Share News

ధరల నియంత్రణకు నెలకు రూ.100 కోట్లు

ABN , Publish Date - Nov 21 , 2026 | 04:41 AM

నిత్యావసరాల ధరలను నియంత్రించేందుకు మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ కింద నెలకు రూ.100 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు పెడుతోందని సీఎం చంద్రబాబు తెలిపారు.

ధరల నియంత్రణకు నెలకు రూ.100 కోట్లు

  • బియ్యం నిల్వలు బ్లాక్‌ మార్కెట్‌కు మళ్లకుండా గట్టి నిఘా: సీఎం

అమరావతి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): నిత్యావసరాల ధరలను నియంత్రించేందుకు మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ కింద నెలకు రూ.100 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు పెడుతోందని సీఎం చంద్రబాబు తెలిపారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో నిత్యావసర ధరలపై ఆయన సమీక్ష నిర్వహించారు. బియ్యం నిల్వలు పక్కదారి పట్టకుండా పటిష్ఠ నిఘా ఏర్పాటు చేయాలని, ధరల నియంత్రణకు మార్కెట్‌ జోక్యంపై ఏడాది కాలానికి యాక్షన్‌ప్లాన్‌ సిద్ధం చేయాలని ఆదేశించారు. ధరల పెరుగుదలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, ప్రతివారం అధికారులు సమీక్షించాలని స్పష్టం చేశారు.

ద్రవ్యోల్బణం పెరగకుండా చూడాలన్నారు. ధరల నియంత్రణ విషయంలో పంటలు పండించిన రైతులకు నష్టం వాటిల్లకూడదు, అదేసమయంలో వినియోగదారులకూ కష్టం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కంది పంటను ప్రోత్సహించాలని, అలాగే నాసిక్‌ రకం ఉల్లిపాయలను రాష్ట్రంలో ఏ ప్రాంతంలో పండించవచ్చో అధ్యయనం చేసి, అక్కడి రైతులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ధరలను అదుపులోకి తెచ్చేందుకు, మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ చేసేందుకు ఖర్చవుతుందనే ఆలోచనే వద్దని సీఎం తేల్చిచెప్పారు. ధరల నియంత్రణపై నిరంతరం మార్కెట్‌ వాచ్‌, అగ్రీ వాచ్‌ చేస్తూ... వ్యూహాత్మకంగా వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు.

నిత్యావసరాలతో పాటు కూరగాయల ధరలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ విషయంలో రైతు బజార్లు కీలకంగా వ్యవహరించాలని చెప్పారు. ధరల నియంత్రణపై జిల్లాల వారీగా కలెక్టర్లతో సమావేశాలు ఏర్పాటు చేయాలని, విజిలెన్స్‌ నిఘా పెంచాలని డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తాను చంద్రబాబు ఆదేశించారు. మంత్రి నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ వచ్చేనెల 1 నుంచి కిలో రూ.100 చొప్పున కందిపప్పు, రూ.25 చొప్పున గోధుమ పిండి, లీటర్‌ రూ.125 చొప్పున పామాయిల్‌ను రేషన్‌ షాపుల ద్వారా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. రైతుబజార్ల ద్వారా కిలో రూ.35కే ఉల్లి విక్రయాలు కొనసాగుతున్నాయని, ‘ధరణి’ బ్రాండ్‌తో రైతు బజార్లలో తక్కువ ధరకే విక్రయిస్తున్న బియ్యానికి మంచి డిమాండ్‌ ఉందని తెలిపారు.

ఈ బియ్యాన్ని మొబైల్‌ వాహనాల ద్వారా కూడా విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెప్పారు. సమావేశంలో సీఎస్‌ సాయిప్రసాద్‌, పౌరసరఫరాలు, వ్యవసాయ, ఉద్యాన శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

పంట నష్టంపై సాయం అందించండి.. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌కు చంద్రబాబు వినతి

తాడిపత్రిలో హైటెన్షన్.. టీడీపీ శ్రేణులపై రాళ్ల దాడి

Updated Date - Nov 21 , 2026 | 04:46 AM