పెట్టుబడులు వస్తుంటే గొడ్డలి పార్టీకి కడుపుమంట
ABN , Publish Date - Nov 22 , 2026 | 02:21 AM
రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే, దాన్ని ఓర్చుకోలేక గొడ్డలి పార్టీ తప్పుడు ప్రచారానికి దిగుతోందని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కుమార్తె పెళ్లికి షర్మిల ఆహ్వానిస్తే రోత రాతలా?
కనీస మర్యాద, హుందాతనం పాటించాలి: చంద్రబాబు
రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే, దాన్ని ఓర్చుకోలేక గొడ్డలి పార్టీ తప్పుడు ప్రచారానికి దిగుతోందని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధికి సహకరించకపోగా, పెట్టుబడులు రాకుండా అడ్డంకులు సృష్టించడం, రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరించడమేమిటని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం పెట్టుబడిదారుల్లో విశ్వాసం కల్పిస్తూ ముందుకు వెళ్తుంటే, మరోవైపు గొడ్డలి పార్టీ విధ్వంసకర రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. కియా మోటార్స్ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి, తన కార్యకలాపాలను విస్తరిస్తున్న నేపథ్యంలో దాని అనుబంధ సంస్థలు కూడా ఏపీకి వస్తున్నాయని తెలిపారు.
దీనిపై కొందరు కావాలనే అపోహలు సృష్టిస్తున్నారని, తమిళనాడులోని కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ అంశంపై అనవసరంగా వివాదం సృష్టించే అవకాశం ఉందన్నారు. కియా సంస్థ ఏపీలో ఉందని, హోండా సంస్థ తమిళనాడులో ఉందని గుర్తు చేశారు. రాష్ర్టాల మధ్య పరిశ్రమల విషయంలో పోటీ ఉన్నా, పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణం కల్పించడమే ప్రభుత్వాల బాధ్యత కావాలని అన్నారు. గత పాలనలో పారిశ్రామిక రంగాన్ని తీవ్రంగా దెబ్బతీశారని విమర్శించారు.
వ్యక్తిగత సంబంధాలు, కుటుంబ బంధాల విషయంలోనూ రాజకీయ హుందాతనం పాటించాలని ముఖ్యమంత్రి హితవు పలికారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తన కుమార్తె వివాహానికి ఆహ్వాన పత్రిక అందించేందుకు వస్తే, దానిపై గొడ్డలి పార్టీ సొంత పత్రికలో రోత రాతలు రాయడం ఏమిటని ప్రశ్నించారు. సొంత చెల్లెలు తన కుమార్తె పెళ్లికి ఒక ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తే, దానిపైనా ఇంత నీచంగా కథనాలు రాస్తారా? అని నిలదీశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, తాను మంచి స్నేహితులుగా ఉన్నామని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
బెంగళూరుకు షర్మిల.. అడ్డుకునేందుకు జగన్ భారీ స్కెచ్..?
కేబీసీ సీజన్ 18 మొదటి కోటీశ్వరుడిగా యూపీఎస్సీ అభ్యర్థి