Share News

ఏపీ అభ్యంతరాలను..సీరియ్‌సగా తీసుకున్నాం!

ABN , Publish Date - Sep 21 , 2026 | 03:39 AM

గోదావరి జలాల నిల్వలకు సంబంధించి 2023లో తాను వెల్లడించిన లెక్కలపై ఏపీ వెలిబుచ్చిన అభ్యంతరాలను సీరియస్‌గా పరిగణిస్తున్నామని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) తెలిపింది. రెండు రాష్ట్రాల వద్ద బేసిన్లవారీగా ఉన్న గోదావరి, కృష్ణా జలాల గణాంకాలను నెలాఖరులోగా తమకు అందించాలని రెండు తెలుగు రాష్ట్రాలనూ ఆదేశించింది.

ఏపీ అభ్యంతరాలను..సీరియ్‌సగా తీసుకున్నాం!

  • 2023నాటి గోదావరి లెక్కలపైకేంద్ర జలసంఘం వెల్లడి

  • నెలాఖరులోగా బేసిన్లవారీగా తాజా గణాంకాలు సమర్పించండి

  • రెండు తెలుగు రాష్ట్రాలకు ఆదేశం

అమరావతి, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): గోదావరి జలాల నిల్వలకు సంబంధించి 2023లో తాను వెల్లడించిన లెక్కలపై ఏపీ వెలిబుచ్చిన అభ్యంతరాలను సీరియస్‌గా పరిగణిస్తున్నామని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) తెలిపింది. రెండు రాష్ట్రాల వద్ద బేసిన్లవారీగా ఉన్న గోదావరి, కృష్ణా జలాల గణాంకాలను నెలాఖరులోగా తమకు అందించాలని రెండు తెలుగు రాష్ట్రాలనూ ఆదేశించింది. ఇదే సమయంలో గోదావరి-కావేరి అనుసంధాన పథకాన్ని ఏపీ-తెలంగాణ మధ్య ఏకాభిప్రాయంతో చేపట్టాలని స్పష్టం చేసింది. రెండు రాష్ట్రాల నీటి తగాదాలపై కేంద్ర జలశక్తి శాఖ నియమించిన జల వివాదాల సమన్వయ కమిటీ.. జలసంఘం చైర్మన్‌ కూడా అయిన అనుమప్‌ ప్రసాద్‌ నేతృత్వంలో ఈ నెల 7న ఢిల్లీలో సమావేశమైంది. దాని ‘మినిట్స్‌’ను జలసంఘం తాజాగా రెండు రాష్ట్రాలకూ పంపింది. గోదావరి, కృష్ణా నదులపై తెలంగాణ నిర్మించిన పలు ప్రాజెక్టులకు నీటి లెక్కలు తేలకుండా.. రాష్ట్ర విభజన చట్టానికి, బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ ఆదేశాలు, మార్గదర్శకాలకు భిన్నంగా తెలంగాణ ప్రాజెక్టులకు సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) ఎలా ఆమోదం తెలుపుతుందని జల సంఘాన్ని ఏపీ నిలదీసింది.

ఆ ఆమోదాలను పునఃసమీక్షించాలని డిమాండ్‌ చేసింది. గతంలో జలసంఘం రాష్ట్రాలకు ఆదేశాలు పంపడం తప్ప.. ఏ రాష్ట్రమూ దానిని నిలదీసిన దాఖలాల్లేవు. అయితే ఏపీ గట్టిగా నిలదీయడంతో జలసంఘం బిత్తరపోయింది. సహజంగా రాష్ట్రాల వాదనలను కొట్టిపారేస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తూ వచ్చిన సంస్థ ఇప్పుడు ఏపీకి సంజాయిషీ ఇవ్వాల్సి వచ్చింది. రాష్ట్ర అభ్యంతరాలను సీరియ్‌సగానే పరిగణనలోకి తీసుకున్నామని ‘మినిట్స్‌’లో పేర్కొంది. కృష్ణా నదిపై తెలంగాణ నిర్మించిన పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలపైనా అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని.. శ్రీశైలం నుంచి తెలంగాణ అడ్డగోలుగా అక్రమంగా విద్యుదుత్పత్తికి నీళ్లు తోడేస్తుండడాన్ని కూడా జలవివాదాల సమన్వయ కమిటీ ముందు ఏపీ ప్రస్తావించింది.


ఈ నేపథ్యంలోనే శ్రీశైలం డ్యాం నీటిలో రెండు రాష్ట్రాల వాటాను కృష్ణా బోర్డు తేల్చాలని జలసంఘం ఆదేశించింది. ఏపీ అభ్యంతరాలన్నిటిపైనా సమీక్షకు సీడబ్ల్యూసీ సిద్ధం కావడం.. సాంకేతికంగా, నైతికంగా తమకు విజయమేనని రాష్ట్ర జలవనరుల శాఖ భావిస్తోంది.

ఈ వార్తలనూ చదవండి..

పదే పదే కబ్జా

భారీ వర్షం

Updated Date - Sep 21 , 2026 | 03:39 AM