‘కంప్యూటర్స్’ క్రేజ్!
ABN , Publish Date - Oct 03 , 2026 | 05:27 AM
ప్రస్తుత డిజిటల్ యుగంలో కంప్యూటర్ కోర్సుల హవా నడుస్తోంది. మార్కెట్ డిమాండ్, ఉపాధి, నై పుణ్య అవసరాల దృష్ట్యా విద్యార్థులు వాటిపైనే ఎక్కువ మక్కువ చూపుతున్నారు.
బీటెక్‌లో ఇప్పటికే ‘సీఎస్ఈ’ హవా
సాధారణ డిగ్రీలోనూ ఆ కోర్సులకే డిమాండ్
బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్‌కే ఎక్కువ మంది ఓటు
ఆ రెండింటిలోనే 44 శాతం చేరికలు
బీసీఏ, బీఎస్సీ-ఏఐ, బీసీఏ-ఏఐ, డేటా సైన్స్ వంటి ఇతర కంప్యూటర్ కోర్సులపైనా ఆసక్తి
ఈ ఏడాది 1.62 లక్షల డిగ్రీ అడ్మిషన్లలో ఆయా కోర్సుల్లోనే 97 వేల మంది చేరిక
(అమరావతి-ఆంధ్రజ్యోతి): ప్రస్తుత డిజిటల్ యుగంలో కంప్యూటర్ కోర్సుల హవా నడుస్తోంది. మార్కెట్ డిమాండ్, ఉపాధి, నై పుణ్య అవసరాల దృష్ట్యా విద్యార్థులు వాటిపైనే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. బీటెక్‌లో చేరితే కంప్యూటర్ సైన్స్.. డిగ్రీలో అయితే బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్... ఇలా ఎక్కడైనా ‘కంప్యూటర్స్’కే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంజనీరింగ్ విద్యలో ఇప్పటికే సీఎస్ఈ హవా నడుస్తుండగా.. సాధారణ డిగ్రీలోనూ అదే ట్రెండ్ కనిపిస్తోంది. ఈ విద్యా సంవత్సరం (2026-27)లో 1,62,690 మంది విద్యార్థులు డిగ్రీలో చేరితే.. వారిలో 96,859 మంది కంప్యూటర్స్ ఉండే కోర్సులనే ఎంపిక చేసుకున్నారు. బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్‌లో 38,612 మంది, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్‌లో 33,487, బీసీఏలో 8869, బీఎస్సీ-ఏఐలో 5630, బీఎస్సీలో డేటా సైన్స్‌లో 3338, బీసీఏ-ఏఐలో 3163, బీసీఏ డేటా సైన్స్‌లో 1591 మంది చేరారు.
బీబీఏ బిజినెస్ అనలటిక్స్, బీసీఏ ఏ ఐ అండ్ డేటా సైన్స్, బీఎస్సీ క్వాంటమ్ టెక్నాలజీస్, బీఎస్సీ ఏఐఎంఎల్, బీఎస్సీ సైబర్ సెక్యూరిటీ, బీఎస్సీ ఐటీ, బీసీఏ బిగ్‌డేటా ఇలా ఇతర కంప్యూటర్స్ కోర్సుల్లోనూ విద్యార్థులు చేరారు. రాష్ట్రంలో 1210 డిగ్రీ కాలేజీలు ఉండగా ఈ ఏడాది వాటిల్లో 36 రకాల కంప్యూటర్స్ కోర్సులు అందుబాటులో ఉంటే 28 కోర్సుల్లో విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. మొత్తం అడ్మిషన్లు పొందిన వారిలో 43 శాతం మంది కేవలం బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లోనే ఉన్నారు. మొత్తంగా చూస్తే 59.53 శాతం మంది విద్యార్థులు కంప్యూటర్స్ సంబంధిత కోర్సులను ఎంపిక చేసుకున్నారు. ఇక బీఎస్సీ కెమిస్ర్టీలో 10,876 మంది చేరారు. ఈ ఒక్క గ్రూపు తప్ప 10 వేల మంది దాటిన కంప్యూటర్స్‌యేతర గ్రూప్ మరొకటి లేదు. డిగ్రీలో మొత్తం 201 రకాల కోర్సులు ఉంటే 28 కోర్సుల్లో ఒక్కరూ చేరలేదు. 45 కోర్సుల్లో అయితే సింగిల్ డిజిట్ అడ్మిషన్లు నమోదయ్యాయి. బీఏ కోర్సుల్లో చాలా తక్కువ మంది చేరుతున్నారు.
566 మందే తెలుగు మీడియం
డిగ్రీ అడ్మిషన్లలో 99.5 శాతం ఇంగ్లిష్ మీడియం కో ర్సులే ఉన్నాయి. 1,61,922 మంది ఇంగ్లిష్ మీడియం ఎంపిక చేసుకున్నారు. కేవలం 566 మంది తెలుగు మీడియంలో చేరారు. 181 మంది ఉర్దూ మీడియం, 14 మంది హిందీ మీడియం, ఏడుగురు ఒడియా మీడియం ఎంపిక చేసుకున్నారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీ పరిధిలో 29,702, ఏయూలో 29,256, ఎస్వీయూలో 16,802, ఏఎన్‌యూలో 14,257, ఎస్‌కేయూలో 12,883, కృష్ణా వర్సిటీలో 11,234 మంది అడ్మిషన్లు పొందా రు. మిగిలిన యూనివర్సిటీల్లో అడ్మిషన్ల సంఖ్య పది వేల లోపే ఉంది.
బీటెక్‌లో కోరుకున్న సీటు రాకపోతే..
ప్రస్తుతం ఇంజనీరింగ్‌లో చేరే విద్యార్థుల మొదటి ప్రాధాన్యంగా సీఎస్ఈ ఉంటోంది. దీనిలోనే అనేక ఉప బ్రాంచ్‌లు ఉండటంతో ఏదో కోర్సులో చేరాలనే ఆసక్తితో ఉంటున్నారు. సాఫ్ట్‌వేర్‌లో స్థిరపడటమే లక్ష్యంగా కంప్యూటర్ సైన్స్ కోర్సులను ఎంపిక చేసుకుంటున్నారు. బీటెక్‌లో కోరుకున్న విధంగా సీఎ్‌సఈ అడ్మిషన్ లభించని వారు డిగ్రీలోనూ కంప్యూటర్స్ కోర్సుల వైపు చూస్తున్నారు. అందులోనూ రాష్ట్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా డిగ్రీలోనూ నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులు అందుబాటులోకి తెచ్చింది. ఇది దాదాపుగా బీటెక్‌తో సమానం అనే ఆలోచనతో విద్యార్థులు ఉన్నారు. అందులోనూ పలు ప్రైవేటు యూనివర్సిటీలు, ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలు కూడా డిగ్రీ కోర్సులను అందిస్తున్నాయి.
ఈ ఏడాది మిగిలిన సీట్లు 2,89,119
సాధారణ డిగ్రీ కోర్సులకు ఆదరణ తగ్గిపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్సిటీల పరిధిలో 4,51,809 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అందులో 3,40,282 కన్వీనర్ కోటా సీట్లు ఉన్నాయి. అయితే మొత్తంగా 1,62,690 సీట్లు (36 శాతం) మాత్రమే భర్తీ అయ్యాయి. 2,89,119 సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి. సగటున ఒక్కో కాలేజీలో 134 మంది మాత్రమే చేరుతున్నారు. పాఠశాలల అడ్మిషన్లతో పోల్చిచూసినా ఇది చాలా తక్కువ. ఇక డిగ్రీ కోర్సుల్లో మేనేజ్‌మెంట్ కోటాలో చేరేవారు అస్సలు ఉండట్లేదు. ప్రైవేటు కాలేజీల్లో 33.5 శాతం, ప్రభుత్వ కాలేజీల్లో 51.6 శాతం, ఎయిడెడ్ కాలేజీల్లో 32.8 శాతం, ప్రైవేటు యూనివర్సిటీల్లో 18.3 శాతం, యూనివర్సిటీ కాలేజీల్లో 54 శాతం సీట్లు భర్తీ అయ్యాయి.
ఈ వార్తలనూ చదవండి..
స్వచ్ఛతే ఆరోగ్యానికి తొలిమెట్టు
శ్రీవారి ఆలయానికి ‘స్వచ్ఛ’ అవార్డు