గోదావరి జలాల లభ్యత నివేదికపై అభ్యంతరాలను చర్చించవచ్చు
ABN , Publish Date - Nov 06 , 2026 | 06:01 AM
గోదావరి నదీ జలాల లభ్యత విషయంలో సీడబ్ల్యూసీ-2023 నివేదికపై ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో సీడబ్ల్యూసీ స్పందించింది. కేంద్ర జల సంఘం చైర్మన్ అనుమతితో ఆ అభ్యంతరాలపై చర్చించవచ్చని..
ఏపీ, తెలంగాణకు సీడబ్ల్యూసీ సభ్య కార్యదర్శి లేఖ
అమరావతి, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): గోదావరి నదీ జలాల లభ్యత విషయంలో సీడబ్ల్యూసీ-2023 నివేదికపై ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో సీడబ్ల్యూసీ స్పందించింది. కేంద్ర జల సంఘం చైర్మన్ అనుమతితో ఆ అభ్యంతరాలపై చర్చించవచ్చని సీడబ్ల్యూసీ సభ్య కార్యదర్శి, సీఏవో రాకేశ్ కుమార్ మంగళవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు లేఖ రాశారు. గోదావరి నదీ జలాల లభ్యతపై ఈ ఏడాది సెప్టెంబరు 17న ఢిల్లీలో సీడబ్ల్యూసీ చైర్మన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో విడుదల చేసిన ఆ అధ్యయన నివేదిక ఊహాజనితంగా ఉందంటూ ఏపీ తప్పుబట్టింది. ఆ అధ్యయనంలో వాస్తవాలేవీ లేవని పేర్కొంది.
గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో జలాల లభ్యత లేకున్నా తెలంగాణ చేపట్టాలనుకున్న ప్రాజెక్టు లకు ఏకపక్షంగా ఆమోదం తెలపడాన్ని ప్రశ్నించింది. అలాగే గోదావరిపై తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులకు సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) ఆమోదం తెలపడాన్ని వ్యతిరేకించింది. ట్రైబ్యునల్ తీర్పులకు భిన్నంగా తెలంగాణ ప్రాజెక్టులకు సాంకేతికామోదం ఎలా తెలుపుతారంటూ నిలదీసింది. ఆ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరింది. ఏపీ వాదనలతో గోదావరి జలాల లభ్యత, టీఏసీ ఆమోదంపై పునఃసమీక్ష చేస్తామని సీడబ్ల్యూసీ పేర్కొంది. అభ్యంతరాలను చైర్మన్ అనుమతితో కేంద్ర జల సంఘానికి వివరించవచ్చని లేఖలో ఏపీ, తెలంగాణకు రాకేశ్ కుమార్ చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
అభివృద్ధి చేయలేదని.. ఎన్నికల బహిష్కరణ