ఏపీ హైకోర్టు తొలి మహిళా చీఫ్ జస్టిస్ లిసా గిల్‌కు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు..
ABN , Publish Date - Apr 23 , 2026 | 09:22 PM
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ లిసా గిల్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.
అమరావతి, ఏప్రిల్ 23: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ లిసా గిల్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు గురువారం తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో ..
‘ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ లిసా గిల్‌కు నా హృదయపూర్వక అభినందనలు. ఇదొక చారిత్రాత్మక మైలురాయి. న్యాయవ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచే దిశగా ఒక ముఖ్యమైన అడుగు పడింది. జస్టిస్ గిల్ తన సుదీర్ఘ కెరీర్‌లో సివిల్, క్రిమినల్, రాజ్యాంగ పరమైన అనేక అంశాలను సమర్థవంతంగా నిర్వహించారు. న్యాయ వ్యవస్థ పట్ల తనకున్న నిబద్ధతతో ఎంతో గౌరవాన్ని సంపాదించుకున్నారు. జస్టిస్ లిసా గిల్ చట్టబద్ధమైన పాలనను కాపాడుతూ.. విజ్ఞతతో, చిత్తశుద్ధితో న్యాయాన్ని అందిస్తూ.. స్ఫూర్తిదాయకమైన, ప్రభావవంతమైన పదవీకాలాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను’ అని రాసుకొచ్చారు.
25 నుంచి హైకోర్టు సీజేగా ..
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా లిసా గిల్ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ బుధవారం గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ నియామకం ఈ నెల 25 నుంచి అమల్లోకి వస్తుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ ఈనెల 24న పదవీ విరమణ చేయనున్నారు. 25 నుంచి జస్టిస్ లిసా గిల్ హైకోర్టు సీజేగా వ్యవహరించనున్నారు.
ఇవి కూడా చదవండి
సరికొత్త చరిత్ర సృష్టించిన హర్మన్ ప్రీత్ కౌర్
సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్‌డీఏ సమావేశం