Share News

అత్యవసరమైతే తప్ప.. బయటకు రావొద్దు

ABN , Publish Date - Nov 18 , 2026 | 04:09 AM

అతితీవ్ర తుఫాను ‘అక్వాన్‌‘ దూసుకొస్తున్న నేపథ్యంలో కోస్తాంధ్ర తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

అత్యవసరమైతే తప్ప.. బయటకు రావొద్దు

  • సురక్షిత ప్రదేశాల్లో తలదాచుకోవాలి

  • సహాయం కోసం 112, 1070, 18004250101 నంబర్లకు కాల్‌ చేయండి

  • విపత్తుల నిర్వహణ సంస్థ

అమరావతి, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): అతితీవ్ర తుఫాను ‘అక్వాన్‌‘ దూసుకొస్తున్న నేపథ్యంలో కోస్తాంధ్ర తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. తుఫాను ప్రభావంతో గురు, శుక్రవారాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు, కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. తుఫాను శుక్రవారం మధ్యాహ్నం నెల్లూరు-విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని, ఆ సమయంలో గంటకు 120-135, గరిష్ఠంగా 145కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అందువల్ల ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని చెప్పింది.

మత్స్యకారులు శనివారం వరకు సముద్రంలో చేపల వేటకి వెళ్లొద్దని, పడవలను తాళ్లతో కట్టి, ఒడ్డున ఉంచాలని తెలిపింది. అత్యవసరమైతే తప్ప.. బయటకు రావొద్దని, వరద ముప్పు ఉన్న లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేసి, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. విద్యుత్‌ స్తంభాలు, ఎత్తైన స్తంభాలు, హోర్డింగ్‌ల వద్ద ఉండొద్దని, గ్యాస్‌, ఎలక్ట్రికల్ మెయిన్‌ స్విచ్ఛాఫ్‌ చేసుకోవాలని, తెగిపడిన విద్యుత్‌ తీగలు, స్తంభాలను తాకొద్దని హెచ్చరించింది.

తుఫానుకు సంబంధించి ప్రభుత్వ అధికారిక సమాచారాన్ని గమనించాలని తెలిపింది. ఏదైనా సమస్య ఉత్పన్నమైతే మనమిత్ర వాట్సాప్‌ నంబరు 9552300009 ద్వారా తెలియజేయాలని, అత్యవసర సహాయం కోసం 112, 1070, 18004250101 టోల్‌ఫ్రీ నంబర్లను సంప్రదించాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌జైన్‌ కోరారు. అత్యవసర సహాయక చర్యల కోసం 13 ఎన్డీఆర్‌ఎఫ్‌, 11 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.


బాపట్ల, పశ్చిమగోదావరికి అదనపు నిధులు

అర్నాబ్‌, మురసు తుఫాన్ల సమయంలో సహాయ కార్యక్రమాలు నిర్వహించినందుకు పశ్చిమగోదావరి, బాపట్ల జిల్లాలకు ప్రభుత్వం అదనపు నిధులు మంజూరు చేసింది. పశ్చిమగోదావరి జిల్లాకు రూ.5కోట్లు, బాపట్ల జిల్లాకు రూ.2కోట్లు అదనంగా ఇచ్చింది. ఈ అదనపు నిధుల వ్యయంపై ఆయా జిల్లా కలెక్టర్లకు అనుమతిస్తూ, మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ వార్తలనూ చదవండి:

పరీక్షల పరేషాన్‌

అక్వాన్ తుపానుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

Updated Date - Nov 18 , 2026 | 04:13 AM