జనవరి1 నుంచి పుస్తక మహోత్సవం
ABN , Publish Date - Nov 25 , 2026 | 04:44 AM
విజయవాడలో జనవరి 1 నుంచి 11వ తేదీ వరకు జరిగే 37వ పుస్తక మహోత్సవ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబును నిర్వాహకులు ఆహ్వానించారు.
ప్రారంభోత్సవానికి సీఎంకు ఆహ్వానం
విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం
కేటాయించాలని నిర్వాహకుల వినతి
విజయవాడ కల్చరల్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): విజయవాడలో జనవరి 1 నుంచి 11వ తేదీ వరకు జరిగే 37వ పుస్తక మహోత్సవ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబును నిర్వాహకులు ఆహ్వానించారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ, ప్రింటర్స్ అండ్ పబ్లిషర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలుసుకున్నారు.
గత 36 ఏళ్లుగా విజయవాడలో పుస్తక మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని ఆయనకు వివరించారు. పఠనాభిరుచిని పెంపొందించడంలో భాగంగా, విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమాలు, సాహిత్య సమావేశాలు, పుస్తక ప్రియుల పాదయాత్రను ఈ సందర్భంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. గత రెండేళ్లుగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పుస్తక మహోత్సవాలను నిర్వహిస్తున్న విషయం ఆయన దృష్టికి తెచ్చారు.
ఈసారి కూడా అదే వేదికను తమకు కేటాయించాలని కోరారు. ఏర్పాట్లను కూడా దృష్టిలో ఉంచుకుని డిసెంబరు 22 నుంచి జనవరి 16 వరకు స్టేడియంను కేటాయించాలంటూ వినతిపత్రం సమర్పించారు. ప్రజల్లో పుస్తక పఠనాభిరుచిని పెంపొందించేందుకు రీసెర్చ్ అండ్ రిఫరెన్స్ లైబ్రరీని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బుక్ ఫెయిర్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం, వివిధ శాఖల సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షుడు టి.మనోహర్ నాయుడు తదితర ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎస్‌ఐపీబీ సమావేశంలో కీలక నిర్ణయాలు
అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి