌లో బోట్లు మునక
విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో 6 మత్స్యకారుల బోట్లు సముద్రంలో మునిగిపోయాయి. తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని, సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించడంతో మత్స్యకారులు వారి బోట్లను జెట్టీలో లంగరు వేసి వెళ్లిపోయారు. మంగళవారం కురిసిన భారీవర్షాలు, సముద్రపు అలల ఉధృతికి బోట్లు ఒక దానికొకటి ఢీకొని ఐదు సముద్రంలో మునిగిపోయాయి. మరో బోటు పూర్తిగా పాడైపోయింది. విషయం తెలిసి విశాఖ ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఫిషింగ్ హార్బర్‌కు వెళ్లి మత్స్యకారులకు తగిన నష్టపరిహారం వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు.
అంధకారంలో పిఠాపురం
పిఠాపురంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షంతో కాలనీలు ముంపునకు గురయ్యాయి. రోడ్లు జలమయమయ్యాయి. పట్టణం 33 గంటలు అంధకారంలో చిక్కుకుంది. మంగళవారం సాయంత్రం 4గంటలకు నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను బుధవారం రాత్రి వరకూ పునురుద్దరించలేదు. పిఠాపురం ప్రభుత్వాసుపత్రి వర్షపునీటిలో చిక్కుకుంది.
ఈ వార్తలనూ చదవండి:
ఆర్నబ్ తుఫాన్ బాధితులకు సీఎం చంద్రబాబు భారీ ఊరట