ఏపీలో అత్యుత్తమ అవకాశాలు
ABN , Publish Date - Nov 14 , 2026 | 05:43 AM
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు సహకరించాలని ఖతర్ రాయబారి మహ్మద్ హసన్ జబీర్ అల్ జబీర్, గ్వాటెమాలా విదేశాంగ శాఖ వైస్ మినిస్టర్ జూలియో ఎడ్వార్డో ...
ఖతర్ రాయబారి అల్ జబీర్, గ్వాటెమాలా మంత్రి పెరెజ్‌తో భేటీలో సీఎం చంద్రబాబు
పారిశ్రామిక వేత్తలకు ఫోన్ కాల్ దూరంలోనే ప్రభుత్వం ఉంటుందని వెల్లడి
విశాఖపట్నం, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు సహకరించాలని ఖతర్ రాయబారి మహ్మద్ హసన్ జబీర్ అల్ జబీర్, గ్వాటెమాలా విదేశాంగ శాఖ వైస్ మినిస్టర్ జూలియో ఎడ్వార్డో ఒరోజ్కో పెరెజ్‌తో భేటీ సందర్భంగా సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా వారితో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. గ్రీన్‌ఫీల్డ్ పోర్టులు, లాజిస్టిక్స్ పార్కులు, ఆతిథ్య రంగాల్లో అత్యుత్తమ అవకాశాలు ఉన్నాయని ఖతర్ రాయబారికి చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలోని పోర్టులు, పెట్రో కెమికల్ ప్లాంట్లు, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులకు ఖతర్ సహకారం అందించాలని కోరారు.
ఎయిర్‌లైన్స్ రంగంలో ఖతర్ అత్యంత ప్రీమియం సేవలను అందిస్తోందని అల్ జబీర్ పేర్కొనగా.. ఖతర్ ఎయిర్‌వేస్ కనెక్టివిటీ పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుందని సీఎం చంద్రబాబు చెప్పారు. అమరావతిలో ఖతర్ దేశ కార్యాలయాన్ని ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని కోరారు. రాష్ట్రంలో వ్యవసాయం, ఆక్వా కల్చర్‌తో పాటు ఫుడ్ ఇండస్ట్రీలోనూ అత్యుత్తమ నాణ్యతను పాటిస్తున్నామని సీఎం వివరించారు.
ఏపీకి త్వరలో ఖతర్ బృందం: హసన్ అల్ జబీర్
గతంలో భారత్‌లో బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు ఖతర్ ఆసక్తి ప్రకటించిందని మహ్మద్ హసన్ అల్ జబీర్ తెలిపారు. అవకాశాలను పరిశీలించేందుకు ఖతర్ నుంచి అధికారిక బృందం త్వరలోనే ఏపీలో పర్యటిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రాజక్టులు, భవిష్యత్ ప్రణాళికలపై ఇచ్చిన ప్రజంటేషన్లు అద్భుతంగా ఉన్నాయని సీఎం చంద్రబాబును ప్రశంసించారు. ఇతర దేశాల్లో పనిచేస్తోన్న ఖతర్ కంపెనీలు ఏపీలోనూ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
ఖతర్ ఎయిర్‌వేస్ కనెక్టివిటీని దేశంలోని వివిధ నగరాలకు పెంచే విషయంలో కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. ఇప్పటికే ముంబైలో విజిట్ ఖతర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని, అన్ని రాష్ట్రాల్లోనూ అటువంటి కార్యాలయాలు ఏర్పాటుకు ఆసక్తిగా ఉన్నామన్నారు.
మా రైతులకు సహకరించండి: చంద్రబాబు
రాష్ట్రంలో ప్రకృతి సేద్యం ద్వారా ఉత్పత్తి అవుతున్న పంటలకు మార్కెటింగ్‌లో సలహాలు, ప్రళాళికలు ఇచ్చి రైతులకు సహకారం అందించాలని గ్వాటెమాలా వైస్ మినిస్టర్ పెరెజ్‌కు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో హార్టికల్చర్ ఉత్పత్తులకు విలువ జోడింపు అంశంపై ఇరువురు చర్చించారు. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణలో ఎంతో ముందున్న గ్వాటెమాలా రాష్ట్ర రైతాంగానికి సహకరించే అంశంపైనా మాట్లాడారు. ఇంధన రంగంలో ఏపీ ప్రగతి గురించి విన్నామని పెరెజ్ తెలిపారు.
ఆర్‌పీఎస్‌జీ గ్రూపునకు ఆహ్వానం
పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉండి తక్షణం స్పందిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. సీఐఐ సదస్సులో భాగంగా ఆర్‌పీఎస్‌జీ గ్రూపు ఎండీ శాశ్వత్ గోయెంకాతో ఆయన శుక్రవారం సమావేశమయ్యారు. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ, ఐటీ, క్రీడలు, వస్త్రాలు, ఫ్యాషన్ రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు. పీ-4 కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని ఆహ్వానించారు. తమ సంస్థ కార్యకలాపాలను విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామని శాశ్వత్ గోయెంకా అన్నారు.
పంచ్‌శీల్ రియాల్టీ 49 వేల కోట్లతో ప్రతిపాదనలు
ముఖ్యమంత్రి చంద్రబాబుతో పంచ్‌శీల్ రియాల్టీ చైర్మన్ అతుల్ చోర్డియా భేటీ అయ్యారు. అనకాపల్లి జిల్లాలో డేటా సెంటర్, విశాఖపట్నంలో ఐటీ పార్కు అభివృద్ధికి ఆ సంస్థ ప్రతిపాదనలు సమర్పించింది. ఈ రెండు ప్రాజెక్టుల ప్రతిపాదిత పెట్టుబడి మొత్తం రూ. 49,311 కోట్లు. వీటి ద్వారా 29,600 ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. పుణె ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ తరహాలో విశాఖలో హోటల్‌తో కూడిన ప్రపంచస్థాయి కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుపై సీఎంతో చోర్డియా చర్చించారు.
1,750 కోట్లతో అనకాపల్లిలో సెయింట్ గోబైన్ ప్లాంట్
ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద ప్రతిపాదన
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం వద్ద ఫ్లోట్ గ్లాస్ ప్లాంట్ ఏర్పాటుకు గ్లాస్ తయారీ సంస్థ సెయింట్ గోబైన్ సిద్ధమైంది. రూ. 1,750 కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్టు ఆ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, సీఈఓ ఎన్.శ్రీధర్.. ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ సందర్భంగా ప్రతిపాదించారు. ఈ ప్లాంట్‌తో 400 మందికి ఉద్యోగాలు కల్పిస్తారు. ఇప్పటికే తడ, విశాఖ, కావలిలో తమ యూనిట్లు ఉన్నాయని, భవిష్యత్తులో ప్లాస్టర్ బోర్డ్, ఇన్సులేషన్‌లో పెట్టుబడులు పెడతామన్నారు. దీనిపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ, విశాఖలో జీసీసీ, నిర్మాణరంగ ఉత్పత్తులపై పరిశోధనలు చేయాలని ఆహ్వానించారు. అమరావతి నిర్మాణంలో సేవలు అందించాలన్నారు. పెట్టుబడులకు రక్షణ కల్పించేఅంశం పారిశ్రామిక వేత్తల్లో విశ్వాసం కల్పించిందని శ్రీధర్ చెప్పారు. తెనాలిలో స్కిల్ డెవల్‌పమెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
ఈ వార్తలనూ చదవండి:
జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: మంత్రి లోకేశ్