ఒడిశా దిశగా తుఫాన్
ABN , Publish Date - Nov 19 , 2026 | 03:24 AM
తీవ్ర తుఫాన్ ‘అక్వాన్’ దిశ మార్చుకుంది. కాకినాడ వైపు కాకుండా ఒడిశా దిశగా పయనిస్తోంది. ఇది ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు.
రేపు ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోతీరం దాటే అవకాశం
తీవ్ర వాయుగుండంగా బలహీనపడి గాలుల వేగం తగ్గే చాన్స్
నేటి నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు
ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్.. పోర్టుల్లో రెండో నంబరు హెచ్చరిక
విశాఖపట్నం, అమరావతి, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): తీవ్ర తుఫాన్ ‘అక్వాన్’ దిశ మార్చుకుంది. కాకినాడ వైపు కాకుండా ఒడిశా దిశగా పయనిస్తోంది. ఇది ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం గోపాలపూర్ పరిసరాలు, ఒడిశాలోని కొన్ని ప్రాంతాలు, ఇంకా దానికి ఆనుకుని ఉన్న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం, బారువపై ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. తీరం దాటే సమయంలో తీవ్ర వాయుగుండంగా/వాయుగుండంగా బలహీనపడుతుందని, దీంతో గాలుల వేగం 60 నుంచి 70 కి.మీ., అప్పుడప్పుడు 80 కి.మీ.కు పరిమితం కానుందని భారత వాతావరణ శాఖ తుఫాన్ డివిజన్ పేర్కొంది. అక్వాన్ బలపడేందుకు సముద్రంలో వాతావరణం అనుకూలంగా లేదు.
ఇంకా అటు అండమాన్, ఇటు అరేబియా సముద్రంలో ఉన్న అధిక పీడనాల ప్రభావంతో తుఫాన్ దిశ మార్చుకోవడంతోపాటు వేగం తగ్గిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అక్వాన్ బుధవారం సాయంత్రానికి నరసాపురానికి ఆగ్నేయంగా 480 కి.మీ., కళింగపట్నానికి దక్షి ణ ఆగ్నేయంగా 520 కి.మీ., గోపాలపూర్‌కు దక్షిణంగా 510 కి.మీ. దూరంలో ఉంది. ఇది శుక్రవారం ఉదయానికి విశాఖపట్నం, పూరి మధ్య తీరం దాటుతుందని ఐఎండీ పేర్కొంది.
అయితే, తుఫాన్ గమనం పరిశీలిస్తే గోపాలపూర్ పరిసరాల్లో తీవ్ర వాయుగుండం/వాయుగుండంగా తీరం దాటుతుందని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. అక్వాన్ దిశ మార్చుకోవడంతో కోస్తాంధ్రలో ము ఖ్యంగా మధ్య కోస్తాకు ముప్పు తప్పింది. తాజాగా ఉత్తరాంధ్రకు ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా శ్రీకాకుళం నుం చి కాకినాడ వరకు గురు, శుక్రవారాలు అక్కడక్కడ కుంభవృష్టి, అనేకచోట్ల ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఉభయ గోదావరి, ఏలూరు, కోనసీమ, కృష్ణా, బాపట్ల, గుం టూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
అన్ని పోర్టుల్లో రెండో నంబరు భద్రతా సూచిక ఎగురవేశారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. కాగా అక్వాన్ తీరం దాటే సమయంలో భూఉపరితలం నుంచి పొడిగాలులు వీస్తాయని, దీంతో తుఫాన్ బలహీనపడుతుందని వాతావరణ నిపుణుడు ఆర్.మురళీకృష్ణ చెప్పారు.
శ్రీకాకుళం జిల్లాపై ప్రభావం..
తీవ్ర తుఫాన్ గురువారం సాయంత్రం కళింగపట్నానికి చేరువగా వచ్చే అవకాశం ఉంది. ఆ సమయానికి తీవ్ర తుఫాన్‌గానే కొనసాగనున్నందున గాలుల తీవ్రత పెరగనుంది. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు తీరంలో గాలులు ఎక్కువగా ఉంటాయి. గురువారం రాత్రి నుంచి శ్రీకాకుళం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో వర్షంతోపాటు గాలులు ఎక్కువగా ఉంటాయని, ప్రభావం భారీగా ఉంటుం దని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు.
నేడు వర్షాలు
అక్వాన్ ప్రభావంతో గురువారం ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షం, అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ, ఆర్టీజీఎస్ శాఖ తెలిపింది. శుక్రవారం తుఫాను తీరాన్ని తాకిన తర్వాత చాలా ప్రాంతాల్లో చెప్పుకోదగ్గ వర్షపాతం ఉండకపోవచ్చంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, గోదావరి జిల్లాల ప్రజలు రాబోయే 48 గంటలపాటు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్‌కు లోకేశ్ కౌంటర్
పంజాబ్‌లో లారీ డ్రైవర్‌కు రూ.12 కోట్ల జాక్‌పాట్