ఉత్తర కోస్తా దిశగా తుఫాన్
ABN , Publish Date - Nov 15 , 2026 | 03:38 AM
తుఫాను ఉత్తర కోస్తా దిశగా దూసుకు వస్తోంది. ఈ నెల 20న తీరం దాటే అవకాశం ఉంది. ఇందుకు తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోవాలని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
‘అక్వాన్’గా నామకరణం
20న తీరం దాటే అవకాశం
18 నుంచి మూడు రోజులు వర్షాలు
మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక
విశాఖపట్నం, అమరావతి, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): తుఫాను ఉత్తర కోస్తా దిశగా దూసుకు వస్తోంది. ఈ నెల 20న తీరం దాటే అవకాశం ఉంది. ఇందుకు తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోవాలని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం అదే ప్రాంతంలో శనివారం ఉదయానికి తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది వాయవ్యంగా పయనించి ఆదివారం నాటికి వాయుగుండంగా మారనున్నది. ఆ తర్వాత ఉత్తర వాయవ్యంగా పయనించి ఈ నెల 16వ తేదీ సాయంత్రానికి తుఫానుగా బలపడి బంగాళాఖాతంలోకి ప్రవేశించనున్నది. దీనికి ఇరాన్ దేశం సూచించిన ‘అక్వాన్’ అని పేరు పెట్టనున్నారు.
ఇది ఉత్తర వాయువ్యంగా పయనించి 18వ తేదీ ఉదయానికి తీవ్ర తుఫాన్‌గా బలపడి రెండు రోజులపాటు సముద్రంలోనే కొనసాగుతుంది. ఆ సమయంలో భూ ఉపరితలం నుంచి చలిగాలులు వీచే అవకాశం ఉన్నందున సముద్రంలో కొంత బలహీనపడి తుఫాన్‌గా లేదా వాయుగుండం/తీవ్ర వాయుగుండంగా మారి 20వ తేదీ ఉదయం ఉత్తర కోస్తాలో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. సముద్రంలో కొనసాగిన సమయంలో గాలులు 100 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని, తీరం దాటే సమయంలో గాలుల వేగం కొంతవరకు తగ్గుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. కాగా, ఆదివారం నాటికి వాయుగుండంగా బలపడిన తరువాత కోస్తాలో తీరం వెంబడి గాలుల వేగం పెరుగుతుంది.
అందువల్ల మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది. ఈ నెల 18 నుంచి 20 వరకు కోస్తాలో విస్తారంగా, ఉత్తర కోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయి. ఈ నెల 19న ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తుఫాను హెచ్చరిక కేంద్రం తెలిపింది. వాతావరణ పరిస్థితుల ప్రభావంతో సముద్రంలో తీవ్ర తుఫాను కొంతవరకు బలహీనపడినా ఉత్తర కోస్తాలో గాలులు వీస్తాయని, వర్షాలు కురుస్తాయని తెలిపారు.
కాగా నవంబరు నెలలో తుఫాన్లు ఎక్కువగా దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడుల్లో తీరం దాటుతాయి. నవంబరు రెండో వారం తరువాత ఉత్తర కోస్తాలో తుఫాన్లు తీరం దాటడం, తీరం దిశగా రావడం 125 ఏళ్లలో ఒక్కసారే జరిగింది. 1998 నవంబరు 15న ప్రస్తుత అనకాపల్లి జిల్లా పూడిమడక ప్రాంతంలో తుఫాన్ తీరం దాటిందని వాతావరణ అధికారి ఒకరు తెలిపారు.
ఆందోళనలో రైతులు
ఇప్పటికే రెండు తుఫాన్లతో రూ.కోట్ల విలువైన పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు మరో తుఫాను వార్తలతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కృష్ణా, గోదావరి, వంశధార, పెన్నా డెల్టాల్లో వరి కోతలు సాగుతుండగా, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పత్తి తీతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. చేతికొచ్చిన వరి, పత్తి, ఇతర పంటలపై తుఫాన్లు ప్రభావం చూపుతుండటంతో రైతులు కుదేలవుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
జాతీయ బాలల దినోత్సవం.. చిన్నారులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు
కార్పొరేషన్‌పై కూటమి జెండా ఎగరేద్దాం