Share News

ఆర్నబ్‌ బీభత్సం.. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు అతలాకుతలం

ABN , Publish Date - Oct 29 , 2026 | 03:36 AM

కడలి హోరు.. 150 కిలోమీటర్ల వేగంతో పెనుగాలుల ఘోష.. ఈడ్చికొడుతున్న గాలులతో పైకప్పులు లేచిపోతుంటే, నిలువునా ఇళ్లు కూలిపోతాయేమోనన్న భయం.. బయట చూస్తే కుప్పకూలుతున్న వేలాది కొబ్బరి చెట్లు.. నిలువునా కూలిపోయిన విద్యుత్‌ స్తంభాలు..

ఆర్నబ్‌ బీభత్సం.. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు అతలాకుతలం

  • యానాం- నరసాపురం మధ్య తీరం దాటిన తుఫాన్‌

  • ఆ సమయంలో వర్షాల హోరు.. పెనుగాలుల బీభత్సం

  • గంటకు 150 కిలోమీటర్ల వేగంతో విలయ ఘోష

  • ‘విశాఖ’లో 30 సెం.మీ.కు పైగా వర్షం

  • గెడ్డలు ప్రమాదకరంగా పొంగుతుండటంతో వణుకుతున్న ఉత్తరాంధ్ర.. ఘాట్లు, రహదారులు బంద్‌

  • కోనసీమపై ప్రకృతి కత్తి.. నేలకూలిన 33 వేల కొబ్బరి చెట్లు

  • నిలువునా కూలిన 16 వేల విద్యుత్‌ స్తంభాలు

  • అంధకారంలో గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాలు

  • భయపెట్టిన కాకినాడ తీరం.. యాంకరేజ్‌ పోర్టులో

  • కర్ర ముక్కల్లా ఎగిరిపడిన 1200 టన్నులుండే బార్జిలు

  • చేతికి వచ్చే దశలోని వరి లక్షలాది ఎకరాల్లో నీటిమునక

  • 3.08 లక్షల హెక్టార్లు దెబ్బతిన్నట్టు ప్రాథమిక అంచనా

  • విద్యుదాఘాతం, చెట్లు, స్తంభాలు పడి 9 మంది మృతి

కడలి హోరు.. 150 కిలోమీటర్ల వేగంతో పెనుగాలుల ఘోష.. ఈడ్చికొడుతున్న గాలులతో పైకప్పులు లేచిపోతుంటే, నిలువునా ఇళ్లు కూలిపోతాయేమోనన్న భయం.. బయట చూస్తే కుప్పకూలుతున్న వేలాది కొబ్బరి చెట్లు.. నిలువునా కూలిపోయిన విద్యుత్‌ స్తంభాలు..కాకినాడ యాంకరేజ్‌ పోర్టులో కర్ర ముక్కల్లా ఎగిరిపడ్డ ఒక్కొక్కటి 1,200 టన్నుల బరువుండే బార్జిలు..పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సమీపంలో ‘ఆర్నబ్‌’ తీరం దాటుతూ, సృష్టించిన విలయ బీభత్స దృశ్యాలివీ. ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర తుఫాను ధాటికి చిగురుటాకులా వణికాయి. సర్కారు ముందస్తు అప్రమత్తత, రియల్‌టైమ్‌ పర్యవేక్షణ...ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గించింది. కానీ, అంచనాలకు అందనంతగా ఆస్తి, పంట నష్టాలు చోటుచేసుకున్నాయి.


(ఆంధ్రజ్యోతి-న్యూస్‌ నెట్‌వర్క్‌): కుండపోత వానలతో, రాకాసి గాలుల బీభత్సంతో రాష్ట్రాన్ని కకావికలం చేసిన అతి తీవ్ర తుఫాన్‌ ‘ఆర్నబ్‌’ బుధవారం యానాం- నరసాపురం మధ్య పల్లెపాలెం (వశిష్ఠ గోదావరి) వద్ద తీరం దాటింది. ఆ సమయంలో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలులతో శివమెత్తినట్టు భారీ వృక్షాలు ఊగి రహదారులపై పడ్డాయి. తుఫాను తీరం దాటే సమయంలో విశాఖలో 31 సెంటీమీటర్ల వర్షం పడింది.

ఎడతెరిపి లేని వానలతో వాగులు, గెడ్డలు పొంగి రహదారులను ముంచెత్తడంతో ఉత్తరాంధ్ర అతలాకుతలం అయింది. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడుమూరు సమీపంలోని పెద్దగెడ్డ పొంగి ప్రవహించడంతో, సుమారు 40 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విలయ ఘోషను వినిపిస్తూ.. ఉభయ గోదావరి జిల్లాలను ఈదురుగాలులు అతలాకుతలం చేశాయి. గాలుల ధాటికి 33 వేల కొబ్బరి చెట్లు మేకమేడల్లా కూలిపోయాయి. 16 వేల విద్యుత్‌ స్తంభాలు కూలిపోవడంతో ‘గోదావరి’ జిల్లాల్లోని చాలా ప్రాంతాలు అంధకారంలోకి వెళ్లిపోయాయి. ఇళ్లలో ఉన్న, పనుల మీద బయటకు వచ్చిన తొమ్మిది మంది విద్యుదాఘాతానికి, చెట్లు కూలి మరణించారు.

వరి పైరు భారీ వర్షాలు, పెను గాలులతో చాపలా నేలవాలింది. 3 లక్షలకు పైగా హెక్టార్లలో వరి పంట దెబ్బతిన్నట్టు అధికారులు ప్రాథమికంగా అంచనావేశారు. ఎక్కడికక్కడ రహదారులపై చెట్లు పడిపోవడంతో ఉత్తరాంధ్రలో రవాణా స్తంభించింది. రైల్వే ట్రాకులు దెబ్బతినడంతో పలు రైళ్లను రద్దు చేశారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బుధవారం 40కి పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి.


అన్నదాతకు అపార కష్టం..

ఆర్నబ్‌ ప్రభావంతో కురిసిన భారీవర్షాలతో అన్నదాతకు అపార నష్టం వాటిల్లింది. తుఫాను కారణంగా.. విజయనగరం జిల్లాలోని వాగులు, గెడ్డలు, నదులు పొంగిపొర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరి పంటలు నీట మునగడంతో పాటు ఈదురు గాలులకు నేలకొరిగాయి. 496 ఫీడర్లలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. భోగాపురం మండలం రావాడ వద్ద రోడ్డు కొట్టుకుపోయింది. విజయనగరంలోని అయ్యన్నపేట విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లోకి భారీగా వరద నీరు చేరింది. బొండపల్లి మండలం వెదురువాడ, కొవ్వాడపేట, బొండపల్లి, గొట్లాం గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. గరివిడి మండలంలో రేగటి, శివరాం, నడిపేనపేట తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. గజపతినగరం మండలంలో చంపావతి నది ఉధృతికి మర్రివలస వద్ద రాకపోకలు నిలిచిపోయి, 5 గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాజాం ప్రాంతంలో సారధిగెడ్డ, ఇతర వాగులు ఉధృతంగా ప్రవహించడంతో వరి పంటలు నేలకొరిగాయి. శ్రీకాకుళం జిల్లాలో గెడ్డలు, వాగులు పొంగిపొర్లడంతో వేలాది ఎకరాల్లో వరి, కూరగాయలు, ఉద్యాన పంటలు నీటమునిగాయి. ఉద్దానం ప్రాంతంలో కొబ్బరి చెట్లు విరిగిపోయాయి. పార్వతీపురం మన్యం ఏజెన్సీలో వాగులు, వంకలు ఉప్పొంగడంతో పంటలు ముంపునకు గురయ్యాయి. విశాఖ జిల్లాలో పంటలకు నష్టం వాటిల్లింది.


ప్రమాదకరంగా గెడ్డలు, వాగులు

ఆర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో అల్లూరి జిల్లాలో గెడ్డలు, వాగులు ప్రమాదకర రీతిలో ప్రవహిస్తున్నాయి. కొయ్యూరు మండలం చింతాలమ్మ ఘాట్‌లో కొండ చరియలు విరిగిపడ్డాయి. అనంతగిరి ఘాట్‌ రోడ్డులో కొండ వాలు నుంచి వర్షం నీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలు నిలిపివేశారు. అరకులోయ-విశాఖ ప్రధాన రహదారిలో అనంతగిరి మండలం బీసుపురం సమీపంలో రక్షణగోడ కూలిపోయింది.

విజయనగరం జిల్లా వేపాడ మండలంలో సోంపురం గెడ్డ పొంగడంతో అండర్‌ బ్రిడ్జి వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. శృంగవరపుకోట మండలం రేవళ్లపాలెం వద్ద బానాది చెరువు పొంగడంతో అవతలి వైపు చిక్కుకున్నవారిని ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది రక్షించారు. పూసపాటిరేగ మండలంలో కనిమెళ్ల వద్ద కాజ్‌వేపై నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిపివేశారు. రాజాం ప్రాంతంలో సారధిగెడ్డ, ఇతర వాగులు ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లక్కవరపుకోట మండలంలో చెరువులు పొంగిపొర్లగా, నెల్లిమర్ల వద్ద చంపావతి నది ఉధృతికి వంతెనపైకి వరదనీరు చేరింది. దత్తిరాజేరు మండలంలో వాగులు పొంగడంతో పలు మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఎన్‌హెచ్‌-16పై రామవరప్పాడు నుంచి ఎనికేపాడు వరకు మోకాళ్ల లోతున వర్షం నీరు నిలిచింది.

ఈ వార్తలనూ చదవండి:

పోటాపోటీ

ఆర్నబ్ తుఫాన్ బాధితులకు సీఎం చంద్రబాబు భారీ ఊరట

Updated Date - Oct 29 , 2026 | 05:52 AM