ధర ఉన్నా..దిగుబడి లేదు
ABN , Publish Date - Nov 24 , 2026 | 02:59 AM
రాష్ట్రంలో పత్తి ధర ఆశాజనకంగా ఉన్నా, సరైన దిగుబడిలేక రైతులకు నిరాశే మిగులుతోంది. ఓ వైపు ఎల్‌నినో.. మరోవైపు వరుస తుఫాన్లతో ఈ ఏడాది వారి ఆశలు అడియాశలయ్యాయి.
ఆశ, నిరాశల్లో పత్తి రైతులు.. ఆదోని మార్కెట్లో నాణ్యమైన పత్తి క్వింటా రూ. 9,600.. మద్దతు ధర కన్నా సుమారు వెయ్యి అధికం
వర్షాభావం, తుఫాన్లతో తగ్గిన ఉత్పత్తి.. 10-12 క్వింటాళ్లు రావాల్సిన చోట 6-8 క్వింటాళ్లకు మాత్రమే పరిమితం.. తగ్గిన దిగుబడితో నష్టం
రాష్ట్రంలో పత్తి ధర ఆశాజనకంగా ఉన్నా, సరైన దిగుబడిలేక రైతులకు నిరాశే మిగులుతోంది. ఓ వైపు ఎల్‌నినో.. మరోవైపు వరుస తుఫాన్లతో ఈ ఏడాది వారి ఆశలు అడియాశలయ్యాయి. రాయలసీమలో తీవ్ర వర్షాభావంతో పత్తి సాగు కష్టంగా మారగా, కోస్తాంధ్రలో అర్నబ్, మురసు తుఫాన్ల కారణంగా పంట చేతికి రాకుండా పోయింది. అసలే ఈ ఏడాది సాగు విస్తీర్ణం తగ్గింది.
ప్రతికూల వాతావరణంతో ఉత్పత్తి కూడా తగ్గింది. ఎకరానికి కనీసం 10-12 క్వింటాళ్ల పత్తి రావాల్సి ఉండగా, 6-8 క్వింటాళ్లు కూడా రాని పరిస్థితి నెలకొంది. ఈ దఫా ధర బాగున్నా.. దిగుబడి తగ్గడంతో రైతులు అనూహ్యంగా నష్టపోతున్నారు. అయితే ఖరీఫ్-2026-27 పత్తి క్వింటా కనీస మద్దతు ధరను రూ.8,267- 8,667గా కేంద్రం ప్రకటించింది. ఈసారి ఉత్పత్తి తగ్గడంతో పత్తికి డిమాండ్ వచ్చింది. ప్రస్తుతం ఆదోని మార్కెట్లో నాణ్యమైన పత్తి క్వింటా రూ.9,400-9,600 దాకా పలుకుతోంది. గ్రామాల్లోనూ మద్దతు ధర కంటే రూ.5-6 వందలు తక్కువ చెల్లించి, స్థానిక వ్యాపారులు కొంటున్నారు.
సీసీఐ కేంద్రాలకు స్పందన లేదు
వాస్తవంగా పత్తి సాగుకు ఎకరానికి రూ. 80 వేలు దాకా పెట్టుబడి పెట్టాల్సి వస్తోందని రైతులు చెప్తున్నారు. కౌలురైతులకు రూ. లక్షకు పైగా ఖర్చు అవుతోంది. ఈ ఏడాది ఖరీ్‌ఫలో రాష్ట్రవ్యాప్తంగా 12.87 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అంచనా ఉండగా, 11.80 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈ సీజన్లో 10లక్షల టన్నుల పత్తి ఉత్పత్తి అంచనా వేసినట్లు మార్కెటింగ్‌శాఖ అధికారులు చెప్తున్నారు. కానీ దిగుబడి గణనీయంగా తగ్గింది. ఉత్పత్తి తగ్గి, మద్దతు ధరకు దగ్గరగానే స్థానికంగా రైతులు అమ్ముకోవడంతో సీసీఐ కేంద్రాలకు స్పందన కరువైంది. ఏటా మార్కెటింగ్‌శాఖ ఎంపిక చేసిన మార్కెట్ యార్డులు, జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోలు చేసే సీసీఐ.. ఇప్పటి వరకు తమ కేంద్రాల్లో బోణి కొట్టలేదు.
ఈ వార్తలనూ చదవండి: