ఉత్తరాంధ్రలో ఆర్నబ్ బీభత్సం
ABN , Publish Date - Oct 29 , 2026 | 05:41 AM
ఉత్తరాంధ్ర జిల్లాలను ఆర్నబ్ తుఫాన్ అతలాకుతలం చేసింది. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీ వర్షాలతోపాటు బలమైన ఈదురు గాలులు విరుచుకుపడ్డాయి. దీంతో సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది.
అతలాకుతలమైన విజయనగరం
శ్రీకాకుళంలో గ్రామాలు జలదిగ్బంధం
నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
పొంగిపొర్లుతున్న వాగులు, చెరువులు
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్): ఉత్తరాంధ్ర జిల్లాలను ఆర్నబ్ తుఫాన్ అతలాకుతలం చేసింది. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీ వర్షాలతోపాటు బలమైన ఈదురు గాలులు విరుచుకుపడ్డాయి. దీంతో సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. విజయనగరం జిల్లాలోని వాగులు, గెడ్డలు, నదులు పొంగిపొర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరి పంటలు నీట మునగడంతో పాటు ఈదురు గాలులకు నేలకొరిగాయి. చెరువులకు గండ్లు పడటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ఇళ్లలోకి వరదనీరు చేరడంతో పలుచోట్ల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 496 ఫీడర్లలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. రావాడ వద్ద రోడ్డు కొట్టుకుపోయింది. విజయనగరంలోని అయ్యన్నపేట విద్యుత్ సబ్‌స్టేషన్‌లోకి భారీగా వరద నీరు చేరింది. బొండపల్లి మండలం వెదురువాడ, కొవ్వాడపేట, బొండపల్లి, గొట్లాం గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. గజపతినగరం మండలంలో చంపావతి నది ఉధృతికి మర్రివలస వద్ద రాకపోకలు నిలిచిపోయి, 5 గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాజాం ప్రాంతంలో సారధిగెడ్డ, ఇతర వాగులు ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో7287 హెక్టార్లలో వరి, 8 హెక్టార్లలో ఇతర పంటలు దెబ్బతిన్నాయి.
శ్రీకాకుళంలో..
తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు, ఈదురుగాలులు శ్రీకాకుళం జిల్లాలో జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. గెడ్డలు, వాగులు పొంగిపొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వేలాది ఎకరాల్లో వరి, కూరగాయలు, ఉద్యాన పంటలు నీటమునిగాయి. పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. లావేరు మండలంలోని పెద్దగెడ్డ పొంగి ప్రవహించడంతో రాయిలింగారిపేట, నేతేరు, లక్ష్మీపురం సమీపంలోని కాజ్‌వేలపై వరద ఉధృతి పెరిగింది. సుమారు 40 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇచ్ఛాపురం ప్రాంతంలో ఒడిశాలోని బగలెట్టి డ్యాం గేట్లు ఎత్తివేయడంతో బాహుదా నదికి వరదనీరు భారీగా చేరింది. నరసన్నపేట, సరుబుజ్జిలి, ఎల్.ఎన్.పేట, పొందూరు, టెక్కలి, పలాస, కోటబొమ్మాళి, పాతపట్నం తదితర ప్రాంతాల్లో వరి పైరు నేలకొరిగింది. ఉద్దానం ప్రాంతంలో 600 కొబ్బరి చెట్లు విరిగిపోయాయి. జిల్లాలో 6641.37 హెక్టార్ల వరి, 5.85 హెక్టార్లలో పెసర, మినుము పంటలునీట మునిగాయి 150 హెక్టార్లలో కూరగాయల పంటలకు తీవ్ర నష్టం కలిగింది.
పార్వతీపురం మన్యం..
అతి తీవ్ర తుఫాన్ ఆర్నబ్ పార్వతీపురంమన్యం జిల్లాను వణికించింది. కుండపోత వర్షాలతో నదులు, చెరువులకు వరద పోటెత్తింది. ఏజెన్సీలో వాగులు, వంకలు ఉప్పొంగాయి. పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. పూరిళ్లు నేలమట్టమయ్యాయి. గిరిజన గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పలు ప్రాంతాల్లో రహదారులకు గండ్లు పడ్డాయి. పంటలు ముంపునకు గురయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచింది. పాచిపెంట మండలం గుమ్మడిగుడ్డివలసకు చెందిన కొర్రా మల్లేసు ఇంటి గోడ కూలిపోయింది. అతడు, భార్య తవుడమ్మ, 8 నెలల చిన్నారి పార్వతి గాయపడ్డారు. సాలూరు పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న తుఫాను బాధిత కుటుంబాలను మంత్రి సంధ్యారాణి పరామర్శించారు.
అనకాపల్లిలో..
తుఫాన్ ప్రభావంతో అనకాపల్లి జిల్లాలో భారీవర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. 2రోజుల్లో జిల్లాలో సగటు వర్షపాతం 156 మి.మీ. నమోదైంది. పరవాడ, రాంబిల్లి, అచ్యుతాపురం, ఎస్.రాయవరం, నక్కపల్లి మండలాల్లో 85 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించారు. 24 మండలాల్లో మంగళవారం రాత్రంతా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 2692.22 హెక్టార్ల వరి నీట మునిగింది.
విశాఖలో..
ఆర్నబ్ తుఫాన్ విశాఖ జిల్లాలో బీభత్సం సృష్టించింది. అనేక ప్రాంతాల్లో గెడ్డలు పొంగాయి. పంటలకు స్వల్పంగా నష్టం వాటిల్లింది. మంగళవారం ఉదయం ఎనిమిది నుంచి బుధవారం ఉదయం ఎనిమిది గంటల వరకు గోపాలపట్నం మండలంలో 323.2, మాధవధారలో 315, సింహాచలంలో 293.65, 16వ బెటాలియన్‌లో 281.45, పెందుర్తిలో 284 మి.మీ. వర్షపాతం నమోదైంది. నగరంలో పెనుగాలుల విధ్వంసానికి అనేకచోట్ల చెట్లు, కొన్నిచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. తీరం కోతకు గురైంది. ఫిషింగ్ హార్బర్లో కొన్ని బోట్లు మునిగిపోయాయి.
ఈ వార్తలనూ చదవండి:
ఆర్నబ్ తుఫాన్ బాధితులకు సీఎం చంద్రబాబు భారీ ఊరట