Share News

విజయవాడలో ‘అందరికీ నమస్కారం’ అంటూ తెలుగులో సీఎం విజయ్ ప్రసంగం..

ABN , Publish Date - Oct 13 , 2026 | 08:44 PM

విజయవాడలోని పున్నమి ఘాట్‌లో నిర్వహించిన విజయవాడ ఉత్సవ్ సీజన్‌-2 కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పాల్గొన్నారు.

విజయవాడలో ‘అందరికీ నమస్కారం’ అంటూ తెలుగులో సీఎం విజయ్ ప్రసంగం..
Vijay in Vijayawada

విజయవాడ, అక్టోబర్ 13: నగరంలోని పున్నమి ఘాట్‌లో నిర్వహించిన విజయవాడ ఉత్సవ్ సీజన్‌-2 కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమిళనాడు సీఎం విజయ్ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించి అక్కడికి వచ్చిన వారిని ఆకట్టుకున్నారు.

‘అందరికీ నమస్కారం’ అంటూ తెలుగులో మాట్లాడిన ఆయన.. నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం తన అదృష్టం అని అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. విజయవాడకు రావడం.. ఇక్కడి ప్రజలను కలుసుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. తనపై అభిమానం చూపించిన ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.


తన పర్యటన గురించి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో నదుల అనుసంధానంపై చర్చించేందుకు ఇక్కడకు రావడం ఆనందంగా ఉందని విజయ్ తెలిపారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించే అవకాశం లభించడం సంతోషకరమని పేర్కొన్నారు. నదుల అనుసంధానం వంటి అంశాలు నీటి వనరుల వినియోగం, వ్యవసాయం, ప్రజల అవసరాలకు సంబంధించి ప్రాధాన్యం కలిగి ఉన్న నేపథ్యంలో ఈ భేటీపై ఆసక్తి నెలకొంది. ప్రసంగం చివరలో ‘థాంక్యూ విజయవాడ.. మీ అభిమానానికి, నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు’ అంటూ విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించడం.. స్థానిక ప్రజలకు ధన్యవాదాలు చెప్పడం ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇదిలా ఉంటే.. చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న విజయ్‌కు ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రి నారాయణ స్వాగతం పలికారు. అనంతరం ఇంద్రకీలాద్రిపై వెలసిన విజయవాడ కనకదుర్గమ్మను ఆయన దర్శించుకున్నారు. దుర్గమ్మ సన్నిధికి చేరుకున్న విజయ్‌కు దుర్గగుడి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం విజయ్‌కు వేదపండితులు వేదాశీర్వచనం అందించారు.


ఇవీ చదవండి

ఇంచ్‌ గ్యాప్‌లో బయటపడ్డాడుగా.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

సీసీటీవీ కెమరా నుంచి తప్పించుకోలేవు బ్రో.. జాగ్రత్త! వైరల్ వీడియో

Updated Date - Oct 13 , 2026 | 09:06 PM