కరువు రైతుపై సైబర్ పంజా!
ABN , Publish Date - Nov 19 , 2026 | 12:55 AM
దీనస్థితిలో ఉన్న రైతులపై సైబర్ నేరగాళ్లు పంజా విసిరారు. ఇటీవల కేంద్రం పీఎం కిసాన్, రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ సొమ్ము కాజేసి వారిని మరిన్ని కష్టాల్లోకి నెట్టారు.
అన్నదాత ఆధార్‌తో మహారాష్ట్రలో బ్యాంకు ఖాతాలు
పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ సొమ్ము స్వాహా
అనంతపురం జిల్లాలో వెలుగులోకి మోసాలు
యాడికి, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో చినుకు జాడలేక సాగు చేసిన పంటలు నిలువునా ఎండిపోయాయి. రైతులు సర్వం నష్టపోయారు. అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఇలాంటి దీనస్థితిలో ఉన్న రైతులపై సైబర్ నేరగాళ్లు పంజా విసిరారు. ఇటీవల కేంద్రం పీఎం కిసాన్, రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ సొమ్ము కాజేసి వారిని మరిన్ని కష్టాల్లోకి నెట్టారు. పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ కింద ఒక్కో రైతు ఖాతాలో రూ.7 వేలు జమ అయ్యాయి. ఆ డబ్బులు డ్రా చేసుకుందామని బ్యాంకుకు వెళ్లిన రైతులకు ఈ షాకింగ్ విషయం తెలిసింది.
తమ ఖాతాల్లో డబ్బులు ఎందుకు జమకాలేదని బ్యాంకు అధికారులను అడిగితే.. ‘మీ పేరుతో మహారాష్ట్రలో బ్యాంకు ఖాతా ఉంది. అక్కడే సొమ్ము విత్‌డ్రా చేసుకున్నారు’ అని సమాధానమిచ్చారు. దీంతో రైతులు విస్తుపోయారు. తమ పేరుతో తమకే తెలియకుండా, అది కూడా మహారాష్ట్రలో బ్యాంకు ఖాతాలు తెరవడం ఏమిటని వాపోతున్నారు. ఈ వ్యవహారంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అనంతపురం జిల్లా యాడికి మండలంలోని యాడికి, టి కొత్తపల్లి, కొట్టాలపల్లి, కోనుప్పలపాడు గ్రామాల రైతులు సైబర్ మోసగాళ్ల చేతిలో నష్టపోయారు. అన్నదాత సుఖీభవ సొమ్ము జమ కాకపోవడంతో రైతులు.. కార్యాలయాల చుట్టూ తిరిగారు. బ్యాంకులో విచారించాలని వ్యవసాయశాఖ అధికారులు సూచించారు. బ్యాంకుకెళ్లి ఆరా తీయగా ముంబై, మహారాష్ట్ర అడ్ర్‌సతో ఉన్న ఖాతాలో డబ్బు జమ అయిందని అధికారులు తెలిపారు. టి కొత్తపల్లికి, కొట్టాలపల్లి, యాడికి, చందనకు చెందిన రైతుల సొమ్మును సైబర్ నేరగాళ్లు దోచేశారు. యాడికి మండలంలోనే 100 మందికిపైగా రైతుల సొమ్మును లూటీ చేసినట్టు తెలిసింది.
నా ఆధార్‌పై ముంబైలో బ్యాంకు ఖాతా: రామకృష్ణ
తన ఆధార్ కార్డుతో గుర్తుతెలియని వ్యక్తులు ముంబై అడ్ర్‌సతో బ్యాంకు ఖాతా తెరిచారని యాడికి మండలం టి కొత్తపల్లికి చెందిన రైతు రామకృష్ణ తెలిపారు. పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ సొమ్ము ఎందుకు జమకాలేదని ఆరాతీస్తే ఈ విషయం తెలిసిందన్నారు. దీనిపై సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశానని, సంక్షేమ పథకాల సొమ్ము కాజేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ వార్తలనూ చదవండి:
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్‌కు లోకేశ్ కౌంటర్
పంజాబ్‌లో లారీ డ్రైవర్‌కు రూ.12 కోట్ల జాక్‌పాట్