స్వీయ జనగణనలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Apr 16 , 2026 | 05:40 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వీయ జనగణనలో తన వివరాలను నమోదు చేసుకున్నారు. జనగణన ప్రక్రియలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
అమరావతి, ఏప్రిల్ 16: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వీయ జనగణనలో తన వివరాలను నమోదు చేసుకున్నారు. జనగణన ప్రక్రియలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. హౌస్ లిస్టింగ్- హౌస్ సెన్సెస్ కార్యక్రమంలో భాగంగా ఆన్ లైన్ ద్వారా వివరాల నమోదు ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. se.census.gov.in వెబ్ సైట్ ద్వారా ముఖ్యమంత్రి వివరాలను నమోదు చేసుకున్నారు. మొత్తం 33 ప్రశ్నలతో కూడిన ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియను ఏపీ జనగణన డైరెక్టర్ జె.నివాస్ ముఖ్యమంత్రికి వివరించారు.
ఈ నెల 30వ తేదీ వరకు ప్రజలు స్వయంగా ఆన్‌లైన్‌లో తమ ఇళ్లకు సంబంధించిన వివరాలు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించామని ముఖ్యమంత్రికి తెలిపారు. మే 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఎన్యుమరేటర్ అధికారులు ఇంటింటికీ వెళ్లి భౌతికంగా ఇళ్ల గణన ప్రక్రియను చేపడతారని తెలియచేశారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో పౌరులందరికీ సమానంగా అభివృద్ధి ఫలాలు అందించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. దీని కోసం కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుని అభివృద్ధి ప్రణాళికల్ని రూపొందించటం అవసరమని, ఈ లక్ష్య సాధనలో జనగణన కార్యక్రమం అత్యంత కీలకమని ముఖ్యమంత్రి అన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ఏపీలో జనగణన కార్యక్రమం జరుగుతోందని, ఇది కేవలం సమాచార సేకరణ మాత్రమే కాకుండా అభివృద్ధికి బలమైన పునాది వేస్తుందని అభిప్రాయపడ్డారు. జనాభా లెక్కల కార్యక్రమం రెండు దశల్లో జరగనుందని, మొదటి దశలో ఇవాల్టి నుంచే ఇండ్ల గణన ప్రారంభమైందని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి ప్రారంభమయ్యే రెండో దశలో జనాభా లెక్కల సేకరణ ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ప్రారంభమైన హౌస్ లిస్టింగ్- హౌస్ సెన్సెస్ కార్యక్రమంలో ప్రజలు స్వయంగా ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకునే అవకాశం ఉందని, దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. సరైన వివరాలను నమోదు చేయటం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించాలని ప్రజలను కోరారు. జనగణన కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి
పరిశ్రమలు రాకుండా చేయడానికే జగన్ ఇలా చేస్తున్నాడు: మంత్రి జనార్ధన్ రెడ్డి
బీసీలు చట్టసభల్లో ఉన్నపుడే వారికి న్యాయం జరుగుతుంది: శ్రీనివాస్ గౌడ్