Share News

తుఫాన్‌ బాధితులందరికీ న్యాయం చేస్తాం: సీఎం

ABN , Publish Date - Oct 29 , 2026 | 03:47 AM

ఆర్నబ్‌ తుఫాన్‌తో ఇళ్లు, పంటలు, ఆస్తులు నష్టపోయిన ప్రతి బాధితుడికీ సాయం, న్యాయం చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

తుఫాన్‌ బాధితులందరికీ న్యాయం చేస్తాం: సీఎం

  • మృతుల కుటుంబాలకు - రూ.5 లక్షలు

  • దెబ్బతిన్న ఇళ్లకు - రూ.10 వేలు

  • దుకాణాలు, హోటళ్లకు - రూ.25 వేలు

  • శిబిరాల్లో ఉన్నవారికి - ఒకొక్కరికి రూ.1,000

  • కుటుంబానికి గరిష్ఠంగా రూ.3000

  • ఎంఎస్ఎంఈలకు - రూ.50,000 - లక్షన్నర

  • దెబ్బతిన్న ద్విచక్ర వాహనాలకు రూ.3 వేలు

  • త్రిచక్ర వాహనాలకు రూ.10 వేలు

  • ఫిషింగ్‌ బోట్లకు - రూ.9 వేలు

  • వలల మరమ్మతులకు - రూ.5 వేలు

అమరావతి, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): ఆర్నబ్‌ తుఫాన్‌తో ఇళ్లు, పంటలు, ఆస్తులు నష్టపోయిన ప్రతి బాధితుడికీ సాయం, న్యాయం చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తుఫాన్‌ ప్రభావాన్ని టెక్నాలజీతో ముందుగానే అంచనా వేసి, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామని అన్నారు.

తుఫాన్‌ ప్రభావం నుంచి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయడమే లక్ష్యంగా పనిచేశామని చెప్పారు. తుఫాన్‌ నష్టంపై కేంద్రానికి లేఖ రాశామని, కేంద్ర విపత్తులశాఖ మంత్రి అమిత్‌ షాతో ఫోన్‌లో మాట్లాడామని, నష్టం పరిశీలనకు కేంద్ర బృందాన్ని పంపాలని కోరినట్లు తెలిపారు. కేంద్రానికి గురువారం ప్రాథమిక నివేదిక ఇస్తామని, ఎన్యుమరేషన్‌ అయ్యాక పూర్తిస్థాయి నివేదిక అందిస్తామని పేర్కొన్నారు. ‘ఆర్నబ్‌ తుఫాన్‌ ప్రజా జీవనాన్ని అతలాకుతలం చేసింది. మూడురోజులుగా ఏడుసార్లు సమీక్షలు చేశాం, తీవ్రత గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాం. పరిస్థితులకు అనుగుణంగా అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేశాం.


ఆర్టీజీఎస్‌ ద్వారా కలెక్టర్లు, పోలీస్‌, ఇతర అధికారులకు సమాచారం పంపి, నష్ట తీవ్రతను తగ్గించాం. ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చేలా పని చేశాం. లోతట్టు ప్రాంతాలవారిని షెల్టర్లకు తరలించి, పునరావాసం, కనీస సదుపాయాలు కల్పించాం. గతంలో చాలా తుఫాన్లు చూశా. దివిసీమ ఉప్పెన, హరికేన్‌, హుదుహుద్‌, తిత్లీ, ఇప్పుడు ఆర్నబ్‌. దివిసీమలో ఆనాడు వేలమంది చనిపోయారు. అప్పడు టెక్నాలజీ లేదు. ముందస్తు సన్నద్ధత లేక నష్టం జరిగింది. తిత్లీ, హరికేన్‌ తుఫాన్ల సమయంలో 230 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా.. ప్రాణనష్టం పదుల సంఖ్యకు తగ్గించాం. ఆర్నబ్‌ కారణంగా ఐదుగురు చనిపోయారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. తుఫాన్లపై పనిచేసిన ప్రతిసారీ పాఠాలు నేర్చుకుంటున్నాం. గతంలో ఇంత టెక్నాలజీ లేకపోయినా సాధారణ పరిస్థితులు నెలకొనేలా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాం.

భారీగా తగ్గిన వర్షపాతం లోటు

ఒకప్పుడు తుఫాన్‌ అంటే శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అప్రమత్తం చేసేవాళ్లం. యంత్రాంగమంతా అక్కడే ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు టెక్నాలజీ సాయంతో ఎక్కడ ప్రభావం ఉంటుందో గుర్తించగలుగుతున్నాం. అందరినీ అప్రమత్తం చేయగలుతున్నాం. ప్రిడిక్షన్‌, ఆక్యురసీ, ఫీల్డ్‌లో అప్రమత్తత.. ఇదే మేం అనుసరించిన విధానం. ఆర్టీజీఎస్‌ నుంచి తుఫాన్‌ గమనాన్ని నిరంతరం పర్యవేక్షించాం. క్యాచ్‌మెంట్‌ ఏరియాలో కురిసిన వర్షపు నీటితో ఏ చెరువు నింపవచ్చు, ఏ రిజర్వాయర్‌ నింపాలో ముందుగానే టెక్నాలజీ వాడి ప్రణాళికను సిద్ధం చేశాం. ముందస్తు చర్యలతో ఒక్క చెరువుకు గండి పడకుండా కాపాడాం.

డ్రోన్లు, సీసీ టీవీ, శాటిలైట్‌ డేటా ఆధారంగా రోడ్లు ఎక్కడ దెబ్బతిన్నాయో గుర్తిస్తున్నాం. అత్యవసర పరిస్థితుల్లో ఔషధాలు, ఆహారం అందించేందుకు డోర్‌ డెలివరీ కోసం 75 డ్రోన్లుఅందుబాటులో ఉంచాం. రాత్రంతా ఇదే పని మీద ఉన్నాం. 30వేల మంది క్షేత్రస్థాయి సిబ్బందికి సూచనలిచ్చాం. నాతో సహా అధికారులు, కలెక్టర్లు, క్షేత్రస్థాయి సిబ్బంది రాత్రంతా నిద్ర లేకుండా పనిచేశారు. రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. ఆర్టీజీఎస్‌ అధికారి భాస్కర్‌ గంట కూడా నిద్ర పోలేదు. ఉదయాన్నే విధులకు వచ్చారు.


అప్పుడే రిలాక్స్‌ కావొద్దు

గురువారం సాయంత్రం వరకు శ్రీకాకుళం, అల్లూరి, మన్యం, అనకాపల్లిలాంటి చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీనిపై అక్కడి వారిని అప్రమత్తం చేశాం. తుఫాన్‌ పూర్తిగా బలహీనపడే వరకు జాగ్రత్తగా ఉండాలి. తుఫాన్‌ వల్ల కొబ్బరి, వరి బాగా దెబ్బతిన్నాయి. వాటి వివరాలు సేకరిస్తాం. ఇళ్లలోకి నీళ్లు వస్తే 25 కిలోలు, మత్స్యకారులు, చేనేతలకు 50 కిలోల బియ్యం ఇస్తాం.

కిలో కందిపప్పు, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, పంచదార, లీటర్‌ పామాయిల్‌ పంపిణీ చేస్తాం. శిబిరాల్లో ఉన్నవారు తిరిగి వెళ్లేటప్పుడు ఒక్కో వ్యక్తికి రూ.1,000, కుటుంబానికి గరిష్ఠంగా రూ.3వేల వరకు ఖర్చుల కోసం అందిస్తాం. తుఫాన్‌ మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు, ఇళ్లు పాక్షికంగా దెబ్బతింటే రూ.10వేలు, దుకాణాలకు రూ.25వేలు, ఎంఎస్ఎంఈలకు టర్నోవర్‌ను బట్టి రూ.50వేల నుంచి రూ. లక్షన్నర వరకు సాయం చేస్తాం.’’ అని తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

పోటాపోటీ

ఆర్నబ్ తుఫాన్ బాధితులకు సీఎం చంద్రబాబు భారీ ఊరట

Updated Date - Oct 29 , 2026 | 03:47 AM