CM Chandrababu: అన్ని తప్పులా?
ABN , Publish Date - Jan 07 , 2026 | 03:22 AM
భూముల రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో సమస్యలు ఎందుకొస్తున్నాయి? ఇందుకు కారణమెవరు? పాసు పుస్తకాల జారీలో కీలకమైన అంశాల్లో తప్పులు రావడమేమిటి.......
రీ సర్వే, పాస్‌పుస్తకాల్లో లోపాలపై సీఎం సీరియస్
అసలు తప్పులెందుకొస్తున్నాయ్!?
అన్నీ పక్కాగా చేస్తే సమస్యలెందుకొస్తాయ్?
రీ సర్వేలో అభ్యంతరాలను పరిశీలించండి
రైతుల సమక్షంలోనే సర్వే జరగాలి
క్షేత్రస్థాయికి వెళ్లి పక్కాగా పర్యవేక్షించండి
కీలకాంశాలపై రైతులకు స్పష్టత ఇవ్వండి
గ్రామసభల్లో రైతుల డేటా నిర్ధారించాకే పాస్ పుస్తకాల పంపిణీ
రైతు సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం
వారికి జవాబుదారీగా ఉండాల్సిందే
రెవెన్యూ అధికారులకు ఆదేశాలు
‘ఆంధ్రజ్యోతి’ కథనాల్లోని అంశాలపై సమీక్ష
9న మండపేటకు సీఎం చంద్రబాబు
అమరావతి, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ‘‘భూముల రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో సమస్యలు ఎందుకొస్తున్నాయి? ఇందుకు కారణమెవరు? పాసు పుస్తకాల జారీలో కీలకమైన అంశాల్లో తప్పులు రావడమేమిటి? ఇవన్నీ ముందే చూసుకోవాలి కదా!?’’ అంటూ రెవెన్యూ వర్గాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. జగన్ హయాంలో జరిగిన రీసర్వేలో తప్పుల తడకలు, వాటిని సరిదిద్దకుండానే ఇప్పుడు పాస్ పుస్తకాలు జారీ చేయడం, ఇతర కీలక అంశాలపై ‘ఆంధ్రజ్యోతి’ ఇటీవల వరుస కథనాలు ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి దీనిపై రెవెన్యూ మంత్రి, సీసీఎల్‌ఏ, ఇతర అధికారులతో ఆకస్మికంగా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... రీసర్వేలో లోపాలు, రైతులెదుర్కొంటున్న సమస్యలు, పాస్ పుస్తకాల ముద్రణలో నెలకొన్న అంశాలపై ఆయన అసంతృప్తి, అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అద్భుతంగా చేస్తున్నాం’ అని చెబుతున్నా మౌలిక అంశాల్లో సమస్యలెందుకొస్తున్నాయని ప్రశ్నించారు. రీ సర్వేలో లోపాలు, పాస్ పుస్తకాల్లో తప్పులపై రైతుల్లో నెలకొన్న సందేహాలు, సమస్యలకు రెవెన్యూశాఖ కార్యాచరణతో కూడిన స్పష్టత ఇవ్వాలని సీఎం ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం కురుకూరు, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం చివ్వరంలో జరిగిన రీసర్వేలో వచ్చిన తప్పులు, రైతుల ఆందోళనలను వివరిస్తూ ‘మళ్లీ అవే తప్పులు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ వార్తను ప్రచురించింది. పాస్ పుస్తకాల్లోని తప్పులు, సీఎం సొంత జిల్లాల్లోనే రైతులు ఎదుర్కొంటున్న చిక్కులపై ‘పాస్‌కాని పుస్తకాలు’ శీర్షికతో మరో వార్తను ప్రచురించింది. రైతుల్లో నెలకొన్న ఆందోళనలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. మంగళవారం నిర్వహించిన సమీక్షలో చంద్రబాబు ఈ అంశాలపైనే దృష్టి సారించారు.
రీ సర్వే... సంగతేమిటి?
‘‘మీరు చెబుతున్న దాని ప్రకారం, మీ నివేదికల ప్రకారం... అంతా పక్కాగా రైతుల సమక్షంలోనే రీసర్వే జరుగుతుంటే తప్పులు ఎందుకు వస్తున్నాయి? రైతులకు నోటీసులు ఇచ్చే సర్వే చేస్తున్నారా? సర్వేలో రైతులను భాగస్వాములను చేస్తున్నారా?’’ అని సీఎం ప్రశ్నించారు. సర్వే సరిహద్దుల చట్టం ప్రకారం వ్యవహరిస్తున్నామని, రైతుల సమక్షంలోనే కొలతలు వేస్తున్నామని అధికారులు నివేదించారు. అదే నిజమైతే రైతులు ఎందుకు ఆందోళనగా ఉన్నారని సీఎం ప్రశ్నించారు. ‘‘క్షేత్రస్థాయి తనిఖీలు చేశారా? రైతులతో మాట్లాడుతున్నారా?’’ అని ఆరా తీసినట్లు సమాచారం. సర్వే ముగిసిన తర్వాత రైతుల నుంచి వచ్చే అభ్యంతరాలను పరిశీలించాలని ఆదేశించారు. రైతుల విన్నపాలు కచ్చితంగా పరిశీలన చేయాలని... కోర్టు కేసులు, కుటుంబ తగాదాలున్నవి మినహా చట్ట పరిధిలో ఉన్న ప్రతి సమస్యనూ పరిష్కరించాలని దిశానిర్దేశం చేశారు. రీ సర్వే జరుగుతున్న గ్రామాలకు వెళ్లి స్వీయపరిశీలన చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు ఈ అంశంపై సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయికి వెళ్లి పర్యవేక్షణ చేయాలన్నారు. రీ సర్వే జరిగిన గ్రామాల్లో రైతులకు పంపిణీ చేయడానికి కొత్తగా రాజముద్రతో రూపొందించిన పట్టాదారు పాస్‌పుస్తకాల్లో తప్పులు ఎందుకు వచ్చాయని సీఎం ప్రశ్నించారు. ‘‘ఈ తప్పులకు కారణాలు ఏమిటి? రైతుల పేర్లు, ఫొటోలు, ఇతర వివరాలు ఎందుకు తప్పుగా వచ్చాయి? ముద్రణకు ముందే రైతుల డేటాను పునఃపరిశీలించలేదా? గ్రామ సభలు నిర్వహించలేదా?’’ అని సీఎం ప్రశ్నించారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ జోక్యం చేసుకొని, గత జూన్ డేటా ఆధారంగా పాసుపుస్తకాల ముద్రణ జరిగిందని వివరించారు. వీటిని గత ఆగస్టులోనే ఇద్దామనుకున్నామని, కానీ, జాప్యంవల్ల ఈ సమస్యలు వచ్చాయని వివరించినట్లు తెలిసింది. ఈ నేపఽథ్యంలో రెవెన్యూ రికార్డులను తాజాపరిచిన తర్వాతే కొత్త పాస్‌పుస్తకాలు అందించాలని సీఎం ఆదేశించారు.
‘‘ప్రభుత్వం ఇచ్చే పాస్‌పుస్తకాల ద్వారా రైతుల్లో నమ్మకం, భరోసా పెరగాలి. భూ రికార్డుల్లో గతంలో జరిగిన తప్పులను సరిదిద్ది ఇవ్వాలి. కొత్త పాస్‌పుస్తకాలు ముద్రించే ముందుగానే గ్రామసభల్లో ఆయా రైతుల నుంచి నిర్ధారణ చేసుకోవాలి. ఆ తర్వాతే ముద్రించాలి. రికార్డులను తారుమారు చేయడానికి ఆస్కారం లేకుండా తీర్చిదిద్దాం. ఎవరైనా ట్యాంపర్ చేయాలని ప్రయత్నించినా దొరికిపోతారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుందో రైతులకు వివరంగా చెప్పాలి. రికార్డుల్లో చేసే మార్పులకు రైతులకు ముందుగా సమాచారం ఇవ్వాలి. నోటీసులు ఇవ్వాలి’’ అని సీఎం ఆదేశించారు. రైతులు, భూ యజమానుల సమస్యల పరిష్కారంలో జవాబుదారీగా ఉండాలని స్పష్టం చేశారు. ‘‘ఇది రైతు సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యమిచ్చే ప్రభుత్వం. రీ సర్వే, పాసుపుస్తకాల జారీలో రైతుల సంతృప్తిస్థాయి ఎంత ఎక్కువగా ఉంటుందన్నదే కీలకం. దానికి అనుగుణంగానే మీరూ పని చేయాలి’’ అని తేల్చి చెప్పారు.
జైభారత్, జై తెలుగుతల్లి నినాదాలు
పట్టాదారు పాస్‌పుస్తకాల్లో రాజముద్ర, క్యూఆర్‌కోడ్‌తోపాటు ‘మీ భూమి- మీ హక్కు, జై భారత్, జై తెలుగు తల్లి’ అనే నినాదాలు ముద్రించాలని సీఎం ఆదేశించారు. తదుపరి పుస్తకాల్లో ఇవి ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీలో భాగంగా సీఎం చంద్రబాబు ఈ నెల 9న మండ పేట ప్రాంతానికి వెళ్లనున్నారు. రైతులతో ముఖాముఖి మాట్లాడనున్నారు. అనంతరం రైతులకు పాస్‌పుస్తకాలు అందించనున్నారు.